భారత్‌తో యుద్ధం తర్వాత పాక్ సైన్యానికి భారీ జీతాల పెంపు.. ఆర్థిక సంక్షోభంలోనూ 25% వరకు పెంపు
భారత్ ఇచ్చిన ఈ గట్టి షాక్‌తో పాక్ సైన్యం తీవ్ర నష్టాలను చవిచూడటమే కాకుండా... వారిలో తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తి నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయి.
దేశం దివాళా తీసే అంచున ఉన్నా.. ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నా సరే... పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం తన పాత బుద్ధినే చాటుకుంది. సాధారణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి, సైన్యాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు కుదేలైన పాక్ ఆర్మీలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు, పాకిస్థాన్ ప్రభుత్వం సైనికులు, అధికారుల వేతనాలను ఏకంగా 25 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
'ఆపరేషన్ సింధూర్' ప్రభావమే కారణమా?
గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు 'ఆపరేషన్ సింధూర్' పేరుతో సరిహద్దు దాటి మెరుపు దాడులు చేశాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పరిధిలోని పలు ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది.
భారత్ ఇచ్చిన ఈ గట్టి షాక్‌తో పాక్ సైన్యం తీవ్ర నష్టాలను చవిచూడటమే కాకుండా... వారిలో తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తి నెలకొన్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మీలో నైతిక స్థైర్యాన్ని, యుద్ధ సంసిద్ధతను తిరిగి పెంపొందించేందుకు ఈ భారీ ప్యాకేజీని ప్రకటించినట్లు రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
అలవెన్సుల పెంపు ఇలా..
పాక్ అంతర్గత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కేవలం బేసిక్ శాలరీ మాత్రమే కాకుండా పలు రకాల అలవెన్సులను ప్రభుత్వం భారీగా సవరించింది. అన్ని కేడర్ల సైనికులకు, అధికారులకు ఈ అలవెన్స్‌ను 25 శాతం పెంచారు. క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇచ్చే ఈ భత్యాన్ని ఏకంగా మూడు రెట్లు (300%) పెంచడం గమనార్హం. యూనిఫాం అలవెన్స్, క్యాష్-ఇన్-ల్యూ బెనిఫిట్, బ్యాట్‌మ్యాన్ అలవెన్స్ వంటి కీలక భత్యాలను రెట్టింపు చేశారు. ఈ సవరించిన వేతనాలు, అలవెన్సులు ఉన్నతాధికారుల నుండి దిగువ స్థాయి సిబ్బంది వరకు అందరికీ తక్షణమే అమల్లోకి రానున్నాయి.
జనరల్ అసిమ్ మునీర్‌కు 'ఫీల్డ్ మార్షల్' హోదా
జీతాల పెంపుతో పాటు పాక్ రక్షణ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఇటీవల అత్యున్నత 'ఫీల్డ్ మార్షల్' హోదాను కల్పించారు. పాక్ సైనిక చరిత్రలో అయూబ్ ఖాన్ తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్న రెండో అధికారిగా అసిమ్ మునీర్ నిలిచారు. ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్, సైన్యానికి జీతాల పెంపు... ఈ రెండూ భారత్‌తో తలెత్తిన భద్రతా సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పస్తుల్లో ప్రజలు.. పండుగల్లో సైన్యం
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని గట్టెక్కించేందుకు అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు చాస్తున్న తరుణంలో ప్రజల అవసరాలను పక్కనబెట్టి రక్షణ రంగానికి ఇంతలా నిధులు మళ్లించడంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కంటే సైన్యానికే అగ్రతాంబూలం ఇవ్వడం పాక్ ప్రభుత్వ ప్రాధాన్యతలను మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.