భారత పౌరులు అంటే ఇండియాలో పుడితే సరిపోదా? తెరపైకి కొత్త రూల్స్?
మనం భారతదేశంలోనే పుట్టి పెరిగాం కాబట్టి మనమంతా భారతీయులమే అని అనుకుంటాం.
మనం భారతదేశంలోనే పుట్టి పెరిగాం కాబట్టి మనమంతా భారతీయులమే అని అనుకుంటాం. కానీ, చట్టపరంగా చూస్తే 'భారత పౌరసత్వం' ఎవరికి వస్తుంది? దానికి ఉన్న రూల్స్ ఏంటి? అనే విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మన దేశ పౌరసత్వ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి పుట్టిన సంవత్సరాన్ని బట్టి వారు భారతీయులా కాదా అనేది డిసైడ్ అవుతుంది. మరి మన సిటిజన్‌షిప్ చట్టాలు ఏం చెబుతున్నాయో, అసలు నిబంధనలు ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.
1950 నుంచి 1987 మధ్య పుట్టినవారంతా భారతీయులే:
మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఒక నిర్దిష్ట కాలం వరకు దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ చాలా సులభంగా పౌరసత్వం లభించింది. సిటిజన్‌షిప్ చట్టాల ప్రకారం.. 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1వ తేదీ మధ్యలో మన భారతదేశ భూభాగంలో జన్మించిన వారందరూ ఆటోమేటిక్‌గా భారత పౌరులుగానే పరిగణించబడతారు. ఇక ఈ కాలంలో పుట్టిన వారికి తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేకుండా, ఇక్కడ పుట్టడమే అర్హతగా పౌరసత్వం ఇచ్చేవారు.
1987 తర్వాత మారిన రూల్స్.. పేరెంట్స్ సిటిజన్‌షిప్ ముఖ్యం:
కాలక్రమేణా వలసలు, ఇతర కారణాల వల్ల ఈ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇక 1987 జూలై 1వ తేదీ తర్వాత మన దేశంలో పుట్టిన వారికి పౌరసత్వం రావాలంటే ఒక కొత్త రూల్ పెట్టారు. దాని ప్రకారం.. సదరు వ్యక్తి పుట్టే సమయానికి వారి తల్లి లేదా తండ్రి ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. అప్పుడే వారికి చట్టబద్ధంగా ఇండియన్ సిటిజన్‌షిప్ లభిస్తుంది.
2004 తర్వాత మరింత కఠినం.. అక్రమ వలసదారులపై నిఘా:
ఇక 2004 డిసెంబర్ 3వ తేదీ తర్వాత జన్మించిన వారి విషయంలో నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఈ తేదీ తర్వాత పుట్టిన పిల్లలకు భారత పౌరసత్వం రావాలంటే.. వారి తల్లిదండ్రులు ఇద్దరూ ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ఇక ఒకవేళ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఇండియన్ అయ్యుండి, మరొకరు చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారు కాకపోతేనే ఆ పిల్లలకు భారత పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది.
భారత పౌరసత్వం అనేది కేవలం ఇక్కడ పుట్టడం మాత్రమే కాదు, దేశ భద్రత మరియు చట్టాలకు లోబడి ఉండే ఒక బాధ్యత. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం రూల్స్‌ను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఇక ఏదేమైనా, ఈ సింపుల్ రూల్స్ తెలుసుకోవడం ద్వారా సిటిజన్‌షిప్‌పై ఉన్న కన్ఫ్యూజన్‌కు తెరపడినట్టే.