ఫుల్ క్లారిటీ: అద్దె ఇంట్లో ఉండేవారి ఓట్లు పోతాయా?
ఇలాంటి పరిస్థితి లక్షల్లో ఉండొచ్చు. అలాంటి వారు ఏం చేయాలన్న విషయానికి వస్తే..
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ.. సింఫుల్ గా చెబితే ‘సర్’. కొంతకాలంగా దేశ వ్యాప్తంగా.. ఫేజ్ పద్దతిలో చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ఎప్పుడైనా సరే.. ఒక ప్రభుత్వం రోటీన్ కు భిన్నంగా ఒక కొత్త విధానం తెర మీదకు వచ్చినప్పుడు అపోహలు.. భయాలు మామూలే. ఇప్పుడు ‘సర్’ విషయంలోనూ అదే చోటు చేసుకుంది. ఇప్పటికే సర్ అమలు జరిగిన రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యాయని.. ఒక వర్గం మీద కత్తి కట్టి వారికి ఏదో చేటు చేసే లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో.. అవే భయాలు వెంటాడుతుంటాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సర్ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలుకు రంగం సిద్ధమై.. ప్రక్రియ షురూ అయ్యాక అర్థమయ్యేదేమంటే.. ఏదో ఒక ప్రత్యేక వర్గాన్ని టార్గెట్ చేసిందేమీ లేదన్న విషయం సర్ ను చూస్తే అర్థమవుతుంది.
ఒకవిధంగా చెప్పాలంటే.. ఒకరికి ఒక చోటు కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉంటే.. వాటిని ఏరేయటం కీలకంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వారికి ఓటుహక్కును కాపాడుకోవటం కాస్తంత కష్టమైన అంశంగా చెప్పాలి. అలా అని.. మరీ అసాధ్యమైనట్లుగా ఏమీ లేదనే చెప్పాలి. తాజాగా జరుగుతున్న సర్ ప్రక్రియను చూసినప్పుడు సొంత ఇల్లు లేకుండా..ఒక ప్రాంతంలో స్థిరంగా లేకుండా.. తరచూ వేర్వేరు ప్రాంతాల్లోకి షిప్టు అయ్యే వారు.. అద్దె ఇళ్లల్లో ఉండే వారికి సర్ ఇప్పుడో పెద్ద తలనొప్పిగా మారింది.
దేశ వ్యాప్తంగా నకిలీ ఓట్లు.. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తీసేయటం.. మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించటమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఎన్నో అర్థాలు.. పెడార్థాలు తీసిన వైనం కనిపిస్తుంది. నిజమే.. సర్ ప్రక్రియలో కొన్ని సంక్లిష్టతలు ఉన్న మాట వాస్తవమే. అదే సమయంలో బాధ్యత లేకుండా.. ఇష్టం వచ్చినట్లుగా ఒకటికి రెండుచోట్ల ఓటు కలిగి ఉన్న కోట్లాది మంది సంగతేంటి? అన్నది కూడా ప్రశ్నే కదా?
ఇక.. సర్ కు సంబంధించి ఎక్కువమందికి ఎదురవుతున్న కష్టం.. ఆందోళన ఏమంటే.. అద్దె ఇంట్లో ఉండే వారి ఓట్లు పోతాయా? అని. తాము ఓటుహక్కు పొందిన ప్రాంతంలో లేకుండా.. ఇప్పుడు వేరే ప్రాంతంలో ఉంటే తమ ఓట్లు పోతాయా? అన్న ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఓటరు లిస్టులో ఓటు ఉన్న వ్యక్తి చిరునామాకు అధికారి వెళ్లి.. వారికి పత్రం ఇచ్చి.. తమకున్న ఓటుకు సంబంధించిన ఫ్రూఫ్ లు అడుగుతారు. మరి.. అడ్రస్ మారిన వారి సంగతేంటి? అన్నది అసలు ప్రశ్న.
ఇలాంటి పరిస్థితి లక్షల్లో ఉండొచ్చు. అలాంటి వారు ఏం చేయాలన్న విషయానికి వస్తే..
తాము ఓటు పొందిన అడ్రస్ లో ఇప్పుడు లేని వారు మొదట చేయాల్సింది.. ప్రస్తుతం తాము ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన బీఎల్ వో.. ఈఆర్ వో.. ఏఈఆర్ వో కార్యాలయాన్ని సంప్రదించి ఫారం పొందాలి. అదంతా కష్టమనుకుంటే.. ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన ఆన్ లైన్ విధానాన్ని వినియోగించుకునే వీలుంది. ఈ ఫారంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటి పూర్తి చిరునామాను పూర్తి చేయాలి.
ఆధార్ కార్డు.. ఇతర పత్రాల్లో ఉన్న అడ్రస్ తో వీలైనంతవరకు సరిపోయేలా ఉండాలి. అద్దె ఇంట్లో ఉండేవారు ఫారం 8 సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్.. రేషన్ కార్డు.. పోస్టాఫీస్ పాస్ బుక్.. ప్రభుత్వం జారీ చేసిన చిరునామా పత్రాలు.. ఇంటి అద్దె ఒప్పంద పత్రం.. ఇంటి యజమాని ఇచ్చిన నివాస ధ్రువీకరణ పత్రం.. కరెంట్ బిల్.. వాటర్ బిల్.. గ్యాస్ కనెక్షన్ పత్రం.. బ్యాంక్ పాస్ బుక్ లేదంటే బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లో ఉన్న చిరునామా వివరాల్ని ధ్రువీకరణపత్రాలుగా సమర్పిస్తే సరిపోతుంది.
ఇప్పటికే ఓటరుగా ఒక ప్రాంతంలో ఓటు ఉండి.. ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉంటే.. ఎన్యుమరేషన్ పారం నింపి సమర్పిస్తే సరిపోతుంది. సదరు పత్రంలో పేర్కొన్న వివరాల్ని.. సంబంధిత పత్రాల్ని జత చేయాలి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారితే.. దానికి తగిన ఆధారాల్ని జత చేస్తేసరిపోతుంది.చిరునామాలో తప్పులు ఉంటే ఫారం 8 సమర్పించాలి. అదే కొత్త చిరునామాలో ఓటరుగా నమోదు కావటానికి ఫారం 6 సమర్పించాలి. శాశ్వితంగా వేరే ప్రాంతానికి వలసపోయిన పక్షంలో పేర్లు తొలగించేందుకు ఫారం 7 సమర్పించాలి. ఇలా.. తగిన ఫారం సమర్పించటం ద్వారా ఇప్పటికే ఉన్న ఓటును పదిలంగా ఉంచుకునే వీలుంది. సర్ మీద అనవసరమైన సందేహాల్ని వదిలి.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. ఎలాంటి సమస్యా ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.