లోకల్ ఫైట్... వారంతా పాస్ కావాల్సిందే !

స్థానిక ఎన్నికలు ఎందుకు వచ్చాయి అంటే షెడ్యూల్ ప్రకారం జరగాలి కాబట్టి అని చెబుతారు.

Update: 2026-08-26 05:30 GMT

స్థానిక ఎన్నికలు ఎందుకు వచ్చాయి అంటే షెడ్యూల్ ప్రకారం జరగాలి కాబట్టి అని చెబుతారు. కానీ ప్రధాన పార్టీల నాయకులు మాత్రం తమకు అగ్ని పరీక్ష పెట్టేందుకు అంటున్నారు. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ రెండూ కూడా స్థానిక ఎన్నికలను ఒక పరీక్షగా పెట్టాయి. తమ పార్టీ నేతలకు జగన్ అయితే అల్టిమేటం జారీ చేశారు. ఇక టీడీపీ అధినాయకత్వం అయితే రెండేళ్ళు గడచినా పెద్దగా స్పందన లేని అనుకున్న విధంగా పనిచేయని ఎమ్మెల్యేలకు ఒక సవాల్ గా ఈసారి సత్తా చాటాలని కోరుతోంది. దాంతో సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చింది అన్నట్లుగా లోకల్ ఫైట్ లో అసలైన ఫైట్ తమదే అని రెండు పార్టీలలోని నాయకులు వాపోతున్నారుట.

టీడీపీ ఈసారి గట్టిగానే :

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపైన అధినాయకత్వం గుస్సాగా ఉంది అని అంటున్నారు. వారికి ఎన్ని సార్లు చెప్పినా దిశా నిర్దేశం చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని ఆగ్రహిస్తోంది. వీరికి మరోసారి క్లాస్ తీసుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. తొందరలోనే వీరిని పిలిచి లోకల్ బాడీ ఎన్నికల మీద చెప్పాల్సింది చెప్పి పరీక్షలు సిద్ధం కావాల్సిందే అని హెచ్చరిస్తారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సరైన ఫలితాలు చూపించని ఎమ్మెల్యేలు కీలక నాయకుల మీద అయితే టీడీపీ ఉపేక్షించేది లేదని అంటున్నారు.

టికెట్లు హుళక్కేనా :

అదే విధంగా వైసీపీలో అధినేత జగన్ కూడా పదే పదే ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు.స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అన్న మాట ఏ వైసీపీ ఇంచార్జి నియోజకవర్గంలో వినిపించిందో ఇక వారికి 2029 ఎన్నికల్లో ఆశలు వదిలేసుకోవాల్సిందే అని హెచ్చరించారు. పంచాయతీ వార్డు నుంచి మేయర్ వరకూ అన్ని పదవులకూ కూటమితో పోటీ పడాల్సిందే అని వైసీపీ అభ్యర్ధి ఎదురుగా నిలిచి ఉండాల్సిందే అని కూడా జగన్ క్లారిటీగా చెప్పేశారు. దాంతో వైసీపీ ఇంచార్జిలలో కూడా తీవ్ర కలవరం చెలరేగుతోంది.

అసలు విజేతలు వారేనా :

ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ అసలు విజేతలు మాత్రం టీడీపీలో అధినాయకత్వం ఫోకస్ పెడుతున్న కొందరు ఎమ్మెల్యేలు అని అంటున్నారు. అలాగే వైసీపీలో అయితే ఏకగ్రీవాలు కాకుండా చేస్తే గెలిచేసినట్లే అని ఇంచార్జిలు భావించాల్సి ఉంటుంది. ఇలా అటూ ఇటూ అధినాయకత్వం హెచ్చరించి మోహరించడంతో ఈసారి స్థానిక సమరం అన్నది మామూలుగా జరిగే వ్యవహారం కాదని అంటున్నారు. వైసీపీ ఏకగ్రీవాలకు గండి కొడితే టీడీపీ కూటమి బలంగా ఉంటుంది కాబట్టి అసలు ఊరుకోదని అంటున్నారు. అలాగే వైసీపీ తమకు బలం ఉన్న చోట దూకుడు చేసి గెలిస్తే ఆయా చోట్ల టీడీపీ కానీ కూటమి ఎమ్మెల్యేలకు కానీ ఇబ్బందే అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ భీకర సమరంలో ఎవరు ఎలా రంగంలోకి దిగుతారో.

Tags:    

Similar News