లిఫ్ట్‌ ప్రమాదాలపై సంచలన తీర్పు.. 23 ఏళ్ల నాటి కేసుతో నగర వాసికి భద్రత

దేశవ్యాప్తంగా పెరుగుతున్న లిఫ్ట్‌ ప్రమాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది.

Update: 2026-07-31 12:30 GMT

దేశవ్యాప్తంగా పెరుగుతున్న లిఫ్ట్‌ ప్రమాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. లిఫ్ట్‌లు సాంకేతిక లోపాలతో ప్రమాదానికి గురైతే, ఇకపై ఎవరూ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీలేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం లిఫ్ట్‌ ప్రమాదాలకు తయారీ సంస్థ, నిర్వహణ (మెయింటెనెన్స్‌) ఏజెన్సీ, భవన యజమాని లేదా యాజమాన్యం ముగ్గురూ సంయుక్తంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు లిఫ్ట్‌లను 'కామన్‌ క్యారియర్‌'గా వర్గీకరించింది. ఆధునిక పట్టణ జీవనంలో బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోవడంతో లిఫ్ట్‌లు ప్రజల నిత్య జీవితంలో భాగమైపోయాయని తెలిపింది. లిఫ్ట్‌లోకి అడుగుపెట్టే ఏ వ్యక్తయినా తన భద్రతను పూర్తిగా ఆ యాంత్రిక వ్యవస్థకే అప్పగిస్తాడని, ప్రయాణికులకు సంపూర్ణ రక్షణ కల్పించడం అత్యంత కీలకమైన చట్టపరమైన బాధ్యత అని కోర్టు పేర్కొంది.

బాధితులు లేదా మృతిచెందిన వారి కుటుంబసభ్యులు నష్టపరిహారం కోసం ఏ ఒక్కరిదో తప్పు అని నిరూపించాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితులు బాధ్యులైన ఆ ముగ్గురిలో ఎవరినైనా ఆశ్రయించి పూర్తి పరిహారం రాబట్టుకోవచ్చని, ఆ తర్వాత ఆయా సంస్థలే తమ మధ్య బాధ్యతల వాటాలను పరిష్కరించుకోవచ్చని తేల్చిచెప్పింది. 2003 మార్చి 20న ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (RAW) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక విషాదకరమైన లిఫ్ట్‌ ప్రమాదానికి సంబంధించి ఈ తీర్పు వెలువడింది.

13 మంది సీనియర్ అధికారులతో వెళ్తున్న లిఫ్ట్‌ సాంకేతిక లోపం వల్ల ఆరు, ఏడు అంతస్తుల మధ్య ఆగిపోయింది. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో మాజీ దౌత్యవేత్త విపిన్‌ హండా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించగా కోర్టు రూ.3.01 కోట్ల పరిహారాన్ని ఖరారు చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ ఓటిస్‌ ఎలివేటర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే, లిఫ్ట్‌లో అంతకుముందే పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తినా వాటిని సరిదిద్దడంలో కంపెనీ, నిర్వహణ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలో ఎన్సీడీఆర్సీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ కేసులో ఓటిస్‌ ఎలివేటర్‌ కంపెనీకి 70 శాతం, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్ కు 25 శాతం, సంబంధిత ప్రభుత్వ విభాగానికి 5 శాతం చొప్పున బాధ్యతను ఖరారు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.

ఈ చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న నివాస, వాణిజ్య, ప్రభుత్వ భవనాల యాజమాన్యాలు, లిఫ్ట్‌ తయారీ, నిర్వహణ కంపెనీలకు ఒక బలమైన హెచ్చరికగా నిలిచిందని న్యాయనిపుణులు వివరిస్తున్నారు. ఇకపై భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా, ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ తీర్పు నొక్కిచెప్పిందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News