తమ్ముడి చిన్ని మీద అన్న నాని మరింత గట్టిగా !
విజయవాడలో అన్నా దమ్ముల రాజకీయ సమరం జోరుగా సాగుతోంది. ఒకరు ఎంపీగా ఉన్నారు.
విజయవాడలో అన్నా దమ్ముల రాజకీయ సమరం జోరుగా సాగుతోంది. ఒకరు ఎంపీగా ఉన్నారు. మరొకరు మాజీ ఎంపీ. ఈ ఇద్దరి మధ్యన చిచ్చు రాజుకుంది. ఎత్తులు పై ఎత్తులతో అన్నదమ్ముల పాలిటిక్స్ సాగుతోంది. తాజాగా చూస్తే కేశినేని నాని ఎంపీ చిన్ని మీద ఏకంగా భూకబ్జా ఆరోపణలతో అతి పెద్ద బాంబునే వేశారు. కేశినేని చిన్ని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారంటూ కేశినేని నాని గట్టిగానే టార్గెట్ చేశారు. దీంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
హైదరాబాద్ సమీపంలో :
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హైదరాబాద్ దగ్గరలోని షంషిగూడలో 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని భారీగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారని కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి ఆయన నేరుగా తెలంగాణా ముఖ్యమంత్రినే మధ్యలోకి తీసుకుని వచ్చారు. తాను ఈ భూకబ్జా యత్నం విషయంలో రేవంత్ రెడ్డికే బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. ఈ భూమిని నిజానికి టీజీ ఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించింది అని నాని పేర్కొన్నారు. అయితే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆయనకు సంబంధించిన సంస్థలు అయితే ఒక మోసపూరితమైన న్యాయపరమైన ఒప్పందం ద్వారా ఆ భూమిని అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని నాని విమర్శించారు.
ప్రైవేట్ హక్కులు లేవు :
ఇక ఇది పక్కాగా ప్రభుత్వం భూమి అని ప్రైవేట్ వ్యక్తులకు సంస్థలకు ఎలాంటి యాజమాన్యం హక్కులు లేనే లేవని ఆ జిల్లా కలెక్టర్ కూడా సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసారు అని నాని తెలిపారు. అందువల్ల ఈ ఆరోపితమైన ఆక్రమణను అడ్డుకోవాలని ఆయన కోరారు. అంతే కాదు ఇందులో ఎవరి ప్రమేయం ఉందో వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆయన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గానే వినతి చేసారు. అంతే కాదు ఒక ప్రభుత్వ భూమిని రక్షించే విషయంలో హైడ్రా అలాగే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా జోక్యం చేసుకోవాలని కూడా కేశినేని నాని కోరడం విశేషం.
వారందరికీ ట్యాగ్ చేస్తూ :
కేశినేని నాని ఈ ఆరోపణలు చేస్తూ ఊరుకోలేదు. తన సోషల్ మీడియా ద్వారా చేసిన ఆ ఆరోపణలతో కూడిన ట్వీట్ ని ఆయన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా అగ్ర నేతలు అందరికీ ట్యాగ్ చేయడం విశేషం.
చిన్ని రియాక్షన్ :
ఇదిల ఉంటే తన మీద సోదరుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఇప్పటికే కేశినేని చిన్ని లీగల్ నోటీసులు జారీ చేశారు. అంతే కాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇపుడు ఏకంగా వేల కోట్ల రూపాయల విలువలైన ప్రభుత్వ భూమిని చిన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని నాని ఆరోపణలు చేయడంతో చిన్ని ఏమి చేస్తారు అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే కేశినేని బ్రదర్స్ ల మధ్య రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు అని అంటున్నారు.