‘ఒమేగా బ్లాక్’ అంటే ఏమిటి? యూరప్‌లో రికార్డు స్థాయి ఎండలకు కారణమైన అరుదైన వాతావరణ వ్యవస్థ

సాధారణంగా ఆహ్లాదకరమైన, మితమైన ఉష్ణోగ్రతలకు నిలయమైన యూరప్ ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

Update: 2026-06-28 13:55 GMT

సాధారణంగా ఆహ్లాదకరమైన, మితమైన ఉష్ణోగ్రతలకు నిలయమైన యూరప్ ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ వంటి దేశాల్లో పాదరసం ఏకంగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడమే కాకుండా రోజురోజుకూ ఎండ తీవ్రత రికార్డులను తిరగరాస్తోంది. ఎన్నడూ లేని విధంగా యూరప్‌ దేశాలను ఈ స్థాయిలో అతలాకుతలం చేస్తున్న ఈ అసాధారణ వడగాలుల వెనుక 'ఒమేగా బ్లాక్ అనే అరుదైన వాతావరణ దృగ్విషయం దాగి ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ప్రస్తుత యూరప్ సంక్షోభమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

వాతావరణంలో ‘ఎయిర్ ట్రాఫిక్ జామ్’

సాధారణంగా భూగోళంపై వాతావరణం సమతుల్యంగా ఉండటానికి పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు వీచే గాలులు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇవి చల్లటి, వేడి గాలి వ్యవస్థలను ఒక చోటి నుంచి మరోచోటికి తరలిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సహజ ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలిగింది. రెండు అల్పపీడన వ్యవస్థల మధ్య ఒక బలమైన అధిక పీడన వ్యవస్థ చిక్కుకుపోయింది. ఇంగ్లీష్ అక్షరం ఒమేగా ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ఇది వాతావరణంలో ఒక రకమైన 'ఎయిర్ ట్రాఫిక్ జామ్' వంటిది. ఈ అధిక పీడన వ్యవస్థ ఒక అదృశ్య గోడలా మారి, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి, తేమతో కూడిన గాలులను యూరప్‌లోకి రాకుండా పూర్తిగా అడ్డుకుంటోంది. ఫలితంగా మేఘాలు ఏర్పడే అవకాశం లేక సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీనికి తోడు సహారా ఎడారి నుంచి వస్తున్న వేడి గాలులు తోడవడంతో యూరప్ దేశాలు హీట్ వేవ్ కోరల్లో చిక్కుకున్నాయి.

ముంచుకొస్తున్న ముప్పులు

ఒమేగా బ్లాక్ సృష్టించే ప్రభావం కేవలం తాత్కాలిక ఎండలతోనే ముగిసిపోదు. ఇది రోజుల తరబడి కొన్నిసార్లు వారాల పాటు ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం వల్ల తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన వడగాలులు, అడవి మంటలు , నదులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడటం వంటి కరువు పరిస్థితులకు ఇది దారితీస్తుంది. సుదీర్ఘ కాలం వర్షాలు లేకపోవడం వల్ల పంటల దిగుబడి ఘోరంగా పడిపోయి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వృద్ధులు, చిన్నారులు హీట్ స్ట్రోక్‌ల బారిన పడే ప్రమాదం ఉంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గడం వల్ల మానవ శరీరం కోలుకునే సమయం దొరకదు. కూలింగ్ వ్యవస్థల కోసం విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగి గ్రిడ్‌లపై అదనపు భారం పడుతుంది. మరోవైపు ఈ వ్యవస్థ కారణంగా కొన్ని ప్రాంతాలలో అధిక పీడనం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడితే దానికి ఇరువైపులా ఉన్న అల్పపీడన ప్రాంతాల్లో ఊహించని రీతిలో భారీ వర్షాలు, వరదలు సంభవించే ప్రమాదం కూడా పొంచి ఉంది.

గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక

ఒమేగా బ్లాక్ అనేది వాతావరణంలో కొత్తగా ఏర్పడిన వ్యవస్థ ఏమీ కాదు.. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే భూతాపం కారణంగా ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఒమేగా బ్లాక్ వంటి ఆటంకాలు ఏర్పడినప్పుడు.. వాటి తీవ్రత మునుపటి కంటే వంద రెట్లు ఎక్కువగా ఉంటోంది. ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులకు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులు తోడై, పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తున్నాయి.

యూరప్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనవి కావు. ఇవి యావత్ ప్రపంచానికి ప్రకృతి అందిస్తున్న ముందస్తు హెచ్చరికలు. గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయకపోతే భవిష్యత్తులో ఇలాంటి అసాధారణ, ప్రమాదకర వాతావరణ పరిస్థితులు తరచూ సంభవిస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తల హెచ్చరికలను ప్రపంచ దేశాలు ఇకనైనా సీరియస్‌గా తీసుకోవాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం. లేకపోతే ప్రకృతి సృష్టించే ఇటువంటి ‘బ్లాక్‌లు’ మానవజాతి మనుగడకే పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News