బానిస... : సీఎం పై నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశా రు.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశా రు. 'బానిస' అంటూ.. విరుచుకుపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్నిగాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి ఏపీకి బానిసత్వం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని.. ఏపీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి.. నేరుగా నీటిని దోచుకుంటున్నా.. సీఎం రేవంత్ రెడ్డికి ఆపే దమ్ము లేకుండా పోయిందన్నారు. ఇది ఆయన చేతకాని తనానికి నిదర్శమని దుయ్యబట్టారు.
వనపర్తిలో మంగళవారం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు వ్యవహారంపై స్పందించారు. ``తెలంగాణ నీటిని దోచుకుంటున్న ఏపీకి బానిసత్వం చేస్తున్నారు. కనీసంపన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ సహా.. ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పట్టిన శని, శత్రువు`` అంటూ చెలరేగిపోయారు. వరద జలాలు వాడుకోవల్సిన ఏపీ.. ఉన్న నీటిని కూడా లాగేసిందని, వెలిగొండ గేట్లు ఎత్తి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టిందని వ్యాఖ్యానించా రు. దీంతో రైతాంగం చుక్కనీటి కోసం అలమటించే పరిస్థితి తలెత్తిందన్నారు.
ఇంత జరగడానికి కారణం.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనమేనని నిరంజన్ వ్యాఖ్యానించారు. ''ఏపీ సీఎం చంద్ర బాబు జలచౌర్యం చేస్తుంటే నోరు మెదపని బానిస రేవంత్, కృష్ణా వరద జలాలు మాత్రమే వాడుకోవాలి. కానీ వరద లు లేకపోయినా వెలిగొండ గేట్లు ఎత్తారు. అంటే.. ఇక్కడి రైతులకు చెందాల్సిన నీటిని తరలించుకుపోయారు.'' అని వ్యాఖ్యానించారు. ఇదంతా రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న సాయమేనని పేర్కొన్నారు.
తెలంగాణకు, పాలమూరుకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని నిప్పులు చెరిగారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం తెలంగాణకు దుర్దినమనిఅన్నారు. `కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ఆలస్యానికి కాంగ్రెస్ నాయకులే కారణం. ఏపీకి రేవంత్ సర్కార్ కట్టు బానిసగా మారింది.`` అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రైతుల ఘోష ఈ ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యానించారు.