భూమికి ఏమైంది? రోజుల వ్యవధిలో ఇన్ని దేశాల్లో భూకంపాలా?
కేవలం 39 సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా జరిగిన ప్రాణ నష్టం లెక్క రోజులు గడిచే కొద్దీ పెరుగుతోంది.
నాలుగు రోజుల్లో నాలుగు దేశాల్లో చోటు చేసుకున్న తీవ్ర స్థాయి భూకంపాలు కొత్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూమాతకు ఏమైంది? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చోటు చేసుకుందా?అన్న ఉత్సుకత పెరుగుతోంది. ఈ నాలుగు రోజుల్లో చోటు చేసుకున్న భూకంపాలు కాస్తంత విలక్షణతతో కూడుకున్నవిగా చెప్పాలి. ఎందుకంటే.. వేర్వేరు ఖండాల్లో చోటు చేసుకున్న శక్తివంతమైన భూకంపాల కారణంగా జరిగిన నష్టం అపారమైనది. అన్నింటికి మించి జూన్ 24న వెనెజువెలాలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదం నుంచి ఆ దేశం కోలుకోవటానికి కొన్ని నెలల వ్యవధి పట్టొచ్చు.
కేవలం 39 సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు శక్తివంతమైన భూకంపాల కారణంగా జరిగిన ప్రాణ నష్టం లెక్క రోజులు గడిచే కొద్దీ పెరుగుతోంది. ఆస్తి నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెనుజువెలాలో చోటు చేసుకున్న భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.2, 7.5గా నమోదయ్యాయి. ఇది జరిగిన రోజు వ్యవధిలోనే జపాన్ ఈశాన్య తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. మళ్లీ మూడు రోజుల వ్యవధిలోనే (28న) 6.1 తీవ్రతతో వరుస భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఇది జరిపోనట్లుగా అఫ్గానిస్తాన్.. ఫిలిప్పీన్స్ లోనూ భూకంపాలు చోటు చేసుకున్నాయి. శనివారం అఫ్గానిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంప తీవ్రత భారత్ లోని ఢిల్లీ - ఎన్ సీఆర్, కశ్మీర్ వరకు ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఈ భూకంపాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వెనుజువెలాలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం అత్యంత అరుదైనదిగా చెబుతున్నారు. మామూలుగా చూస్తే.. ఒక పెద్ద (తీవ్ర) భూకంపం వచ్చాక చిన్న చిన్న ఆఫ్టర్ షాక్ లు సహజం. కానీ.. మొదటి భూకంపం 7.2 అయితే.. కేవలం 39 సెకన్ల వ్యవధిలో మరో భారీ భూకంపం 7.5 తీవ్రతతో చోటు చేసుకోవటం ఖగోళ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిని సిస్మిక్ డబ్లెట్ గా పిలుస్తారు. ఒకే భూకంపం కారణంగా విడుదల కావాల్సిన ఒత్తిడి.. పక్కపక్కనే ఉన్న రెండు ఫాల్ట్ లైన్స్ మీద పడటంతో ఇలా జరిగిందని విశ్లేషిస్తున్నారు.
రోజుల వ్యవధిలో వేర్వేరు ఖండాల్లో వరుస భూకంపాలు చోటు చేసుకోవటం ఈసారి ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిలో దాదాపు 20వేల భూకంపాలు నమోదవుతాయని అమెరికాకు చెందిన నేషనల్ ఎర్త్ క్వేక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రిపోర్టులు స్పష్టం చేస్తుంటాయి. అంటే.. రోజుకు సగటున 55 భూకంపాలు. గడిచిన వారంలో వెనెజువెలాలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపంతో పాటు మధ్యస్త.. చిన్నపాటి వాటితో కలిపి దాదాపు 93 భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూమి టెక్టోనిక్ ప్రక్రియలో భాగంగా జరిగే అత్యంత సాధారణ అంశంగా చెబుతారు. దీనికి వెనెజువెలాలో చోటు చేసుకున్న భూకంపాలు మినహాయింపుగా చెప్పాలి.
గత వారంలో చోటు చేసుకున్న భూకంపాల్లోని ప్రత్యేకత ఏమంటే.. వెనెజువెలా కరేబియన్ ప్లేట్ లో ఉంటే.. జపాన్ పసిఫిక్ ప్లేట్ లో.. అఫ్గానిస్తాన్ యురేషియన్-ఇండియన్ ప్లేట్ లో వేర్వేరు టెక్టోనిక్ ప్లేట్ల మీద ఉన్నాయి. ఒక ప్లేట్ విడుదల చేసే శక్తి వేల మైళ్ల దూరంలో ఉన్న మరో ప్లేట్ మీద ప్రభావం చూపదని చెబుతున్నారు. నిజానికి చిన్నచిన్న భూకంపాలు చోటుచేసుకోవటమే మంచిదన్నది ఖగోళ శాస్త్రవేత్తల మాట. దీనికి కారణం.. భూమి లోపల నిరంతరం ఒత్తిడి పేరుకుపోతుంటుంది. ఇలా చిన్న.. మధ్యస్థ భూంకపాల కారణంగా ఆ ఒత్తిడి ముక్కలు.. ముక్కలుగా విడుదల కావటం మంచిదే. ఒకవేళ ఈ ఒత్తిడి అలానే పేరుకుపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది.
గత వారం తరహాలో గతంలో ఎప్పుడైనా జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మూడు ప్రధాన సందర్భాల్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. 2010 మార్చిలో వారాల వ్యవధిలో నాలుగు దేశాల్లో పెను వినాశనమే చోటు చేసుకుంది. చిలీలో 8.8తీవ్రతతో.. తైవాన్ లో 6.4 తీవ్రత.. టర్కీలో 6.1 తీవ్రత.. హైతీలో 7.0 తీవ్రతతో వారాల వ్యవధిలో వరుస భూకంపాలు చోటు చేసుకున్నాయి. హైతీలో చోటు చేసుకున్న భూకంపం కారణంగా 2 లక్షల మందికి పైనే మరణించారు. చిలీలో చోటు చేసుకున్న భూకంపంలో 525 మంది ప్రాణాలు కోల్పోయారు.దాదాపు 12 వేల మంది గాయపడ్డారు. సుమారు 3.7 లక్షల ఇళ్లు పూర్తిగా.. పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో దాదాపు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కోట్లరూపాయిల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. 2012 ఏప్రిల్ లో వరుస భూకంపాల కారణంగా ఇండోనేషియా.. మెక్సికో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. 2023 ఫిబ్రవరిలో గంటల వ్యవధిలో టర్కీ - సిరియాలో చోటు చేసుకున్న చోటు చేసుకున్న తీవ్ర భూకంపాలు పెను వినాశనానికి కారణమయ్యాయి.