ఫ‌స్ట్ టైమ్‌: రంగ‌నాథ్ కోసం వాద‌న‌లు వినిపించిన మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఒక మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. న్యాయ‌వాదిగా మారి వాద‌న‌లు వినిపించడం.. ఫ‌స్ట్ టైమ్ జ‌రిగింది.

Update: 2026-09-01 18:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఒక మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. న్యాయ‌వాదిగా మారి వాద‌న‌లు వినిపించడం.. ఫ‌స్ట్ టైమ్ జ‌రిగింది. ఆశ్చ‌ర్యంగా అనిపించినప్ప‌టికీ.. ఇది నిజం. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న హైడ్రా వ్య‌వ‌స్థ‌కు క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఐపీఎస్ అదికారి రంగ‌నాథ్ విష‌యంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాజీవ్ శ‌క్ద‌ర్‌.. తెలంగాణ హైకోర్టులో మంగ‌ళ‌వారం సాధార‌ణ న్యాయ‌వాదిగా వ‌చ్చి వాద‌న‌లు వినిపించారు. రంగ‌నాథ్ త‌ర‌ఫున బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించ‌డంతో గ‌తంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఏక‌స‌భ్య న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పును ద్విస‌భ్య న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ప‌క్క‌న పెట్టింది.

ఫ‌లితంగా గ‌తంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్ర‌స్తుత ధ‌ర్మాసనం ప‌క్క‌న పెట్ట‌డంతో రంగ‌నాథ్‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది. ఇక‌, మాజీ జ‌స్టిస్ రాజీవ్ శ‌క్డ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న విశ్రాంత న్యాయమూర్తి. ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దీనికి ముందు ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులలో మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయ‌న తాజాగా రంగ‌నాథ్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించారు. రంగ‌నాథ్ హైడ్రా క‌మిష‌న‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ ఆదేశాలు పాటించ‌డం లేద‌ని.. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు పెరిగిపోయాయ‌ని పేర్కొంటూ.. తెలంగాణ హైకోర్టు ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలని ఆదేశించింది.

ఇది జ‌రిగి దాదాపు నెల‌న్న‌ర అయింది. అయితే..ప్ర‌భుత్వం ఇంకా చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం రంగ‌నాథ్ హైకోర్టును ఆశ్ర‌యించి.. గ‌తంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును పునః ప‌రిశీలించాల‌ని కోరారు. దీనిని విచార‌ణ‌కు తీసుకున్న ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ముందు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాజీవ్ శంక్డ‌ర్ వాద‌న‌లు వినిపించారు. రంగ‌నాథ్ కార‌ణంగా ప్ర‌భుత్వ భూములు క‌బ్జా కోరుల నుంచి ఎలా ర‌క్షించ‌బ‌డుతున్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న ధ‌ర్మాస‌నందృష్టి కి తెచ్చారు. అలాగే.. రంగనాథ్‌పై ధిక్క‌ర‌ణ పిటిష‌న్లు వేసిన‌.. వారి చ‌రిత్ర‌, వారిపై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ఆధారాల‌తో స‌హా కోర్టుకు వివ‌రించారు. దీంతో రంగ‌నాథ్‌కు సానుకూలంగా హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేస్తూ.. గ‌త తీర్పును స‌స్పెండ్ చేసింది.

ఇలా జ‌రుగుతుందా?

మాజీ న్యాయ‌మూర్తులు, మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు.. తిరిగి కోర్టుకు వ‌చ్చి.. కేసులు వాదించ‌డం అనేది చాలా చాలా అరుదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి సంద‌ర్భం.. ఒక‌టో అరో జ‌రిగింద‌ని న్యాయ‌వాదులు గుర్తు చేస్తున్నారు. అవి కూడా రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల్లో ఉన్న పిటిష‌న్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని చెబుతున్నారు. తాజాగా రంగ‌నాథ్ విష‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌.. అంటే.. ఓ మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి న్యాయ‌వాదిగా వ‌చ్చి వాద‌న‌లు వినిపించ‌డం రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఏదేమైనా రంగ‌నాథ్‌కు భారీ ఊర‌ట అయితే ల‌భించింది.

Tags:    

Similar News