నల్లగా.. లావుగా ఉన్నావని ఏడిపిస్తే విడాకులు ఇవ్వరట.. కోర్టు తీర్పు ఇదీ..

తన భార్య తనను పదే పదే “నల్లగా ఉన్నావు.. లావుగా ఉన్నావు” అని బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేస్తోందని.. ఆ రకమైన మాటల బాణాలను తట్టుకోలేక తన గుండె కోతకు గురైందని ఒక మహానుభావుడు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

Update: 2026-09-26 00:30 GMT

పెళ్లి కాకముందు “నీ రూపమే నా ప్రాణం.. నీ నలుపే నా అందం” అని కవితలు చెప్పే జంటలు.. పెళ్లయ్యాక మాత్రం “ఛీ.. నిన్ను చూస్తే నల్ల పూసలా ఉన్నావు.. ఏనుగులా తయారయ్యావు” అని తిట్టుకోవడం మన సమాజంలో అతి సాధారణమైన ముచ్చట.. తాజాగా ఇలాంటి ఒక విచిత్రమైన పంచాయితీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మెట్లెక్కింది.

తన భార్య తనను పదే పదే “నల్లగా ఉన్నావు.. లావుగా ఉన్నావు” అని బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేస్తోందని.. ఆ రకమైన మాటల బాణాలను తట్టుకోలేక తన గుండె కోతకు గురైందని ఒక మహానుభావుడు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. "అయ్యా.. ఆమె వ్యాఖ్యల వల్ల నా మనసు గాయపడింది.. ఇది చట్ట ప్రకారం నన్ను హింసించడమే క్రూరత్వమే" అని సదరు భర్తగారు లబోదిబోమన్నారు.

తీరా కోర్టు హాలులోకి వెళ్లాక అసలు కథ మొదలైంది. భర్తగారి ఆవేదన విన్న భార్య ఊరుకుంటుందా? వెంటనే ప్రత్యారోపణల అస్త్రాన్ని బయటకు తీసింది. “ఈయనగారికి బయట వేరే మహిళతో తియ్యటి బంధం ఉంది. పైగా నేను గర్భవతిగా ఉన్న సమయంలో కూడా కనీసం పట్టించుకోకుండా వదిలేశారు” అంటూ ఎదురుదాడికి దిగింది. దీంతో కేసు కాస్త ‘ఎవరు ఎక్కువ తప్పు చేశారు?’ అనే రేంజ్‌కి చేరిపోయింది.

ఇరువైపులా మాటల యుద్ధం ముగిసాక న్యాయమూర్తిగారు ఇచ్చి పడేసిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. భార్య "నల్లగా ఉన్నావు లావుగా ఉన్నావు" అని అందా అనడంలో సంశయం లేదు కానీ దానికి తగిన ‘పక్కా ఆధారాలు’ ఎక్కడ సామీ? అని కోర్టు ప్రశ్నించింది. కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదని.. ప్రతీ చిన్న అవమానకర వ్యాఖ్య ఆటోమేటిక్‌గా విడాకులు ఇచ్చేంత ‘క్రూరత్వం’ కిందకు రాదని స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా కేవలం మాటల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదని తేల్చిచెప్పేసింది.

ఇంతటితో ఆగకుండా భార్య పుట్టింటి నుంచి తెచ్చిన కానుకలు, సామాన్లను సురక్షితంగా ఆమెకు తిరిగి ఇచ్చేయాలని భర్తగారిని ఆదేశించింది. అంటే భర్తగారికి విడాకులు రాలేదు సదా సరే, ఉన్న సామాన్లు కూడా చేజారిపోయాయన్నమాట..

ఈ తీర్పుతో సమాజానికి కోర్టు ఇచ్చిన స్వీట్ మెసేజ్ ఏమిటంటే... పెళ్లయ్యాక భార్యాభర్తలు ఒకరినొకరు ఏడిపించుకోవడం, రూపాన్ని బట్టి అవమానించుకోవడం నైతికంగా తప్పే కావొచ్చు గాక... కానీ ప్రతి చిన్న గొడవకు, బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు కోర్టులు వెంటనే విడాకులు ఇచ్చేయవు. కోర్టు మెట్లు ఎక్కేముందు ఆరోపణలు చేయడం కాదు.. వాటికి ఆధారాలు పట్టుకుని రావాలని న్యాయస్థానం పరోక్షంగా చురకలు అంటించింది. ఆధారాలు లేకపోతే చట్టం దృష్టిలో మీ ఆవేదన కేవలం నీటి మూట మాత్రమే..

Tags:    

Similar News