ప్రజలు పేదలు.. పాలకులు సూపర్ రిచ్.. తాజా రిపోర్టు తేల్చిన నిజం

ప్రజలను పాలించే పాలకుల ఆస్తులు ఎంత భారీగా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసే రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది.

Update: 2026-06-25 05:21 GMT

ప్రజలను పాలించే పాలకుల ఆస్తులు ఎంత భారీగా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసే రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. పెద్దల సభలోని సభ్యుల సంపదను లెక్క కట్టి.. దాన్ని యావరేజ్ చేసి చూసినప్పుడు పలు ఆశ్చర్యకర అంశాలు వెలుగు చూశాయి. రాజ్యసభలోని సభ్యుల సరాసరి సంపద చూస్తే.. రూ.100 కోట్లకు పైనే ఉన్నట్లుగా తేల్చారు. సరాసరి చూస్తే అలానే ఉంటుంది. వ్యక్తిగతంగా చూస్తే? అన్న సందేహానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆ లెక్కలు వేశారు. రాజ్యసభలోని 226 మంది సభ్యుల్లో రూ.100 కోట్లకు పైనే ఆస్తులు ఉన్న ఎంపీలు ఏకంగా 31 మందిగా తేల్చారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థతో పాటు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా రాజ్యసభ ఎంపీల ఆర్థిక స్థితిగతులు.. వారి విద్యార్హత.. వారి నేపథ్యాల మీద అధ్యయనాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన రిపోర్టును ఇటీవల విడుదల చేసింది.దీని ప్రకారం రాజ్యసభలో ప్రస్తుతం (అధ్యయనం చేసే నాటికి) ఉన్న సభ్యుల సంఖ్య 226 మంది అయితే.. వీరందరి ఆస్తుల్ని లెక్కిస్తే పోగుపడే సంపద ఎంతో తెలుసా? అక్షరాల రూ.26,047 కోట్లు. అంటే.. సరాసరిన ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115.25 కోట్లుగా తేల్చారు.

జూన్ 2026 నాటికి రాజ్యసభలో మొత్తం 233 స్థానాలు ఉండగా.. అందులో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 229 మంది సభ్యుల్లో ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవటంతో మొత్తం 226 మంది సభ్యుల అఫిడవిట్లను అధ్యయనం చేపట్టారు. వ్యక్తిగతంగా రూ.100 కోట్లకు పైనే ఆస్తులు ఉన్న ఎంపీలున్న పార్టీల విషయానికి వస్తే.. ఏడుగురు సభ్యులతో బీజేపీ ముందు ఉంటే.. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలుస్తోంది. ఆ పార్టీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు.

ఇక.. దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.5300 కోట్లకు పైనే. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ బీజేపీ ఎంపీ రిజిందర్ రూ.5053 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలోనూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ రూ.2558 కోట్లతో నిలిచారు. ఆస్తుల పరంగా చిట్టచివరి స్థానంలో ఉన్న ఎంపీగా పంజాబ్ కు చెందిన ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ నిలిచారు. ఆయన ఆస్తులు కేవలం రూ.3.79 లక్షలు మాత్రమే. అత్యధిక అప్పులు ఉన్న ఎంపీగా జార్ఖండ్ కు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ నత్వానీ పరిమళ్ నిలిచారు. ఆయనకున్న అప్పులు రూ.256 కోట్లుగా తేల్చారు.

ఆస్తులు..అప్పుల్ని కాసేపు పక్కన పెట్టి.. ఎంపీలుగా వ్యవహరిస్తున్న వారిపై ఉన్న కేసుల లెక్కలోకి వెళితే.. ఘనమైన రికార్డు వెలుగు చూస్తుంది. మొత్తం ఎంపీల్లో 31 శాతం మంది అంటే 69 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. కేసులు ఉన్న ఎంపీలకు సంబంధించి పార్టీల వారీగా చూస్తే.. సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్.. సీపీఎంకు చెందిన రాజ్యసభ సభ్యులందరికి (వంద శాతం) కేసులు ఉన్నట్లుగా తేలింది. టీడీపీలో 75 శాతం.. ఆర్జేడీలో 67 శాతం.. కాంగ్రెస్ లో 21 వాతం.. ఆమ్ ఆద్మీలో 33 శాతం.. బీజేపీలో 26 శాతం మంది క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో అత్యధికంగా 71 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తేల్చారు. 182 మంది అంటే 81 శాతం మంది డిగ్రీ.. ఆపై చదువులు చదివినట్లుగా పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుల్లో పురుషులు 81 శాతం ఉంటే.. మహిళలు 15 శాతం. సభలో అత్యంత పెద్ద వయస్కుడిగా ఎన్సీపీ ఎంపీ శరద్ పవార్ నిలిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. అదే సమయంలో అత్యంత పిన్న వయస్కుడిగా బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దాగా నిలిచారు. ఆయన వయసు 33 ఏళ్లు మాత్రమే. మొత్తంగా చూస్తే.. పెద్దల సభలోని సభ్యుల ఆస్తులు.. క్రిమినల్ కేసులు లోక్ సభ ఎంపీలతో పోటీ పడేలా ఉన్న భావన ఈ అధ్యయన రిపోర్టు చూస్తే కలుగుతుంది. కాదంటారా?

Tags:    

Similar News