స్థానిక సమరం...వైసీపీకి అసలైన బెంగ అదే !
స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధం అవుతోంది. సాధ్యమైనంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
స్థానిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధం అవుతోంది. సాధ్యమైనంత త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దాదాపుగా అన్ని చోట్లా విజయకేతనం ఎగురవేయాలని కూడా నిర్ణయించింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా అన్నదే కొంత ఆసక్తికరమైన చర్చ. అయితే ఎవరి పరిధులు పరిమితులు తెలుసు కాబట్టి అది కూడా సాఫీగా సాగిపోతుంది అని అంటున్నారు. కూటమి ఐక్యంగా వస్తే కనుక తట్టుకోవడం వైసీపీకి కష్టమే అన్న మాట ఉంది. అయితే ప్రజలలో వ్యతిరేకత ఉంది కాబట్టి సానుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ అధినాయకత్వం అంటోంది.
అధికారంతో పాటు అన్నీ :
సాధారణంగా స్థానిక ఎన్నికలు ఎపుడూ అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి. ప్రజలు కూడా ఎటువంటి సాహసోపేతమైన తీర్పులు ఇవ్వరు. మరో మూడేళ్ళ పాటు అదే ప్రభుత్వం కొనసాగుతుందని కాబట్టి తమకు అభివృద్ధి జరగాలి అంటే ప్రభుత్వంతోనే ఉంటేమే మేలు అని తలుస్తారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఢీ అంటే ఢీ ఉంటుంది. విపక్షం బలం ఉంటే మాత్రం జనాభిప్రాయం కొంత మారే చాన్స్ ఉంది. అలాంటి చోట్ల సామ దాన భేద దండోపాయాలు ఉండనే ఉంటాయి. ఇవి కూడా అధికారంలో ఉన్న వారికే ఎక్కువగా కలిసి వస్తాయి.
అర్ధ బలంతో కూడా :
అధికార కూటమికి అంగ బలం అర్ద బలం అధికార బలం కూడా జత కావచ్చు. అయితే అందులో కీలకమైన అర్థ బలం ఎవరికైనా ఉండొచ్చు. ఆ విధంగా అయినా తమ ఓట్లను తమ మద్దతుదారులను కాపాడుకుని స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలవడానికి విపక్షాలు వ్యూహ రచన చేస్తూంటాయి. ఏపీలో చూస్తే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా రాయలసీమ ఉంది. అక్కడ కొంత మొగ్గు ఉండొచ్చు అని అంటున్నారు. ఆ తరువాత నెల్లూరు, దాని తరువాత ప్రకాశం ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కొంత సానుకూల పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే అలాంటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అర్ధ బలం అయిన వైసీపీకి దండీగా ఉండాలని అంటున్నారు.
చితికిపోయి ఉన్నారా :
ఇక చూస్తే రెండేళ్ళ క్రితం దారుణమైన ఫలితాలతో వైసీపీ కకావికలం అయిపోయింది. అధికారంలో పార్టీ ఉన్నపుడు అందరూ బాగుపడలేదు, కొందరు మాత్రమే ఆ వెలుగులలో తమ జిలుగులకు మెరుగులు అద్దుకున్నారు. దాంతో పాటు వారంతా సైలెంట్ అయ్యారు. ఇపుడు కూడా జనంలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వారు అంతా నిజమైన అభిమానం కలిగిన వారుగా చెబుతున్నారు. పార్టీకి మంచి రోజులు రావాలని వారంతా ఎదురు చూస్తున్నారు. తాము పార్టీ కోసం ఎంతగానో కష్టపడతామని అయితే అదే సమయంలో పార్టీ కూడా అండగా ఉంటేనే అనుకున్న ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలలో చర్చ సాగుతోంది. ఆర్థికంగా పార్టీ సహకరిస్తే స్థానిక ఎన్నికల సమరాన్ని తాము ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్నారు.
ఎన్నికలంటే హడల్ :
నిజానికి ఒకప్పటికీ ఇప్పటికీ ఎన్నికలలో ఎంతో తేడా వచ్చింది. ఎన్నికలు అంటే డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పంచాయతీ వార్డు మెంబర్ కి కూడా ఎక్కువగానే పెట్టాల్సి వస్తోంది. దాంతో ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జిలదే భారం అని అధినాయకత్వం చెప్పినంత సులువు కాదని అంటున్నారు. ఆర్ధికంగా తమకు పార్టీ నుంచి ఇతోధిక సాయం లభిస్తే తాము కూడా గ్రౌండ్ లెవెల్ లో పడాల్సిన కష్టం అంతా పడతామని నేతలు అంటున్నారు. మరి స్థానిక పోరు అన్నది మినీ సార్వత్రిక ఎన్నికల లాంటిదే. కూటమి అయితే ఈ విషయంలో పూర్తిగా సర్వ శక్తులతో సిద్ధంగా ఉంది. వైసీపీ శిబిరంలో అయితే ఆర్థిక బలం గురించే అసలైన బెంగ అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద వైసీపీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్తుందో.