చేదెక్కిన చక్కెరలో .. ఈ20 భాగం ఎంత ?!
చక్కెర ధరలు గత 30 రోజులలో ఏకంగా 29 నుండి 31 శాతం పెరిగాయి. జూలై చివరి మాసంలో దేశంలో కిలో చక్కెర రిటైల్ ధర రూ.48 - 49 ఉండేది.
చక్కెర ధరలు గత 30 రోజులలో ఏకంగా 29 నుండి 31 శాతం పెరిగాయి. జూలై చివరి మాసంలో దేశంలో కిలో చక్కెర రిటైల్ ధర రూ.48 - 49 ఉండేది. ప్రస్తుతం కిలో రూ.65కు పెరిగింది. కొన్ని చోట్ల రిటైల్ ధర రూ.70 - 76 వరకు అమ్ముతున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 35 నుండి 38 శాతం వరకు ధరలు పెరిగాయి. కేవలం నెల రోజుల్లో చక్కెర ధరలు పెరగడం ఇదే తొలిసారి.
చక్కెర ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఉత్పత్తి తగ్గడమే అని చెబుతున్నారు. 2025 - 26 సీజన్లో ఉత్పత్తి అంచనా 343 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉండగా అది 306 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గింది. చెరకు సాగులో అధిక వర్షాలు, ఎర్రకుళ్లు తెగులు మూలంగా దిగెబడి తగ్గిపోయింది. అంతర్జాతీయంగా కూడా సరఫరా కొరత ఈ పరిస్థితికి కారణం అని చెబుతున్నారు. ప్రభుత్వం దిగుమతులకు అనుమతించి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అయితే మరో వైపు ఈ20 పెట్రోలు మూలంగానే చక్కెర ధరలు పెరుగుతున్నాయని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ మేరకు ఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ తమను గోవా ఎన్నికల్లో గెలిపిస్తే ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు రోజులలో ఈ20 పెట్రోలుపై నిషేధం విధిస్తామని, అలా చేయకపోతే రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ20 పెట్రోలు వాడకం మూలంగా వాహనాల ఇంజన్లు దెబ్బతిని సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ20 వల్లే చక్కెర ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ20 పెట్రోలుకు, చక్కెర ధరల పెరుగుదలకు అసలు సంబంధం ఉందా ? అంటే ప్రత్యక్షంగా ప్రధాన కారణం కాదు అని పలు ప్రభుత్వ మరియు ఇతర నివేదికలు చెబుతున్నాయి. ఇథనాల్ కోసం చెరకు మల్లింపు 2022 -23లో 12 శాతం ఉండగా, అది 2025 - 26 నాటికి 9 శాతానికి తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో ఎక్కువభాగం ఇథనాల్ తయారీకోసం 3/4 వంతు మొక్కజొన్నలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ధరల పెరుగుదలకు ఉత్పత్తి తగ్గుదల, వాతావరణం, డిమాండ్ మాత్రమే ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. ఈ20 పెట్రోలు వాడడం మూలంగా వాహనాలు దెబ్బతింటున్నాయి అన్నది సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తప్ప అధికారిక అధ్యయనాలు వీటిని గుర్తించడం లేదు.
దేశంలో అవసరమైన మోతాదులో 85 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడం, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఫారిన్ ఎక్సేంజ్ ఆదా చేయడం, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతులకు ఆదాయం పెంచడం, దేశీయ ఇంధనం పెంచడం ప్రధాన లక్ష్యంగా ఈ20 పెట్రోలును భారత ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్నదని చెబుతున్నారు. దీనిమూలంగా వాహనాల మైలేజీ తగ్గవచ్చు కానీ అంతకుమించి పెద్ద నష్టం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో చక్కెర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇవి ఎప్పుడు అదుపులోకి వస్తాయి ? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? అని సామాన్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.