తోలు తీస్తానన్న తర్వాత కూడా శాంతంగా ఉంటారా కేటీఆర్?
చేతిలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలు కనిపించకుండా పోతాయి.;
చేతిలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలు కనిపించకుండా పోతాయి. ఎప్పుడైతే అధికారం పోయిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒకవేళ మాట్లాడితే మాత్రం ఏం జరుగుతుంది? అన్న ప్రశ్న తలెత్తొచ్చు. అయితే.. మాటకు మాట పడాల్సి ఉంటుంది. గతంలో మాదిరి వర్తమాన రాజకీయాలు లేవు. దూకుడుగా వ్యవహరించటం.. రాజకీయ ప్రత్యర్థులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్ని మడిచేసి దాచేసిన పరిస్థితి.
ఇప్పుడు నువ్వు రెండు అంటే నేను రెండు వందలు అంటానన్న కాలం వచ్చేసింది. ఇలాంటప్పుడు టార్గెట్ చేసిన వారిని.. లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయాలని డిసైడ్ అయిన వేళ.. కసరత్తు చాలా అవసరం. గులాబీ ముఖ్యనేతల్లో ఒకడైన కేటీఆర్ లో ఇలాంటి గుణం అస్సలు కనిపించదు. రాజకీయ ప్రత్యర్థులు తమను అన్న మాటల్నే ఆయన పరిగణలోకి తీసుకుంటారే తప్పించి.. దానికి కారణం తమ నోటి నుంచి వచ్చిన మాటలే అన్న విషయాన్ని ఆయన మర్చిపోతుంటారు.
పాత విషయాల్ని పక్కన పెడితే.. గత ఆదివారం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. రేవంత్ సర్కారు తోలు తీస్తానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతను తోలు తీస్తానని విపక్ష నేత మాట్లాడితే మౌనంగా ఊరుకోరు కదా? నువ్వు పది అంటావా? నేను వంద అంటానంటూ రివర్సులో విరుచుకుపడటం ఉంటుంది. అందులోనూ రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
తోలు తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే దూకుడుగా సీఎం రేవంత్ కౌంటర ఇవ్వటం తెలిసిందే. దీనిపై తాజాగా మాట్లాడుతున్న కేటీఆర్.. ముఖ్యమంత్రి ఉన్మాదంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటప్పుడే లాజిక్ తెర మీదకు వస్తుంది? అసలు ఈ రచ్చను మొదలు పెట్టింది ఎవరు? అన్న ప్రాథమిక ప్రశ్నకు వేళ్లు అన్ని కేసీఆర్ వైపు చూపిస్తాయి. అలాంటప్పుడు సీఎం రేవంత్ ను నిందించటం ద్వారా కేటీఆర్ తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే కదా?
అధికారం తలకు ఎక్కి.. అహంకారంతో ఉన్మాదిలా ముఖ్యమంత్రి రేవంత్ మారినట్లుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆయనకు.. పార్టీకి నష్టాన్నే కలిగిస్తాయే తప్పించి.. మైలేజీ రాదన్న విషయాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిదన్న సూచన వినిపిస్తోంది. నిత్యం అదే పనిగా రేవంత్ సర్కారుపై ఏదో ఒక మాట అనటం కంటే.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిర్మాణాత్మకంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అంతేతప్పించి.. ఆవేశంతోనో.. ఆగ్రహంతోనో విరుచుకుపడితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్.. కేటీఆర్ లకు అధికారం తలకు ఎక్కిందని.. అహంకారంతో మాట్లాడుతున్నారన్న ముద్ర పడినప్పుడు.. ముందు ఆ మరకను వదిలించుకోవాలే తప్పించి.. తన మాటలతో ఆ మరకను మరింత పెరిగేలా చేసుకోవటం ఏం స్ట్రాటజీ అవుతుంది కేటీఆర్?