సరస్వతి వాటాల ఇష్యూపై షర్మిల కీలక నిర్ణయం

వైఎస్ కుటుంబంలో గతంలో మరెప్పుడూ లేని విధంగా ఆస్తుల పంచాయితీ గడిచిన కొంతకాలంగా నెలకొన్న సంగతి తెలిసిందే.;

Update: 2026-02-10 04:59 GMT

వైఎస్ కుటుంబంలో గతంలో మరెప్పుడూ లేని విధంగా ఆస్తుల పంచాయితీ గడిచిన కొంతకాలంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశమే.. గతంలో జగనన్నకు తాను బాణంగా అభివర్ణించుకున్న షర్మిల.. ఇప్పుడు ఆస్తుల వివాదంపై పోరాడుతున్నారు. సరస్వతి పవర్ వాటాల బదిలీ అంశంపై తనపై ఉన్న ఆరోపణలకు కౌంటర్ దాఖలు చేసేందుకు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాదనను కౌంటర్ రూపంలో దాఖలు చేస్తానని.. అందుకు తగిన సమయం ఇవ్వాల్సిందిగా కోరారు.

దీంతో.. ఈ అంశంపై విచారణ జరుగుతున్న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ కు తన కౌంటర్ ను షర్మిల దాఖలు చేయనున్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం ప్రకారం కుటుంబ ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని.. అందుకు విరుద్దంగా తన సోదరుడు జగన్ వ్యవహరిస్తున్నారంటూ షర్మిల గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్, భారతీరెడ్డి పేరుతో ఉన్న వాటాలను విజయమ్మ ద్వారా తనకు బదిలీ చేయటం అక్రమం కాదని.. గిఫ్ట్ డీడ్ ద్వారా అవి తన తల్లికి దక్కినట్లుగా షర్మిల వాదిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షర్మిలకు బదిలీ చేసిన వాటాలకు సంబంధించి.. చెల్లదని తీర్పు ఇవ్వగా.. దాన్ని సవాలు చేస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి. ఈ వివాదంపై కోర్టు స్టేటస్ కోను కొనసాగించాల్సిందిగా ఆదేశించింది. ఈ సమయంలోనే ఈ వివాదానికి సంబంధించి తాను కౌంటర్ వేసేందుకు షర్మిల నిర్ణయించుకున్నారు. అందులో ఆమె ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వివాదానికి సంబంధించి ఇప్పటివరకు చోటు చేసుకున్న అంశాల్ని చూస్తే.. వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019 ఆగస్టు 31న కుదిరిన ఎంవోయూ భాగంగా జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు ముగిసిన తర్వాత సరస్వతి పవర్ వాటాలను షర్మిలకు బదిలీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 2021లో జగన్ ఆయన సతీమణి భారతి తమ వాటాలను తల్లి విజయమ్మకు గిప్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. ఇది తాత్కాలిక ఏర్పాటుగా.. కేసులు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బదిలీ జరుగుతుందన్నది జగన్ పేర్కొన్నట్లుగా చెబుతారు.

అయితే.. రాజకీయంగా షర్మిల తనను వ్యతిరేకించటం.. తన అనుమతి లేకుండా.. షేర్ సర్టిఫికేట్లు లేకుండానే వాటాల బదిలీని షర్మిల పూర్తి చేశారన్నది జగన్ ఆరోపణ. గిఫ్ట్ డీడ్ అన్నది కేవలం ప్రేమ.. అభిమానంతో ఇచ్చిందని.. తాజా పరిణామాల వేళ.. తాను ఉపసంహరించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వాటాల బదిలీకిఅవసరమైన అసలు షేర్ల ర్టిఫికేట్లు అందజేయలేదని.. అందువల్ల బదిలీ ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తి కాలేదన్నది ఆయన వాదన. దీనికి అనుకూలంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ షర్మిల.. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రెబ్యునల్ ను ఆశ్రయించారు. గిఫ్ట్ డీడ్, ఎంవోయూలను వెనక్కి తీసుకోలేదని.. వాటాల బదిలీ ఇప్పటికే చట్టబద్ధంగా జరిగినట్లు వాదిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షర్మిల తరఫు విజయమ్మ అఫిడవిట్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. మార్చి 17న షర్మిల తన కౌంటర్ ను దాఖలు చేయనున్నారు. అనంతరం దీనిపై నిర్ణయం వెలువడే వీలుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News