సలహాలివ్వండి.. అమలు చేస్తాం: బాబు రిక్వెస్ట్
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉన్న పాత ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనపై ఉన్న పాత ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల కాలంలో పలు విధాల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పు డు మైకు పట్టుకుంటే గంటల కొద్ది వదలరన్న భావనను ఇటీవల కాలంలో తప్పించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతూ.. మీడియాతోనూ మాట్లాడిస్తున్నారు. అలానే.. ఒకప్పుడు కేవలం ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతారన్న వాదనను కూడా తుడిచిపెడుతున్నారు.
ప్రతి నెలా 1నే పేదలకు చేరువ అవుతున్నారు. ఏ పథకాన్నయినా.. ప్రజల మధ్యే ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ కూడా.. చంద్రబాబు వ్యవహార శైలిలో భిన్నమైన మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఇక, చంద్రబాబుకు ఉన్న మరో లక్షణం కూడా ఇటు పార్టీలోనూ.. అటు ప్రభుత్వంలోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. అదే.. ఆయన ఎవరి మాటా వినరు. విన్నా పట్టించుకోరు.. పట్టించుకున్నా అమలు చేయరు అని!. ఈ విషయం పలు సార్లు చర్చకు కూడా వచ్చింది. అందుకే.. పార్టీలో ఒకప్పుడు నియామకాలు.. పోస్టుల భర్తీ వంటివి భిన్నంగా సాగేవి.
ఇక, ఇప్పుడు చంద్రబాబు తన రూట్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. తాజాగా ఆయన ప్రజలను ఉద్దేశించి సలహాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ''సలహాలు, సూచనలు ఇవ్వండి. వాటిని తూ.చ తప్పకుండా అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటా.'' అని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి , పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధికల్పనలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.
''మేం భేషజాలకుపోం. మాది బటన్ నొక్కుడు ప్రభుత్వం కాదు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రభుత్వం, వారి మనసెరిగి మసులుకునే ప్రభుత్వం. అవసరమైతే మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేసే ప్రభుత్వం. మీరు సూచనలు, సలహాలు ఇవ్వడం. అవి అమలు చేసేలా నేను చూస్తాను'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన ఫోన్ సహా సోషల్ మీడియా అంతా ప్రజల మధ్యే ఉంటుందన్నారు. ఎవరు ఎలాంటిసూచన ఇచ్చినా.. అది ప్రజామోదంగా ఉంటే.. తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ తరహా ప్రకటన చంద్రబాబు చేయడం ఇదే తొలిసారి అని నాయకులు చెబుతున్నారు.