నో బీమా.. నో పెట్రోల్.. సుప్రీం సంచలనం!

బీమా చేయించని వాహనం ఏదైనా సరే దానికి అవసరమైన ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Update: 2026-08-05 06:39 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన చేసింది. బీమా చేయించని వాహనం ఏదైనా సరే దానికి అవసరమైన ఇంధనం (పెట్రోల్, డీజిల్) కొట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దేశంలో అంతకంతకూ ప్రమాదాలు పెరుగుతున్నా.. వాహనాలకు బీమా చేయించుకునే విషయంలో ప్రజలు చూపిస్తున్న నిర్లక్ష్యంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో కొట్టకుండా బ్యాన్ చేసేలా ఒక పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలన్న ప్రతిపాదన చేసింది.

ఇంతకూ ఈ సంచలన వ్యాఖ్యకు కారణం చూస్తే.. 1996లో జరిగిన ఒక రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టిన సందర్భంగా.. రోడ్లపై తిరిగే వాహనాల్లో 56 శాతం వాహనాలకు బీమా లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు బీమా లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశ వ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా పేర్కొంది.

ఈ సందర్భంగా బీమా చేయని వాహనాల్ని నడిపే వాహనదారులకు సైతం ఫైన్లు వేయటం.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు అదనంగా లేదంటే రూ.5వేలు.. ఏది ఎక్కువైతే దాన్ని జరిమానాగా వసూలు చేయాలని పేర్కొంది. ఒకవేళ రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు ఐదు రెట్లు అధికంగా ఫైన్ వేయటం కానీ రూ.10వేలు జరిమానా విధించటం కానీ చేయాలని చెప్పింది.

అంతేకాదు.. కొత్త కార్లకు.. బైకులకు చేపట్టాల్సిన థర్డ్ పార్టీ బీమా మొత్తానికి సంబంధించిన కాల వ్యవధి అంశంపైనా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతం 3 ఏళ్లుగా ఉంటే దాన్ని నాలుగేళ్లకు పెంచాలని ఆదేశించింది. అదే సమయంలో కొత్త టూవీలర్ వాహనాలకు ఐదేళ్ల గడువును ఆరేళ్లకు పొడించాలని పేర్కొంది.

అంతేకాదు.. నేషనల్ హైవేలు.. నగరాల్లోని ఆటోమేటివ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ వాహన్ డేటా బేస్.. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధానం చేయాలని సుప్రీం చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం చేసిన ప్రతిపాదనలు.. ఆదేశాల్ని పరిగణలోకి తీసుకొని నిబంధనల్ని మారిస్తే మాత్రం.. మోటారు వాహన రంగంలో భారీ మార్పులకు కారణమవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News