రిపోర్టు: ఆ నేరాలకు ఉత్తరాదిలో తక్కువ శిక్ష.. దక్షిణాదిలో ఎక్కువ!
ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని ఒక సామాజిక అంశంపై ట్రిపుల్ ఐటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.;
ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని ఒక సామాజిక అంశంపై ట్రిపుల్ ఐటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తమ అధ్యయనానికి వారు ఏఐ సాంకేతికతను వినియోగించారు. తీవ్రమైన నేరాలకు శిక్షలు దేశంలోని ఏ ప్రాంతంలో అయినా ఒకేలా శిక్షలు ఉండాలి. ఇదే విషయాన్ని ఎవరిని అడిగినా చెబుతారు. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని ట్రిపుల్ఐటీ రీసెర్చ్ స్కాలర్లు చేపట్టిన అధ్యయనంలో బయటపడింది.
2005 - 10 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన 3500 క్రిమినల్ కేసుల్లో ఇచ్చిన తీర్పులను ఏడాది క్రితం డేటాబేస్ లో నమోదు చేశారు. ఏఐతో వాటిని విశ్లేషించారు. ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. తీవ్రమైన నేరాలు.. వాటికి విధించిన శిక్షలు..జరిమానాలు.. ఇలా అన్నింటిని లెక్క కట్టారు.
ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ క్రిష్ణారెడ్డి, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కేవీకే శాంతితో పాటు పలువురు విద్యార్థులు ఈ అంశంపై పరిశోధన చేసి.. తాజాగా దాని పత్రాన్ని సమర్పించారు. గత నెలలో ఈ అంశంపై వీరు చేసిన అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ స్ప్రింగర్ నేచర్ లో పబ్లిష్ అయ్యింది. ఇందులో గుర్తించిన కీలక అంశం ఏమంటే.. నేరం ఒక్కటే అయినా.. ప్రాంతాల వారీగా నిందితులకు పడిన శిక్షలు.. జరిమానాలు వేర్వేరుగా ఉన్న విషయాన్ని గుర్తించారు.
వేధింపులు.. అత్యాచారాల కేసుల్లో దేశ వ్యాప్తంగా కోర్టులు ఇచ్చిన తీర్పును ఏఐ సహకారంతో విశ్లేషించారు. అనంతరం న్యాయ నిపుణుల సూచనలతో పరిశోధన పత్రంగా తయారు చేశారు. ఇందులో అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాల్లో తక్కువ శిక్షలు.. ఫైన్లు విధించినట్లుగా గుర్తించారు. అదే సమయంలో కేరళలో ఎక్కువ శిక్షలు.. జరిమానాలు విధించినట్లుగా రుజువులు లభించాయి.
హత్య లాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల జరిమానాలు విధించలేదు. కేరళలో మాత్రం భారీగా విధించారు. అత్యాచార కేసుల్లో ఢిల్లీతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్ లో అపరాధ రుసుము భారీగా విధించారు. కిడ్నాప్ కేసుల్లో నిందితులకు హర్యానాతో పోలిస్తే రాజస్థాన్ లోని న్యాయమూర్తులు ఎక్కువకాలం శిక్షలు విధించినట్లుగా తమ అధ్యయన పత్రంలో పేర్కొన్నారు.