ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకున్న 'మహానుభావుడు'.. బీజేపీ ఎమ్మెల్యేకే వింత అనుభవం
ఒక్క పెళ్లి చేసుకుని.. ఆ సంసారాన్ని సర్దుకుని ఈదడానికే సగటు మగాడు ఆపసోపాలు పడుతుంటే... ఈ 'మహానుభావుడు' మాత్రం ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కాడు.
ఒక్క పెళ్లి చేసుకుని.. ఆ సంసారాన్ని సర్దుకుని ఈదడానికే సగటు మగాడు ఆపసోపాలు పడుతుంటే... ఈ 'మహానుభావుడు' మాత్రం ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కాడు. "ఒక్క పెళ్లి కాదేం దేవుడా" అని కుర్రాళ్ళు దండాలు పెడుతుంటే ఈ అల్లుడు గారు మాత్రం ఏకంగా 'సిల్వర్ జూబ్లీ' వికెట్లు పడేసి అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చాడు. పోనీ ఏమైనా మామూలు మనిషా అంటే కాదు.. సాక్షాత్తూ ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేగారి సొంత అల్లుడు కావడం విశేషం..
యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తె ప్రజ్ఞకు 2024లో చాలా వైభవంగా పెళ్లి జరిపించారు. అల్లుడు ప్రఖార్ త్రివేది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అని.. కోట్లల్లో బిజినెస్ నడుస్తోందని నమ్మి కుమార్తెను ఇచ్చి కన్యాదానం చేశారు. తీరా పెళ్లయిన కొన్ని రోజులకే అల్లుడి ప్రవర్తనపై అనుమానాలు మొదలయ్యాయి. మెల్లగా సోషల్ మీడియా ఖాతాలు, ప్రొఫైళ్లు తవ్వడం మొదలుపెడితే ఎమ్మెల్యే గారికి ఫ్యూజులు ఎగిరిపోయే నిజాలు బయటపడ్డాయి. అల్లుడు గారు కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాకుండా 'కళ్యాణ మహోత్సవాల' కాంట్రాక్ట్ కూడా నడుపుతున్నారని తేలింది.
మామగారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ అల్లుడు గారు మామూలు కిలాడీ కాదు. సోషల్ మీడియాలో రకరకాల ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం.. అమాయక మహిళలతో పరిచయాలు పెంచుకోవడం, చివరికి వారిని పెళ్లి పీటల దాకా తీసుకురావడం ఈయన గారి ప్రధాన శైలి. ఇప్పటివరకు సుమారు 25 మంది మహిళలను వివాహం చేసుకుని వారిని మోసం చేసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ మల్టీ-మ్యారేజ్ మాస్టర్ ప్లాన్‌లో అల్లుడు ప్రఖార్‌తో పాటు ఆయన తండ్రి అనుజ్ త్రివేది హస్తం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తన కుమార్తె ప్రజ్ఞను కూడా ఇదే రీతిలో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశారని జ్ఞాన్ తివారీ పేర్కొన్నారు. అల్లుడి దెబ్బకు షాక్ తిన్న ఎమ్మెల్యే గారు వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుతం యూపీ పోలీసులు ఈ 'మహా పెళ్లిళ్ల' మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగారు. అసలు నిందితుడు ఎన్ని ఫేక్ ఐడీలు ఉపయోగించాడు.. 25 మంది బాధితులలో అసలైన భార్య ఎవరు.. ఈ పెళ్లిళ్ల వెనుక ఏమైనా ఆర్థిక మోసాలు ఉన్నాయా అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
ఏది ఏమైనా పెళ్లికాని ప్రసాద్‌లు ఒక వైపు బ్రహ్మచారులుగా మిగిలిపోతుంటే.. ఈ అల్లుడు గారు ఏకంగా 25 పెళ్లిళ్లతో రికార్డు సృష్టించడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. "ఎమ్మెల్యేగారే అల్లుడి చేతిలో మోసపోయారా!" అని యూపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.