దశాబ్దం తరువాత ఆర్టీసీలో ఎన్నికల వేడి !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.

Update: 2026-08-26 05:50 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. అప్పటి నుండి ఆర్టీసీలో యూనియన్లు చలామణిలో ఉన్నాయి. అయితే 1975 తర్వాత యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ బలంగా ఉండేది. కొన్ని రీజియన్లలో ఎంప్లాయిస్ యూనియన్ బలంగా ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో టీెఎంయూ కీలకంగా మారింది. అయితే మొత్తంగా నేషనల్ మజ్టూర్ యూనియన్ ఆర్టీసీలో ఆధిక్యంలో ఉండేది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2019లో ఆర్టీసీలో యూనియన్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అప్పటి నుండి తెలంగాణలో యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో విడిపోయిన తర్వాత 2016 ఫిబ్రవరిలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో 709 ఓట్ల మెజారిటీతో నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయం సాధించగా, 2018 ఆగస్టులో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం సాధించింది.

2020 జనవరి 1న ఏపీఎస్ఆర్టీసీని కార్పోరేషన్ నుండి ప్రభుత్వ సర్వీసులో విలీనం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. అదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్పు 58 నుండి 60 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ వచ్చింది.

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేయడం, గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇది అమల్లోకి రాకముందే ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఆ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోయింది.

గత ఏప్రిల్ 26న టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు 32 డిమాండ్లతో సమ్మెకు దిగారు. ప్రధానంగా యూనియన్ ఎన్నికలు, పీఆర్సీ, ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఇందులో ప్రధానమైన డిమాండ్లు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలతో కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో ప్రభుత్వం గుర్తింపు యూనియన్ ఎన్నికల నిర్వహణకు అంగీకరించింది.

2026 జూన్ 5న కార్మిక విభాగం జాయింట్ కమీషనర్ సునీత గోపాల్ దాస్ ను ప్రభుత్వం రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. జులై1న రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు వచ్చే నెలాఖరున గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన యూనియన్ ప్రతినిధులు మాత్రమే ఆర్టీసీ విలీన కమిటీలో ఉండాలని ప్రభుత్వం, కార్మికులు ఆంగీకరించారు. అందుకే విలీన ప్రక్రియకు ముందు ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రధానంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజెఎంయూ) , తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (టీఎస్ఆర్ఎస్ ఎంయూ), ప్లాయిస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్లూ ఎఫ్), తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, తెలంగాణ కార్మిక పరిషత్ తదితర సంఘాలు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం ఆర్టీసీలోని 35 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కుతో గుర్తింపు యూనియన్ ను ఎన్నుకోనున్నారు. మొత్తానికి దశాద్దకాలం తరువాత జరుగుతున్న ఎన్నికల్లో ఏ యూనియన్ విజయం దక్కించుకోబోతున్నదో వేచిచూడాలి.

Tags:    

Similar News