ఒక్క ఉద్యోగ తొలగింపు వివాదం.. వేల కోట్ల క్లెయిమ్‌గా ఎలా మారింది? అసలు కథ ఇదే!

ఒక సాధారణ కార్పొరేట్ ఔటింగ్.. ఊహించని రీతిలో ఉద్యోగం తొలగింపు.. చివరకు రూ.9,600 కోట్లకు పైగా పరిహారం క్లెయిమ్‌... ఒక స్టార్టప్‌ ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ టెక్‌ రంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

Update: 2026-09-25 23:30 GMT

ఒక సాధారణ కార్పొరేట్ ఔటింగ్.. ఊహించని రీతిలో ఉద్యోగం తొలగింపు.. చివరకు రూ.9,600 కోట్లకు పైగా పరిహారం క్లెయిమ్‌... ఒక స్టార్టప్‌ ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ టెక్‌ రంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

హోటల్‌ సౌనా నుంచి మొదలైన వివాదం

టెక్‌ దిగ్గజ సంస్థ 'గిట్‌పాడ్‌' ఇంజినీరింగ్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన షానన్‌ బర్న్స్‌ జీవితాన్ని 2023 ఏప్రిల్‌లో జరిగిన ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. ఆస్ట్రియాలోని లోఫర్‌లో కంపెనీ నిర్వహించిన 'టీమ్‌ బిల్డింగ్‌' ట్రిప్‌కు బర్న్స్‌ హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె పరిమితికి మించి మద్యం సేవించడం, హోటల్‌ గది తాళం లేకపోవడంతో రాత్రంతా హోటల్‌లోని సౌనాలో నిద్రించాల్సి రావడం వివాదానికి బీజం వేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గిట్‌పాడ్‌ యాజమాన్యం, ఆమె ప్రొఫెషనలిజంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2023 జూన్‌లో ఉద్యోగం నుంచి తొలగించింది.

"నా తొలగింపునకు కారణం ఏడీ.హెచ్.డీనే"

కంపెనీ నిర్ణయాన్ని బర్న్స్‌ తీవ్రంగా ఖండించారు. తనకు ఉన్న ఏడీ.హెచ్.డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్) వైకల్యం కారణంగానే యాజమాన్యం తనపై వివక్ష చూపిందని ఆరోపిస్తూ ఆమె 'బర్మింగ్‌హామ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రిబ్యునల్‌'ను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ట్రిబ్యునల్‌ 2025లో బర్న్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే నిర్ణయంలో ఆమె వైకల్య ప్రభావం ఉందనే వాదనను కోర్టు సమర్థించింది.

రూ.9,600 కోట్లు ఎలా అయ్యాయి?

ఈ కేసును కేవలం ఒక ఎంప్లాయిమెంట్ వివాదంగా కాకుండా బిలియన్ డాలర్ల కార్పొరేట్ కేసుగా మార్చింది ఆమె డిమాండ్ చేసిన పరిహారమే.. బర్న్స్‌ తన క్లెయిమ్‌లో కేవలం పాత జీతాన్ని మాత్రమే కాకుండా కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఉద్యోగం కోల్పోవడం వల్ల రాబోయే సంవత్సరాల్లో తాను నష్టపోయే జీతం ప్రయోజనాలు పేర్కొన్నారు. సంస్థ వృద్ధి చెందితే వచ్చే డివిడెండ్లు, షేర్ల విలువ ఈ ప్రాతిపదికన ఆమె 76 మిలియన్‌ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.9,600 కోట్లకు పైగా) పరిహారంగా చెల్లించాలని కోరారు. గిట్‌పాడ్‌ ఈ క్లెయిమ్‌ను అవాస్తవికమని కొట్టిపారేసింది. పరిహారాన్ని గరిష్టంగా 1 మిలియన్‌ పౌండ్లకు (సుమారు రూ.12.7 కోట్లు) పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌ను కోరింది.

0.85% వాటా తో పాటు ఓపెన్ ఏఐ కొనుగోలు ప్రచారాలు

విచారణ సందర్భంగా కేసు మరో ఆసక్తికర మలుపు తిరిగింది. గిట్‌పాడ్‌లో బర్న్స్‌కు 0.85 శాతం ఈక్విటీ వాటా ఉన్నట్లు వెల్లడైంది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.32.6 కోట్లు. అయితే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ గిట్‌పాడ్‌ను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ ఓపెన్ ఏఐ వంటి దిగ్గజం గిట్‌పాడ్‌ను హస్తగతం చేసుకుంటే కంపెనీ విలువతో పాటు బర్న్స్‌ వద్ద ఉన్న 0.85% వాటా విలువ కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. ట్రిబ్యునల్‌ జడ్జి రేచల్‌ వెడ్డర్స్‌పూన్‌ సైతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్‌ ఆర్థిక నష్టాన్ని లెక్కించేటప్పుడు ఉద్యోగికి ఉన్న ఈక్విటీ విలువను పూర్తిగా తోసిపుచ్చలేం అని స్పష్టం చేశారు.

స్టార్టప్‌ రంగంలో కొత్త చర్చ

ఈ కేసు కేవలం ఒక వ్యక్తిగత వివాదం కాదు. ఇది 'స్టార్టప్‌ ఈక్విటీ ఉద్యోగుల హక్కులు' అనే అంశంపై కొత్త చర్చకు తెరలేపింది. స్టార్టప్‌లలో సీనియర్ అధికారులకు జీతంతో పాటు ఇచ్చే స్టాక్ ఆప్షన్స్ ఉద్యోగం పోయినప్పుడు ఎంత నష్టాన్ని కలిగిస్తాయనే దానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. 76 మిలియన్ పౌండ్ల క్లెయిమ్ కోరడం వేరు.. కోర్టు అంత మొత్తం మంజూరు చేయడం వేరు. భవిష్యత్ అంచనాలు.. మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే తుది మొత్తాన్ని ట్రిబ్యునల్ ఖరారు చేస్తుంది.

టెక్‌ ప్రపంచానికి గుడ్‌బై.. థెరపిస్ట్‌గా కొత్త ప్రయాణం

ఈ సుదీర్ఘ న్యాయపోరాటం ఒకవైపు సాగుతుండగానే బర్న్స్‌ టెక్‌ రంగానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె ఒక థెరపిస్ట్‌గా స్థిరపడేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారు. ఒక హోటల్ రూమ్ తాళం పోవడంతో మొదలైన చిన్న సంఘటన, వైకల్య హక్కులు, స్టార్టప్ ఈక్విటీ విలువ, బిలియన్ డాలర్ల పరిహార క్లెయిమ్‌ల దాకా వెళ్లడం గ్లోబల్ టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News