రవి అస్తమించని రాజ్యంలో అస్తవ్యస్తమైన పాలన.. పదేళ్లలో ఏడో ప్రధాని

ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన బ్రిటన్, ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

Update: 2026-06-25 08:58 GMT

ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన బ్రిటన్, ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా పేరుగాంచిన ఆ దేశం, నేడు సరైన పాలకుడు దొరక్క పాలన పరంగా అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కొంటోందని అంటున్నారు. సాధారణంగా ఐదేళ్ల కాలపరిమితి ఉండే బ్రిటన్ ప్రధానమంత్రి పదవిలో గత పదేళ్లలో ఏ ఒక్కరూ పూర్తిస్థాయిలో కొనసాగలేదు. ఈ పదేళ్ల కాలంలో రెండు ఎన్నికలు జరిగితే మొత్తం ఆరుగురు నేతలు ప్రధానులుగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ప్రధాని కీవ్ స్టార్మర్ రాజీనామాతో మరొకరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఏడేళ్లలో ఏడో ప్రధాని రాబోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తే బ్రిటన్ రాజకీయ వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకు ఆరుగురు ప్రధానుల నిష్క్రమణ

2016 బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మొదలైన బ్రిటన్ రాజకీయ అస్థిరతకు ముగింపు కనబడటం లేదు. డేవిడ్ కెమెరాన్ మొదలుకొని, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, తాజాగా రాజీనామా చేసిన కీర్ స్టార్మర్ వరకు ప్రతి నాయకుడు ఏదో ఒక రాజకీయ లేదా ఆర్థిక సంక్షోభంతో పదవిని వదులుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. అతి తక్కువ కాలం (49 రోజులు) ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్ నుంచి, ఘనవిజయం సాధించినప్పటికీ మధ్యలోనే నిష్క్రమించిన స్టార్మర్ వరకు, ప్రతి మార్పు బ్రిటన్ ప్రజాస్వామ్య విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్థికాంశాల నుంచి అంతర్గత కలహాల వరకు..

ఈ రాజకీయ వేడికి ప్రధాన కారణాలుగా ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాలు, బ్రెగ్జిట్ తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభం అంటున్నారు. దీనికి తోడు రాజకీయ పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తోడయ్యాయి. స్టార్మర్ రాజీనామాకు దారితీసిన స్థానిక ఎన్నికల ఫలితాలు, కాబోయే ప్రధాని అంటూ ప్రచారంలో ఉన్న ఆండీ బర్న్‌హామ్ నేతృత్వంలో పెరిగిన వ్యతిరేకత, ప్రజల్లో నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. పార్టీల మధ్య సమన్వయ లోపం, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవ్వడం వంటివి బ్రిటన్ రాజకీయాలను "రివాల్వింగ్ డోర్" లాగా మార్చేశాయని అంటన్నారు.

ప్రపంచంపై తగ్గుతున్న పట్టు

బ్రిటన్ రాజకీయాల్లో నెలకొన్న ఈ అనిశ్చితి కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో బ్రిటన్ కరెన్సీ, ఇన్వెస్టర్ల నమ్మకం, అంతర్జాతీయ దౌత్యంపై ఇది ప్రభావం చూపుతోంది. దేశంలో ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. బ్రిటన్ పాలన ఇప్పుడు గందరగోళంగా ఉంది, సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కరువైందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తుపై సందిగ్ధత

ప్రస్తుతం ఆండీ బర్న్‌హామ్ వంటి నాయకులు రేసులో ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం వచ్చినా బ్రిటన్ ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి, ప్రజల్లో అసహనం తొలగిపోతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బ్రిటన్ తన పాత వైభవాన్ని, రాజకీయ స్థిరత్వాన్ని తిరిగి పుంజుకుంటుందా లేక ఇదే అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుందా? జూలై 9న మొదలుకానున్న తదుపరి నాయకత్వ ప్రక్రియ ఈ దేశ భవిష్యత్తుకు మార్గదర్శి కానుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News