బాబు యాంటీ ఓటు బ్యాంక్ ని ఏబీవీ లాగేస్తారా ?
ఏపీలో కొత్త పార్టీ దిశగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన చాలా జాగ్రత్తగా తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.;
ఏపీలో కొత్త పార్టీ దిశగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన చాలా జాగ్రత్తగా తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళడం కాకుండా ప్రాంతాల వారీగా వివిధ సామాజిక వర్గాలతో సంఘాలతో మేధావులతో విద్యా వంతులతో రౌండ్ టేబిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు కోస్తా గ్రేటర్ రాయలసీమ రీజియన్లలో రాజకీయం, అక్కడ సమస్యలు అక్కడ ప్రజల ఆకాంక్షలు అధ్యయనం చేస్తూనే అక్కడ ఉన్న మేధావులు ప్రజా సంఘాలతో కలిసి అవగాహన పెంచుకుంటున్నారు.
ముద్ర చెరిపేసుకుంటూ :
ఏబీవీ అంటే ఒక ముద్ర ఉంది. అది ఏర్పడిందా లేక వైసీపీ నేతలు వేశారా అన్నది పక్కన పెడితే ఆయన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా కావల్సిన మనిషి అని ప్రచారం అయితే జరిగింది. అందుకే ఆయనను వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళూ కీలక పోస్టింగులు ఇవ్వకుండా దూరంగా పెట్టింది. ఆయన వైసీపీతో పోరాడారు కూడా. ఇక టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఏబీవీకి మంచి ప్రయారిటీ దక్కుతుంది అని అంతా అనుకున్నారు, కానీ ఆయనకు ఇచ్చిన నామినేటెడ్ పదవిని ఆయన నచ్చలేదు, అందుకే దానిని పక్కన పెట్టేశారు. ఆనాటి నుంచి ఆయన రాజకీయంగా తన ఆలోచనలకు పదును పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
రిటైర్ అయితే పెట్టకూడదా :
ఈ మధ్యన ఆయన యూ ట్యూబ్ చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ రిటైర్ అయితే పార్టీలు పెట్టకూడదా అని ప్రశ్నించారు. అంతే కాదు ఆరు పదుల వయసు దాటితే విశ్రాంతి తీసుకోవాలని లేదు కదా అన్నారు. తనకు రాజకీయాలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. అందుకే కష్టంతో ఈ రంగంలోకి రావడం లేదని మోజుతోనే వస్తున్నాను అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే పొలిటికల్ గా అరంగేట్రం చేస్తున్నాను అని అంటున్నారు.
బాబు మీద పోరాటం :
ఇక ఏపీలో పార్టీ అయితే పెట్టలేదు కానీ ఏబీవీ అయితే కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. తప్పు అన్న చోట నిర్భయంగా తప్పు అనే చెబుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి మీద చేసిన విమర్శలు అనుచిత వ్యాఖ్యలను సమర్ధించ లేమని అంటూనే ఆయన ఇంటి మీద కానీ మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కానీ దాడులు చేయడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదని కూడా నిందించారు.
సజావుగా లేదంటూ :
ఏపీలో కూటమి పాలన సజావుగా సాగడం లేదని ఆయన విమర్శించారు. ఏపీ అప్పులతో కూరుకుపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. నీటి ప్రాజెక్టుల మీద ఫోకస్ లేదని అవి అలా సరైన నిర్మాణం లేక ఉండిపోతున్నాయని అన్నారు. అమరావతి రాజధాని కోసం రెండో విడత భూములను సమీకరించడం కూడా తప్పుడు నిర్ణయం అని అంటున్నారు.
యాంటి ఓటింగ్ చీలిక :
ఇక ఏబీవీ కనుక ఇదే స్థాయిలో జనంలోకి వస్తూ పదునైన విమర్శలు చేస్తే కనుక టీడీపీ కూటమి యాంటీ ఓటింగ్ లో చీలిక కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఒక విధంగా చూస్తే వైసీపీ కంటే కూడా నిశితంగా పదునైన విమర్శలు నిర్మాణాత్మకంగా ఆయన చేస్తున్నారు. మరి రాజకీయ పార్టీ పెట్టి ఆయన జనంలోకి వస్తే కనుక మరింతగా దూకుడు పెంచుతారు అని అంటున్నారు. ఏబీవీ కొత్త పార్టీ కనుక జోరు ఎంత చేస్తే ఆ మేరకు నష్టం ఎవరికి అన్న చర్చ కూడా ఉంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ఉండే యాంటీ ఇంకెంబెన్సీని ప్రతిపక్షాలు చీల్చుకుంటే లాభం కూటమికే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ విధంగా వైసీపీకి ఏబీవీ పార్టీతో కొత్త చిక్కులు వచ్చే సీను అయితే ఉందని చెబుతున్నారు.