క్యాబ్ లో జ్యూస్ తాగుతుంటే.. బీర్ తాగుతున్నానని ఇబ్బంది పెట్టాడు

బెంగళూరు మహానగరంలో రాత్రి వేళ ఊబర్ బుక్ చేసుకున్న ఒక మహిళ తనకు చేదు అనుభవం ఎదురైనట్లుగా చెబుతోంది. చెన్నైకు చెందిన ముప్ఫై ఏళ్ల ఈ యువతి బెంగళూరులో నివసిస్తోంది.

Update: 2026-06-28 09:06 GMT

కొన్ని సందర్భాల్లో నిజం ఏది? అబద్ధమేది? అన్నది తేల్చటం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందిందే. నిజానికి.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూసినప్పుడు.. బాధితుల పేరుతో చెప్పే మాటల్ని కూడా ఉత్తనే నమ్మకూడదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. విచిత్ర నేరాలకు.. షాకింగ్ ఉదంతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఇక్కడే జరిగింది.

బెంగళూరు మహానగరంలో రాత్రి వేళ ఊబర్ బుక్ చేసుకున్న ఒక మహిళ తనకు చేదు అనుభవం ఎదురైనట్లుగా చెబుతోంది. చెన్నైకు చెందిన ముప్ఫై ఏళ్ల ఈ యువతి బెంగళూరులో నివసిస్తోంది. జూన్ 21 రాత్రి 9.30గంటల ప్రాంతంలో కోరమంగళ ఐదో బ్లాక్ లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ పూర్తిచేసుకొని ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. అశోక్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెస్టారెంట్ ఉంది. క్యాబ్ ఎక్కిన తర్వాత జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతుంటే.. బీర్ తాగొద్దని డ్రైవర్ తనతో దురుసుగా.. అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తోంది. ఇంతకూ అసలేం జరిగిందన్నది ఆమె మాటల్లోనే చూస్తే..

‘జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతుంటే.. కారులో బీరు తాగొద్దని డ్రైవర్ దబాయించాడు. ఇది బీర్ కాదు జ్యూస్ అని చెప్పిన అతను అస్సలు వినిపించుకోలేదు. ఒకదశలో కారులో నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. నాతో దౌర్జన్యంగా మాట్లాడిన కారు డ్రైవర్ తో నా ట్రిప్ ను క్యాన్సిల్ చేయాలని కోరాను. కానీ.. అతను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అతడి తీరుతో భయానికి గురై.. కారు ఆపకున్నా..అతి కష్టమ్మీదా డోర్ తెరిచి కిందకు దూకేశా’’ అని బాధత మహిళ చెబుతోంది.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సదరు మహిళ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పేర్కొంది. దీంతో స్పందించిన పోలీసులు అసలేం జరిగిందన్న విషయాన్ని గుర్తించేందుకు సదరు క్యాబ్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా సదరు క్యాబ్ డ్రైవర్ 60 ఏళ్ల పరమేశ్వర్ గా గుర్తించారు. మొదట్లో ప్రయాణం బాగానే సాగినా.. మైసూర్ రోడ్డులోని ఇండియన్ క్రిస్టియన్ సెమెట్రీ ప్రాంతానికి చేరుకోగానే.. ‘కొంబుచా’ హెల్త్ డ్రింక్ బాటిల్ ను ఓపెన్ చేసింది. అయితే.. ఆ బాటిల్ ను చూసి.. అది బీర్ బాటిల్ గా డ్రైవర్ భావించాడు. తన క్యాబ్ లో బీర్ తాగొద్దని గట్టిగా చెప్పాడు. అయితే.. తాను తాగుతుంది బీర్ కాదని జ్యూస్ అని చెప్పినా డ్రైవర్ పరమేశ్వర్ వినిపించుకోలేదు. ట్రిప్ క్యాన్సిల్ చేయమన్నా చేయలేదు. దీంతో ఆమె భయంతో క్యాబ్ నుంచి దూకేసింది.

యువతి ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఆమె బాటిల్ ను పరిశీలించిన పోలీసులు అది బీర్ కాదని.. కొంబుచా అనే ఫెర్మెంటెడ్ టీగా గుర్తించారు. డ్రైవర్ పరమేశ్వర్ ను గుర్తించిన పోలీసులు అతడ్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై ఊబర్ తీవ్రంగా స్పందించింది. సదరు డ్రైవర్ ప్రొఫైల్ ను తాత్కాలికంగా బ్లాక్ చేశామని.. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. అయితే.. క్యాబ్ డ్రైవర్ల వాదన మరోలా ఉంది. ఇటీవల కాలంలో తరచూ తాము మద్యం మత్తులో రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తాజా ఉదంతంలో డ్రైవర్ తొందరపడినట్లుగా అంగీకరిస్తూనే.. చాలా సందర్భాల్లో తాము అర్థరాత్రి వేళ పబ్బులు.. రెస్టారెంట్ల వద్ద క్యాబ్ బుక్ చేసే వారి విషయంలో ఎన్నో అవస్థల్ని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూడాలంటే సదరు డ్రైవర్ పోలీసుల విచారణకు హాజరైతేనే తెలుస్తుందన్న మాట క్యాబ్ డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News