రాహుల్ కోర్టులో 'కొండా' బంతి !
1990లలో కాంగ్రెస్ పార్టీతోనే కొండా దంపతులు రాజకీయాల్లోకి వచ్చారు. కొండా సురేఖ మండల పరిషత్ సభ్యురాలిగా, 1996లో పీసీసీ సభ్యురాలిగా కొనసాగింది.
‘నా రాజకీయ ప్రస్థానం మొదలయింది కాంగ్రెస్ పార్టీతోనే. గాంధీ కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం’. 2018లో బీఆర్ఎస్ పార్టీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో భర్తి కొండా మురళితో కలిసి కాంగ్రెస్ పార్టీ చేరిన సమయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు సుష్మిత వ్యాఖ్యలు, పదవి నుండి తొలగించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ భవితవ్యం ఇప్పుడు రాహుల్ గాంధీ చేతిలో ఉంది.
1990లలో కాంగ్రెస్ పార్టీతోనే కొండా దంపతులు రాజకీయాల్లోకి వచ్చారు. కొండా సురేఖ మండల పరిషత్ సభ్యురాలిగా, 1996లో పీసీసీ సభ్యురాలిగా కొనసాగింది. 1999లో శాయంపేట ఎమ్మెల్యేగా గెలిచి, ఏఐసీసీ సభ్యురాలిగా, సీఎల్పీ కోశాధికారిగా పదవులు నిర్వహించారు. 2009లో పరకాల నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మహిళా అభివృద్ధి మరియు బాలల సంక్షేమ మంత్రిగా పనిచేశారు.
వైఎస్ మరణం అనంతరం 2011లో వైఎస్ జగన్ ను సీఎంగా చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమ సమయంలో పరకాల నుండి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయింది. 2013లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కొద్ది కాలం కొనసాగి అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 26న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2023 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టింది.
రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన కొండా సురేఖ భవితవ్యం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉండడం గమనార్హం. 2023 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కొండా సురేఖకు మద్దతుగా 2023 నవంబర్ 17న రాహుల్ గాంధీ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి కొండా సురేఖ వివరణ ఇచ్చినా ఆమెను పదవి నుండి ఉంచాలా ? దించాలా ? అన్న కీలక నిర్ణయం రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉంది. 2023లో కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో స్వయంగా సోనియాగాంధీ అధే వేదిక మీద ఉండి ఆమెను అభినందించారు.
కొండా సురేఖ బీసీ సామాజిక నేపథ్యం ఆమెను కాపాడుతుందని కాంగ్రెస్ పార్టీలోని సురేఖ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆమె తరపున ఢిల్లీ స్థాయిలో కేవీపీ రాంచందర్ రావు చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా క్రమశిక్షణ సంఘం ఆమెను పదవి నుండి తప్పించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో మొత్తంగా రాహుల్ గాంధీ నిర్ణయమే కీలకం కానున్నది. మరి కొండా పదవి ఏమవుతుంది అన్నది వేచి చూడాల్సిందే.