లోకేశ్ పై ఫార్చ్చూన్ ఇండియా సంచలన కథనం.. ఎందుకు అంటే..?

2019కి ముందు ప్రజలు లోకేశ్‌ను కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, రాజకీయ పరిపక్వత లేని నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

Update: 2026-08-09 09:20 GMT

రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే, కానీ ఆ మెట్టుపై నిలబడి గమ్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన శ్రమ, పట్టుదల ఉంటేనే చరిత్ర గుర్తిస్తుంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇలాంటి గుర్తింపు సాధించారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. ప్రఖ్యాత ఇంగ్లీషు పత్రిక ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు సంచికలో మంత్రి లోకేశ్ పై ప్రచురించిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ అంటూ మంత్రి లోకేశ్ ను ప్రశంసిస్తూ ఒక లీడ్ స్టోరీని ప్రచురించింది. గతంలో ట్రోల్స్, విమర్శలతో సతమతమైన నారా లోకేశ్, నేడు 'ఫార్చ్యూన్ ఇండియా' వంటి ప్రముఖ మీడియా గుర్తించే స్థాయికి ఎలా ఎదిగారు? అన్న చర్చ ఎక్కువ జరుగుతోంది.

మంత్రి లోకేశ్ పనితీరుతో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ‘టెక్నో-పొలిటికల్’ శకానికి ఆయన దారులు వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఫార్చ్యూన్ ఇండియా పత్రిక ఆగస్టు 2026 సంచికలో "ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్"గా అభివర్ణించిందని వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండేళ్లలో మంత్రిగా లోకేశ్ పనితీరు జాతీయస్థాయిలో నేతలు, పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలను ఆకట్టుకుందని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో లోకేశ్ ప్రాబల్యం పెరగడమే కాకుండా, ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కుతోందని అంటున్నారు.

2019కి ముందు ప్రజలు లోకేశ్‌ను కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా, రాజకీయ పరిపక్వత లేని నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆయనపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. కానీ, 2024 ఎన్నికల విజయం తర్వాత ఆయన తన శైలిని, వ్యూహాలను సమూలంగా మార్చుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా వేలాది కిలోమీటర్ల మేర సాగిన 'యువగళం' పాదయాత్ర ఆయనను ప్రజలకు అత్యంత సన్నిహితం చేయడమే కాకుండా, ఆయనలోని సహనశక్తిని, నాయకత్వ పటిమను బయటపెట్టిందని చెబుతున్నారు. ఆ కష్టతరమైన ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలే, నేడు మంత్రిగా ఆయన తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలకు పునాదిగా మారాయని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఆయనను తక్కువ చేసి చూసిన వారే, నేడు ఆయన పనితీరును విధిగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యారంగ శాఖలే లోకేశ్ మార్పుకు అసలైన అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. పాలన అంటే కేవలం ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేయడం మాత్రమే అనుకునే పద్ధతికి స్వస్తి పలికి, లోకేశ్ పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూషన్ పై దృష్టి పెట్టారని చెబుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆయన సాగించిన మంతనాలు, ఏపీని ఒక ప్రముఖ టెక్ హబ్‌గా మార్చాయని చెబుతున్నారు. ఇటీవల దక్షిణ కొరియాలో ఆయన చేసిన పర్యటనతో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఈవీ, బ్యాటరీ రంగాల దిగ్గజ కంపెనీలను ఏపీకి రప్పించేలా సాగిందని అంటున్నారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెబుతున్నారు.

కేవలం పరిశ్రమలు, ఐటీ రంగానికే పరిమితం కాకుండా, రాష్ట్ర విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన ఒక 'హోలిస్టిక్ అప్రోచ్'ను అనుసరిస్తున్నారని చెబుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడం, మెగా డీఎస్సీ ద్వారా లక్షలాది నిరుద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేయడం వంటి చర్యలు వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి రాబోయే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను తయారు చేయడానికి 'స్కిల్-బేస్డ్ ఎడ్యుకేషన్'కు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. విద్యను, ఉపాధిని అనుసంధానిస్తూ ఆయన వేస్తున్న అడుగులు భవిష్యత్ తరాలకు మేలు చేసేలా ఉన్నాయి.

ఈ పరివర్తనలో లోకేశ్ కేవలం పాత తరం రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాకుండా, నేటి 'జెన్-జీ' యువతతో నిరంతరం మమేకమవుతున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానించడం, వారి ఆలోచనలను పరిపాలనలోకి చొప్పించడం ఆయన ప్రత్యేకత అంటున్నారు. ఇక 'ఫార్చ్యూన్ ఇండియా' ఇచ్చిన "రైజింగ్ స్టార్" ట్యాగ్ ఒక గౌరవమే అయినప్పటికీ, అది ఆయనపై మరింత బాధ్యతను మోపుతోందని అంటున్నారు. ఎన్ని గ్లోబల్ ఒప్పందాలు కుదిరినప్పటికీ, అవి కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిశ్రమలుగా రూపాంతరం చెంది, యువతకు చేతినిండా ఉద్యోగాలు లభించినప్పుడే ఈ హోదాకు పరిపూర్ణత వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News