విస్తరణకు వేళాయెరా...మోడీ రెడీ ?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళాయేనా అంటే హస్తినలో జరుగుతున్న ప్రచారం చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.

Update: 2026-08-09 11:21 GMT

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళాయేనా అంటే హస్తినలో జరుగుతున్న ప్రచారం చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13 తో ముగుస్తున్నాయి. అంటే మూడు రోజులు మాత్రమే ఉంది. అయితే ఇప్పటిదాకా జరిగిన సమావేశాలలో చూస్తే పెద్దగా బిజినెస్ సాగింది లేదని అంటున్నారు. ప్రతీ రోజూ విపక్షాలు సభలో చేపట్టే ఆందోళనలు గందరగోళం మధ్యన ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దాంతో వర్షాకాల సమావేశాలు అన్నీ వాయిదాలకే సమర్పితం అయిపోయాయి. ఈ సమావేశాలలో విదేశీ నిధుల అక్రమ ప్రవాహాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించే విరాళాలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం విదేశీ సహకారం నియంత్రణ బిల్లుని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అది పూర్తి అయిన తరువాత పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయని అంటున్నారు.

కొత్త మంత్రులొస్తున్నారు :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు మోడీ ప్రభుత్వం ఇపుడు సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన శాఖను అదనపు బాధ్యతగా మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వద్ద ఇప్పటికే ఇతర శాఖలు ఉన్నాయి. అలాగే రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వద్ద ఐటీ సమాచార శాఖలు ఉన్నాయి. ఇదే తీరున అనేక మంది మంత్రుల వద్ద ఒకటికి మించి ఎక్కువగా శాఖలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల వారికి భారం తగ్గించాలని ఎప్పటి నుంచో ఉంది. అదే విధంగా మంత్రుల సమర్ధత పనితీరు వంటివి బేరీజు వేసుకుంటున్న కేంద్రం ప్రభుత్వం కొందరిని తప్పించాలని చూస్తోంది అని కూడా ప్రచారంలో ఉంది.

వీరందరికీ సర్దుబాటు :

అలాగే బీజేపీ మిత్రులకు ఈసారి పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. అలాగే బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారు. ఇక కొంత మంది కేంద్ర మంత్రులను పార్టీ పనికి పురమాయించబోతున్నారు, మరి కొందరిని గవర్నర్లుగా పంపించబోతున్నారు అని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇరవై మంది ఎంపీలు, అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రేకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఆప్ నుంచి వచ్చిన ఎనిమిది మంది ఎంపీలకు ఈసారి విస్తరణలో కచ్చితంగా చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇలా చూసుకుంటే చాలా మంది ఆశావహులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ మొత్తం కసరత్తు అయితే ఒక లెక్కకు వచ్చిందని చెబుతున్నారు.

మరింత పటిష్టంగా :

కేంద్ర మంత్రి వర్గంలో బాగా పనిచేసే వారిని ప్రతిపక్షాలను కట్టడి చేసే వారిని తీసుకోవాలని చూస్తున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి వర్గం కొత్తగా తాజాగా కనిపించాలని ప్రయత్నం కూడా ఉంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో అక్కడ వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కూడా వ్యూహం ఉంది అని అంటున్నారు. ఇక ముందు ఉన్నవి అన్నీ మంచి రోజులే కాబట్టి మోడీ మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలో జరగవచ్చు అని అంటున్నారు. ఈ నెల 15న స్వాతంత్ర్య వేడుకలు ఉన్నాయి. అది ముగిసిన తరువాత ఎపుడైనా కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అన్న టాక్ అయితే దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. చూడాలి మరి కొత్త మంత్రులు ఎవరు ఏమిటి అన్నది.

Tags:    

Similar News