డిజిటల్ విప్లవం: ఇన్ స్టాగ్రామ్ అల్గారిథమ్‌ల ఉచ్చుకు బ్రేక్ పడే రోజులు వచ్చేశాయా?
అయితే ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ కంటెంట్‌పై యూజర్లకే పూర్తి నియంత్రణ ఇచ్చేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కీలకమైన చట్టపరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్‌లను ఓపెన్ చేయగానే మనం ఫాలో అవ్వని వ్యక్తుల రీల్స్, ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలు వరుసగా ప్రత్యక్షమవ్వడం మనం ప్రతిరోజూ చూసే విషయమే. ఏదైనా ఒక వీడియోను కాస్త ఎక్కువసేపు చూస్తే లేదా లైక్ చేస్తే అల్గారిథమ్ తక్షణమే స్పందించి దానికి సంబంధించిన వందలాది వీడియోలను మన ఫీడ్‌లో నింపేస్తుంది. మనం ఏ కంటెంట్ చూడాలనేది మన అభిరుచి కంటే సోషల్ మీడియా అల్గారిథమ్‌లే ఎక్కువ భాగం నిర్ణయిస్తున్నాయి. వినియోగదారులను వీలైనంత ఎక్కువసేపు యాప్‌లోనే కట్టిపడేయడానికి ప్లాట్‌ఫామ్‌లు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ కంటెంట్‌పై యూజర్లకే పూర్తి నియంత్రణ ఇచ్చేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కీలకమైన చట్టపరమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
ఈ నూతన విధానం అమల్లోకి వస్తే సోషల్ మీడియా వేదికలు వినియోగదారులకు తమ ఫీడ్‌ను స్వయంగా ఎంచుకునే స్పష్టమైన ఎంపికను అందించాల్సి ఉంటుంది. యాప్‌ను వినియోగించే సమయంలో కస్టమర్లకు ఒక పాప్-అప్ ద్వారా రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తాయి. మొదటిది అల్గారిథమ్ స్వయంగా విశ్లేషించి రికమండ్ చేసే సాధారణ ఫీడ్ కాగా.. రెండోది వినియోగదారుడు స్వయంగా ఫాలో అవుతున్న అకౌంట్లు, పేజీల నుంచి వచ్చే పోస్టులు మాత్రమే కనిపించే ప్రత్యేక ఫీడ్. వినియోగదారుడు రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే అల్గారిథమ్ ప్రభావం పూర్తిగా తొలగిపోయి తాను ఇష్టపడి ఫాలో అవుతున్న ఖాతాల సమాచారం మాత్రమే క్రమానుగతంగా కనిపిస్తుంది. దీనివల్ల ప్లాట్‌ఫామ్‌ల ఉచ్చులో పడకుండా అవాంఛనీయమైన అనవసరమైన కంటెంట్‌ను సులభంగా అడ్డుకునే వెసులుబాటు యూజర్‌కు లభిస్తుంది.
ఈ ప్రతిపాదనలు కేవలం ఫీడ్ నియంత్రణకే పరిమితం కాకుండా కంటెంట్ నాణ్యత, భద్రత పట్ల సోషల్ మీడియా సంస్థల బాధ్యతను కూడా గణనీయంగా పెంచుతున్నాయి. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే హానికరమైన పోస్టులు, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషయాలను అడ్డుకోవడంలో ప్లాట్‌ఫామ్‌లు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై దాదాపు 100 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది సోషల్ మీడియా దిగ్గజాలకు పారదర్శకత వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితిని కల్పిస్తుంది.
మన దేశంలో కూడా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ షార్ట్స్ వినియోగదారులు కోట్లలో ఉన్నారు. భారత్‌లో కూడా ఇటువంటి ‘ఫాలోయింగ్ ఓన్లీ’ ఫీడ్ ఎంపిక అందుబాటులోకి వస్తే, భారతీయ యూజర్ల డిజిటల్ అలవాట్లలో గణనీయమైన మార్పులు వస్తాయి. నిరంతరం రీల్స్ స్క్రోల్ చేస్తూ సమయం వృథా చేసుకోవడం తగ్గడమే కాకుండా వివాదాస్పద లేదా తప్పుడు సమాచారం వేగంగా ప్రచారమవ్వడానికి బ్రేక్ పడుతుంది.
ఇప్పటివరకు పర్సనలైజేషన్ పేరుతో వినియోగదారుల దృష్టిని శాసించిన సోషల్ మీడియా కంపెనీలకు ఈ రకమైన నియంత్రణలు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఆస్ట్రేలియా అడుగుజాడల్లో ఇతర దేశాలు కూడా ఇలాంటి చట్టాలను తీసుకొస్తే, డిజిటల్ ప్రపంచంలో యూజరే అసలైన బాస్ అయ్యే రోజులు త్వరలోనే వస్తాయి.