నటి డ్రెస్సింగ్ సెన్స్ .. ఇంత పొలిటికల్ రచ్చ అవసరమా?
సినిమా తారలు ధరించే దుస్తులు.. వారి ఫ్యాషన్ ఎంపికలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం ఈనాటి వింతేమీ కాదు.
సినిమా తారలు ధరించే దుస్తులు.. వారి ఫ్యాషన్ ఎంపికలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం ఈనాటి వింతేమీ కాదు. అయితే ఒక బ్రాండ్ ప్రకటనలో నటి కృతి సనోన్ ధరించిన దుస్తులపై మొదలైన సాధారణ విమర్శ, చివరకు జాతీయ స్థాయి రాజకీయ రచ్చగా మారడం భారతదేశ రాజకీయాల దిగజారుడుతనానికి అద్దం పడుతోంది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు, వారి దుస్తుల ఎంపికకు భారత రాజ్యాంగం - ఉన్నత న్యాయస్థానాలు ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. అయినా ఒక నటి దుస్తుల చుట్టూ జాతీయ రాజకీయాలు తిరగడం.. కొన్నిసార్లు కోర్టుల వరకు వివాదాలు వెళ్లడం చూస్తుంటే వ్యవస్థ ఎంత అనవసరమైన అంశాలపై సమయాన్ని వృథా చేసుకుంటోందో అర్థమవుతుంది. ఇది ఒక నాశిరకం రాజకీయ వ్యవస్థ అనే విమర్శలు ఇప్పుడు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి.
రాఖీ పండుగ ప్రకటనలో కృతి సనోన్ వస్త్రధారణను తప్పుబడుతూ బీజేపీ ఎంపీ.. నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ప్రధాన బీజం వేశాయి. సాంప్రదాయ పండుగలో అలాంటి దుస్తులు ధరించడం సముచితం కాదని కంగనా తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. దీనికి స్పందించిన కృతి సనోన్, `సంస్కృతి - సంప్రదాయాలు హృదయాలలో ఉంటాయి తప్ప.. ధరించే దుస్తుల నెక్-లైన్‌లో కాదు! అని ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. మహిళ గౌరవాన్ని వారు వేసుకునే బట్టలతో కొలవడం ఎప్పుడు ఆపుతారని కృతి ప్రశ్నించారు. ఇది ఒక నటి తనకు ఎదురైన విమర్శకు ఇచ్చిన వ్యక్తిగత వివరణగా ముగిసిపోవాల్సిన అంశం.
అయితే ప్రతి చిన్న అంశంలోనూ రాజకీయ లబ్ధిని వెతుక్కునే ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వివాదంలోకి ప్రవేశించి కృతి సనోన్ ప్రకటనను షేర్ చేస్తూ ''మహిళలు ఏమి వేసుకోవాలి.. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ!'' అని ట్వీట్ చేయడంతో ఈ అంశం ఒక్కసారిగా `బీజేపీ వర్సెస్ కాంగ్రెస్` రాజకీయ యుద్ధంగా మారింది. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, దేశభద్రత వంటి ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చలు పక్కకుపోయి.. ఒక నటి డ్రెస్సింగ్ సెన్స్ చుట్టూ దేశ రాజకీయాలు తిరగడం మన రాజకీయ నాయకుల ప్రాధాన్యతలను ప్రశ్నార్థకం చేస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా కనిపిస్తున్నది నాయకుల అవసరం లేని వివాదాలతో అంటకాగడం.. నోటిదురుసు లక్షణం.. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే నైజం. ఇక్కడ సమస్య కృతి సనోన్ డ్రెస్సింగ్ సెన్స్ కానే కాదు.. సమాజంలో ఒక మహిళ మరొక మహిళ వస్త్రధారణను వేలెత్తి చూపడం... దానికి పురుష నాయకులు తమ స్వార్థానికి అనుగుణంగా రంగులు పులమడం అసలైన సమస్య. స్త్రీ స్వేచ్ఛ అనేది కేవలం మైకులు ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే ప్రసంగాలకు మాత్రమే పరిమితమవుతోంది తప్ప... నిజమైన గౌరవాన్ని ఇవ్వడంలో రాజకీయ వ్యవస్థ విఫలమవుతోంది. జెండర్ పరంగా ఆలోచించినా ఈ తరహా వివాదాలు సమాజానికి ఎలాంటి సానుకూల సందేశాన్ని ఇవ్వవు.
రాజకీయ నాయకులకు రోజువారీ వార్తల్లో నిలవడానికి.. సోషల్ మీడియాలో మైలేజ్ సాధించడానికి నిరంతరం ఏదో ఒక వివాదం కావలసి వస్తోంది. కోర్టులు - ప్రజా ప్రతినిధుల విలువైన సమయం ఇటువంటి చిల్లర వివాదాలపై వృథా కావడం శోచనీయం. ఇప్పటికైనా రాజకీయ వర్గాలు ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచాన్ని - ప్రజల వ్యక్తిగత నిర్ణయాలను వారి వదిలేసి... దేశాభివృద్ధికి సంబంధించిన నిజమైన సవాళ్లపై దృష్టి సారిస్తేనే ప్రజాస్వామ్యానికి గౌరవం.