బండి సంజయ్ సేఫ్.. ఈసారికి ఊపిరి పీల్చుకో..
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవితవ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టే కనిపిస్తోంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవితవ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టే కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో ఆయన స్థానానికి ఎలాంటి ముప్పు లేదని జాతీయ మీడియాతో పాటు బీజేపీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది. గత కొద్ది రోజులుగా బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలపై ప్రచారం జరిగినప్పటికీ తాజా పరిణామాలు మాత్రం అందుకు భిన్నమైన సంకేతాలు ఇస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం భారత్‌కు చేరుకోనున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశముందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30వ తేదీలోపు కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల ప్రధాన మంత్రి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా కొత్త మంత్రుల జాబితాతో కూడిన ప్రతిపాదనను కూడా రాష్ట్రపతికి అందజేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ స్థానంలో ఎలాంటి మార్పు ఉండదనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవలి కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి సబ్సిడీ తీసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బండి సంజయ్‌పై కూడా ప్రభావం పడుతుందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వివాదంతో బండి సంజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, పార్టీ కోసం ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేసిన సేవలను గుర్తించి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల వ్యవహారాలను పార్టీ నాయకుల రాజకీయ బాధ్యతలతో ముడిపెట్టడం సరికాదనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో బండి సంజయ్ కొనసాగనున్నప్పటికీ మిగిలిన కొందరి శాఖల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడికి స్వతంత్ర హోదాతో పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గనుల శాఖ నుంచి పట్టణాభివృద్ధి శాఖకు మార్చే అవకాశాలపై కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు హోంశాఖ పరిధిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ప్రస్తుతం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనను పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఈ మార్పులు ప్రధానంగా శాఖల పునర్విభజనకే పరిమితం అవుతాయని, ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల మంత్రుల్లో ఎవరినీ పూర్తిగా తప్పించే అవకాశం లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే బండి సంజయ్ పదవిపై నెలకొన్న అనుమానాలు దాదాపు తొలగిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అధికారిక ప్రకటన తర్వాతే ఈ మార్పులు, చేర్పులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.