విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంపై హైకోర్టు ఏం చెప్పింది?
ఈ ప్రాజెక్టు అనుమతులలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని.. పర్యావరణ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా లేదని పిల్ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విశాఖపట్నంలో గూగుల్-అదానీ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన 15 బిలియన్ డాలర్ల (రూ. 1.2 లక్షల కోట్లకు పైగా) మెగా డేటా సెంటర్ ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడానికి (స్టే ఇవ్వడానికి) న్యాయస్థానం నిరాకరించింది. అయితే ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులు, దానికి కావలసిన భారీ నీరు.. విద్యుత్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర వివరణ కోరింది. పర్యావరణ అనుమతుల విషయంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తూ ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ ప్రాజెక్టు అనుమతులలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని.. పర్యావరణ అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా లేదని పిల్ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన భారీ విద్యుత్, నీటి వినియోగం స్థానిక వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అందిస్తున్న రూ. 22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్‌కు సంబంధించిన ప్రతి ప్రక్రియ చట్టబద్ధంగా, నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరుగుతోందని హైకోర్టుకు విన్నవించింది.
మరోవైపు ఈ 1 గిగావాట్ (జిడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఏప్రిల్ 29న విశాఖపట్నంలో జరిగిన భూమిపూజ అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊతాన్నిస్తుందని తెలిపారు. ఇది కేవలం ఒక్క పెట్టుబడి మాత్రమే కాదని.. రాష్ట్రంలో డిజిటల్, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను (ఎకోసిస్టమ్) పూర్తిగా మార్చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు కేవలం డేటా సెంటర్‌కే పరిమితం కాకుండా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, సర్వర్ తయారీ - పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీని ద్వారా లభించే ఉద్యోగాలు కేవలం డేటా సెంటర్‌కే పరిమితం కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వంటి అనేక రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
అయితే విశాఖపట్నంలో ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు వలన ఎదురయ్యే నీటి ఎద్దడి - విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల నగరంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నిరసనకారులు ``మేము డేటాను తాగలేము`` అనే నినాదాలతో కూడిన బానర్లను ప్రదర్శిస్తూ తమ ఆందోళనను తెలియజేశారు. హైకోర్టు కల్పించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామికాభివృద్ధి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుందనేది పూర్తిగా కోర్టుకు వివరించాల్సి ఉంటుంది.