కాపు గేర్..ఫ్యాన్ స్పీడ్‌ను పెంచేనా.?
గత ఎన్నికల్లో ఘోర ఓటమి. మళ్లీ తిరిగి పవర్‌లోకి రావాలి. తలపడి నిలబడాలన్న పట్టుదల. కానీ కూటమి పొత్తు..క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి.
గత ఎన్నికల్లో ఘోర ఓటమి. మళ్లీ తిరిగి పవర్‌లోకి రావాలి. తలపడి నిలబడాలన్న పట్టుదల. కానీ కూటమి పొత్తు..క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే మల్టీపుల్ ప్లాన్స్‌తో ముందుకెళ్తోంది వైసీపీ. కూటమిని డిస్ట్రబ్ చేసే పరిస్థితి లేకపోవడంతో..ప్రభుత్వంపై వ్యతిరేకత..కులాల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కాపు ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి..జగన్ డైరెక్షన్‌లో పకడ్బందీ వ్యూహాన్నే అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలులో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆ తర్వాత ఓవర్ టు కోనసీమ అన్నారు. వెంకటాయపాలెంలో మాజీమంత్రి తోట త్రిమూర్తులు పెట్టిన మీటింగ్‌తో వైసీపీ కాపు గేర్ స్పీడందుకున్నట్లేనన్న టాక్ వినిపిస్తోంది.
కాపు ఓటు బ్యాంక్ ఫ్లాష్‌బ్యాక్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'కాపు సామాజికవర్గం' అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో సుమారు 15 నుండి 18శాతం ఓటు బ్యాంక్ కలిగిన ఈ వర్గం, ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి రావడం గత మూడు ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాపులు టీడీపీకి అండగా నిలిచారు. ఆనాడు రాష్ట్ర ప్రజలు..అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలో ఉంటే నవ్యాంధ్ర బాగుపడుతుందని విశ్వసించారు. ఇక ఆ తర్వాత 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు కాపు ఓట్లు చీలిపోయాయి. మెజారిటీ కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపడం, టీడీపీపై ఉన్న వ్యతిరేకత కలిసి వైఎస్ జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. ఇక 2024కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కాపు ఓటు బ్యాంక్ వన్‌సైడ్‌గా కూటమి వైపు నిలిచింది. పవన్ కల్యాణ్ ప్రభావంతో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది.
కాపుదారిలో వైసీపీ వ్యూహాలు
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టాలని భావిస్తున్న వైసీపీ, కాపు రాజకీయాన్ని తెరమీదకు తెస్తోంది. వైసీపీలో ఉన్న కీలక కాపు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కూటమిపై స్ట్రాంగ్ ఫైట్‌కు దిగుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని..జనసేనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కాపు నేస్తం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకోవడమే ఎజెండాగా పెట్టుకుంది. ఇప్పుడు కూటమి సర్కార్ కాపులకు చేసిందేమి లేదని..పవన్ ఎప్పుడూ సీఎం కాలేడని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో వైసీపీ కాపు నేతలే మీడియా మైకుల ముందుకు వచ్చి గళం వినిపిస్తున్నారు.
పవన్‌ను కాదని..కాపులు వైసీపీకి మద్దతిచ్చేనా.?
అయితే కాపు రాజకీయం ద్వారా వైసీపీ మళ్లీ పుంజుకోవడం అంత ఈజీ కాదన్న అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. కాపు సామాజికవర్గంలో, ముఖ్యంగా యువతలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా ఇన్నాళ్లకు పవన్ రూపంలో కాపుల నుంచి ఓ బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు..సీఎం అయ్యే స్థాయి నేత రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. అలాంటప్పుడు కూటమిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా..తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న నిరాశ ఉన్నా..పవన్‌ను కాదని కాపులు ఉన్నఫళంగా వైసీపీవైపు రావడం ఇప్పట్లో అయ్యే పని కాదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అయితే క్షేత్రస్థాయిలో మంచి పేరున్న కూటమి నేతలు వైసీపీలో ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింగ్‌గా చెబుతున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన వైఖరిపై ఇప్పటికీ ఆ వర్గంలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే, కాపు రాజకీయం మాత్రమే ఒంటరిగా వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదనేది సుస్పష్టం. కానీ కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ ఎంత వరకు సక్సెస్ అవుతుందనేదే కీలకం కానుంది. పాలిటిక్స్ ఆల్ వైస్ డైనమిక్స్ కాబట్టి..ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయో వేచి చూడాలి మరి.