భారత రవాణా రంగంలో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్‌ సంచలనం

అత్యవసర వైద్య సేవలు.. విపత్తు నిర్వహణతో పాటు పర్వత ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Update: 2026-08-09 09:20 GMT

వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ కి రోడ్ మార్గంలో వెళ్ల‌డానికి గంట స‌మ‌యం ప‌డుతుంద‌ని ఒక అంచ‌నా. అలా కాకుండా స‌ముద్రం మీదుగా ప్ర‌యాణించే వెసులుబాటు ఉంటే ఈ స‌మ‌యం అమాంతం స‌గానికి పైగా త‌గ్గిపోతుంది. అలాగే కాకినాడ కోస్ట‌ల్ మీదుగా, విశాఖ‌ప‌ట్నం వ‌ర‌కూ స‌ముద్రంపైనే ప్ర‌యాణిస్తూ 3-4 గంట‌ల ప్ర‌యాణ దూరం కాస్తా ఒక గంట‌కే త‌గ్గిపోవ‌చ్చు. అయితే ఇది సాధ్య‌ప‌డాలంటే.. డ్రోన్ టెక్నాల‌జీ వెహిక‌ల్ ఇలాంటి ప్ర‌యాణాల‌కు స‌హ‌క‌రించ‌గ‌ల‌ద‌ని సాంకేతిక నిపుణులు ఇప్ప‌టికే సూచించారు. అయితే ఇప్పుడు ఈ క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి ఒక సొంత ఫ్లైయింగ్ కార్ ని కొనుగోలు చేయ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. వైజాగ్ టు భోగాపురం స‌ముద్రంపై ఎగిరే కార్ కావొచ్చు.. లేదా కాకినాడ నుంచి వైజాగ్ - భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ప్ర‌యాణం కావొచ్చు.. ఇలాంటి ఒక ఫ్లైయింగ్ కార్ వ‌స్తే, నీలి రంగు స‌ముద్రం మీదుగా రెక్క‌లు విచ్చుకుని ఎగురుతూ ఉంటే, అలాంటి విహంగా వీక్ష‌ణం ఎంత బావుంటుందో క‌దా? ఒక‌వేళ ఇదే ఫ్లైయింగ్ కార్ లో మ‌న ఊరి చుట్టూ ఉన్న ఫ‌ర్వ‌తాల అంద‌చందాల‌ను వీక్షించాల‌నుకున్నా అది ఒక అద్భుత‌మే క‌దా!

అందుకే ఇప్పుడు దేశం మొత్తం ఈ ఫ్లైయింగ్ కార్ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ఇంత‌కీ ఈ వాహనాన్ని క‌నిపెట్టింది ఎవ‌రు? అంటే.. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన యువ ఆవిష్కర్త రవి టమ్టా. తన స్టార్టప్ `హపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్` ద్వారా HAPIDA SKYNeXఅనే సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఎగిరే కార్‌ను విజయవంతంగా పరీక్షించారు. కాఫ్లిఖాన్ అనే గ్రామం నుండి వచ్చిన ఒక యువకుడు ఇటువంటి సంక్లిష్టమైన వైమానిక సాంకేతికతను అభివృద్ధి చేయడం భారతీయ స్టార్టప్ రంగానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ దేశీయ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

ఈ సాంకేతికత ప్రధాన విశేషం దీని పర్యావరణహిత స్వభావం. సాధారణ విమానాలు ఏవియేషన్ ఇంధనాలపై ఆధారపడగా హ‌పిడా స్కై నెక్స్ పూర్తిగా 100 శాతం విద్యుత్ శక్తితో న‌డుస్తుంది. దీనివల్ల ఎటువంటి కాలుష్య ఉద్గారాలు వెలువడవు. భారీ మోటార్లు, ప్రొపెల్లర్లతో కూడిన మోడిఫైడ్ డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా తయారుచేసిన ఈ వాహనం.. భవిష్యత్తులో హరిత రవాణాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

హిమాలయ ప్రాంతాలైన ఉత్తరాఖండ్‌లో ఈ సాంకేతికత ఎంతో కీలకం కానుంది. కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కష్టతరమైన రోడ్డు మార్గాలతో సంబంధం లేకుండా ఇది సేవలు అందిస్తుంది. కొండ ప్రాంతాలలో రోడ్డుపై గంట నుండి గంటన్నర పట్టే ప్రయాణ సమయాన్ని ఈ ఎగిరే వాహనం కేవలం 10 నుండి 15 నిమిషాలకు తగ్గించగలదని అంచనా వేస్తున్నారు.

అత్యవసర వైద్య సేవలు.. విపత్తు నిర్వహణతో పాటు పర్వత ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడం ద్వారా భౌగోళిక అవరోధాలను అధిగమించడానికి ఈ ఎల‌క్ట్రిక్ కార్ సహాయపడుతుంది. ఇది ఒక పర్యావరణ హితమైన ఎంపిక కావడం వల్ల ప్రకృతి రమణీయమైన పర్వత ప్రాంతాలలో కాలుష్య ప్రభావం లేకుండా ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం హాపిడా స్కై నెక్స్ తొలి ప్రోటోటైప్ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్నా.. కమర్షియల్ వినియోగానికి రాకముందు మరిన్ని భద్రతా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారంగా నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం, స్థిరత్వానికి సంబంధించిన పూర్తి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయోగం భారతదేశంలో వైమానిక సాంకేతికత- స్వదేశీ ఆవిష్కరణల ప్రతిభకు స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.

Tags:    

Similar News