మనువడి కోసం 75 ఏళ్ల వృద్ధుడు కొత్త అడుగు.. నిజం తెలిస్తే షాక్!
భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం కోసం ఆయన ఒక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి మేకప్ సామాగ్రిని అమ్ముతున్నారు.
ఒక తండ్రికి కూతురిపై ఉండే ప్రేమ, ఒక తాతకు మనువడిపై ఉండే అనురాగం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం. చైనాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు ఝు యున్చాంగ్, అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన మనువడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఈ వయసులో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న వైద్యం కోసం ఆయన ఒక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి మేకప్ సామాగ్రిని అమ్ముతున్నారు. ఈ హార్ట్ టచింగ్ స్టోరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కదిలిస్తోంది.
గుండె బద్దలైన క్షణం:
ఝు యున్చాంగ్ తన ఒక్కగానొక్క కూతురిని ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. ఆమెకు ఒక బాబు పుట్టడంతో ఆ కుటుంబంలో ఎంతో సంతోషం నిండింది. కానీ, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇక ఆ చిన్నారికి 'ఎస్ఎమ్‌ఏ టైప్-1' అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు వ్యాధి సోకిందని తేలింది. దీంతో ఆ తల్లి ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా కుంగిపోయింది.
మనువడి కోసం రంగంలోకి తాత:
కూతురి కష్టాన్ని, మనువడి బాధను చూసి ఆ తాత తట్టుకోలేకపోయారు. ఆ అరుదైన వ్యాధి చికిత్సకు అయ్యే మందుల ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇక అంత డబ్బు సంపాదించడం ఆ కుటుంబానికి అసాధ్యంగా మారింది. దాంతో 75 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ పెద్దాయన, ఎలాగైనా డబ్బు సంపాదించి తన మనువడిని బతికించుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.
బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సరికొత్త అవతారం:
డబ్బుల కోసం ఆయన సోషల్ మీడియాను ఎంచుకుని ఒక 'బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్'గా మారారు. లిప్‌స్టిక్స్, మస్కారా, ఐ లైనర్స్ వంటి మేకప్ ప్రొడక్ట్స్‌ను లైవ్ స్ట్రీమింగ్‌లో స్వయంగా తన ముఖానికి వేసుకుని చూపిస్తూ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మొదట్లో అసలు మేకప్ గురించి ఏమీ తెలియకపోయినా, మనువడి ప్రాణం కోసం అన్ని రకాల కాస్మెటిక్స్ గురించి నేర్చుకుని మరీ లైవ్‌లోకి రావడం విశేషం.
వయసుతో పనేముంది, ప్రేమే సర్వస్వం అని నిరూపించారు ఈ తాత. ఒక అమాయకపు చిన్నారి ప్రాణాన్ని కాపాడటం కోసం ఆయన పడుతున్న తపన, చూపిస్తున్న ప్రేమ నిజంగా వెలకట్టలేనివి. ఇక ఈ వృద్ధుడి కథ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఆ మనువడు త్వరగా కోలుకోవాలని, ఈ తాత ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం..