పది కోట్ల పుణ్య స్నానాలు...పుష్కరాలు అదిరి పోవాల్సిందే !

గోదావరి జీవనది. దేశంలో పొడవైన నదులలో ఒకటి. ఎక్కడో మహారాష్ట్రలో చిన్నగా తన ప్రయాణం ప్రారంభించి తెలంగాణా మీదుగా ఏపీకి బిర బిరా పారుతూ వస్తుంది.

Update: 2026-08-26 03:30 GMT

గోదావరి జీవనది. దేశంలో పొడవైన నదులలో ఒకటి. ఎక్కడో మహారాష్ట్రలో చిన్నగా తన ప్రయాణం ప్రారంభించి తెలంగాణా మీదుగా ఏపీకి బిర బిరా పారుతూ వస్తుంది. ఎక్కడా చూడని అఖండ స్వరూపం గోదావరి ఆంధ్రాలోనే చూపిస్తుంది. ఆ అద్భుతమైన రూపం చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. నిజానికి గోదావరి తల్లి సొగసులు సోయగాలు వయ్యారాలు వంపులు అన్నీ తనివి తీరా చూడాలంటే రాజమండ్రిలోనే అని చెప్పక తప్పదు, గోదావరి కడలి రేడుని కలిసే క్రమంలో అఖండంగా నిండుగా కనిపించి అందరినీ ఆనందింపచేస్తుంది.

ఆధ్యాత్మిక రూపంగా :

గోదావరి కేవలం అందాలతో అలరించేదే కాదు భక్తితో పరవశింపచేసేదే అని కూడా చెప్పాలి. ఒక వైపు ఆహ్లాదకరంగా కనిపిస్తూ మరో వైపు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించడం గోదావరికే చెల్లు. అలాంటి వయ్యారి గోదారమ్మ పుష్కరాలు పన్నెండేళ్ళకు వస్తాయి. మామూలుగానే ఎంతో హృద్యంగా కనిపించే గోదావరి తల్లిని పుష్కరాల వేళ చూసేందుకు వేయి కన్నులు కావాలి. పవిత్ర గోదావరిగా మారి భక్త జనులను తరింప చేసే ఈ అపురూప ఘట్టం ఎపుడు వచ్చినా ఏ తరానికి ఆ తరం పరవశంతో పులకించిపోతుంది. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అంతా అఖండ గోదావరి మాతను చూసి ఎంతగానో మురిసిపోతారు. తపో దీక్షగా సాగే గోదావరి పుష్కరాలు అన్నది ఆధ్యాత్మిక భావనకు అతి పెద్ద మెట్టుగా అంతా భావిస్తారు. అలాంటి పుష్కరాలకు వేళ అవుతోంది. కేవలం పది నెలల కాలం మాత్రమే వ్యవధి ఉంది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి పుష్కర ఏర్పాట్ల మీద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు.

ఏపీ జనాభాకు రెట్టింపుగా :

ఇక చూస్తే 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు వస్తారని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015 మహా పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని లెక్క ఉంది. 2027లో జరిగే పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇంతటి భారీ రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామని అంటున్నారు. పుష్కరాల్లో భాగంగా 4,026 కోట్ల రూపాయలతో 4,932 పనులను చేపడుతున్నారు.

గంటకు పది వేల మంది :

ఇక తూర్పుగోదావరి జిల్లాలో 82 ఘాట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 ఘాట్లు, కోనసీమ జిల్లాలో 175 ఘాట్లు, ఏలూరు జిల్లాలో 44 ఘాట్లు, కాకినాడ జిల్లాలో 88 ఘాట్లు, పోలవరం జిల్లాలో 11 ఘాట్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు తెలిపారు. రోజుకు కోటి మంది 440 ఘాట్లు అంటే ఒక్కో ఘాటులో కనీసం రెండు లక్షల మంది దాకా భక్తులు స్నానాలు చేస్తారు అన్న మాట. రోజులో ఇరవై నాలుగు గంటలూ పుష్కర స్నానాలు కొనసాగుతాయి కాబట్టి సుమారుగా గంటకు పది వేల మంది ఒక్కో ఘాటులో కనిపిస్తారు. మరి ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు.

దేశమంతా ఏపీకే :

అఖండ గోదావరి స్వరూపంతో ఉండే పుష్కర గోదావరిని చూసి తరించేందుకు పుణ్య స్నానం ఆచరించేందుకు దేశమంతా ఏపీకే వస్తుందని అంటున్నారు. అందుకే కోట్లాది మంది భక్తులు ప్రతీ రోజూ వస్తారని అంచనా కడుతున్నారు. అలాగే పుష్కరాల కోసం ఏపీకి వచ్చే వారి కోసం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో నాలుగు క్షేత్రాలు, ఇంకా ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

ప్రపంచ స్థాయి మౌలిక వసతులు :

పుష్కరాలకు వచ్చే భక్తులు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలని కోరారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు, దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో 2027లో వచ్చే గోదావరి పుష్కరాలు అదిరిపోతాయని అంటున్నారు.

Tags:    

Similar News