వాలంటైన్స్ డే ఎఫెక్ట్... హోటల్ రూమ్ బుక్కింగ్స్ ఏ రేంజ్ లో పెరిగాయంటే..!
సాధారణంగా వాలంటైన్స్ డే రోజు పార్కులు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లలోని కార్నర్ సీట్లు హౌస్ ఫుల్ గా ఉండేవని అంటారు.;
సాధారణంగా వాలంటైన్స్ డే రోజు పార్కులు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లలోని కార్నర్ సీట్లు హౌస్ ఫుల్ గా ఉండేవని అంటారు. అయితే ప్రస్తుతం వాటి స్థానంలో హోటల్ రూమ్స్ వచ్చాయనే విషయం ఆసక్తిగా మారింది. వాస్తవానికి డిసెంబర్ 31 రాత్రికి కూడా హోటల్ రూమ్ బుక్కింగ్స్ రికార్డులు సృష్టించాయని నివేదికలు వెలువడగా.. తాజాగా అంతకు మించి అన్నట్లుగా వాలంటైన్స్ డే వీకెండ్ లో హోటల్ రూమ్ బుక్కింగ్స్ విపరీతంగా పెరిగాయని అంటున్నారు.
అవును... వాలంటైన్స్ డే వీకెండ్ లో బుక్కింగ్స్ లో గణనీయమైన పెరుగుదల ఉందని హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు నివేదిస్తున్నాయి. దీంతో.. భారతీయ జంటల ప్రేమికుల దినోత్సవ వేడుకల్లో భారీ మార్పు కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. క్లియర్ ట్రిప్ డేటా ప్రకారం...వాలంటైన్స్ డే రోజు హోటల్ బుక్కింగ్స్ గత ఏడాదితో పోలిస్తే సుమారు 175 శాతానికి పైగా పెరిగాయి! ఆ వీకెండ్ ఫిబ్రవరి 13 - 16 మధ్య బుక్కింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 58% పెరిగాయని చెబుతున్నారు.
అదారా కంపెనీ డేటా ప్రకారం బుక్కింగ్ ల పెరుగుదలలో ప్రధానంగా దేశంలో ఆగ్రా ముందుంది. ఇక్కడ తాజ్ మహల్ ప్రేమికులను ఎక్కువగా ఆకర్షిస్తుందని అంటున్నారు. ఆ తర్వాత స్థానంలో జైసల్మేర్ ఉండగా... ఇక్కడ జంటలు థార్ ఎడారిలో షాంపైన్ ఈవినింగ్స్ కోసం పరితపిస్తుంటాయని అంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మడికేరి, పుదుచ్చేరి, గోవా, ఉదయ్ పూర్, బెంగళూరు, ఊటీ ఉన్నాయి. ఈ ప్రాంతాల వైపే జంటలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అరయ్య హోటల్స్ & రిసార్ట్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ అమృద నాయర్.. ఈ ఏడాది స్పష్టమైన పెరుగుదలను మరింత స్పష్టంగా చూస్తున్నామని.. తమ రిసార్ట్ ల పోర్ట్ ఫోలియోలో బుక్కింగ్స్ 58% నుంచి 110% వరకూ ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో... ఆగ్రా, జైపూర్, గోవా, గురుగ్రామ్ లలో తమ ప్రాపర్టీలకు డిమాండ్ లో బలమైన పెరుగుదల కనిపిస్తుందని ఐటీసీ హోటల్స్ వెల్లడించింది.
అయితే.. ఈ పెరుగుదలను కేవలం శృంగార విహారయాత్రలుగా మాత్రమే చూడనవసరం లేదని.. ఈ బిజీ లైఫ్ స్టైల్ లో జంటలు పరిపూర్ణమైన, ఎలాంటి అంతరాయం లేని ఏకాంతాన్ని కోరుకుంటున్నట్లుగా చూడొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలోనూ ఎఫెక్ట్ ఫుల్ గా కనిపిస్తోంది!:
ఈ వాలంటైన్స్ డే విహారయాత్రల ఎఫెక్ట్ భారత్ తో పాటు అమెరికాలోనూ తీవ్రంగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో... వాలంటైన్స్ డే వీకెండ్ లో యూఎస్ నుంచి బయలుదేరే రౌండ్ ట్రిప్ విమానాల కోసం 1.6 మిలియన్లకు పైగా ట్రావెల్ ప్లాన్స్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 5శాతం పెరుగుదల అని అంటున్నారు. ఇందులో 77% దేశీయ ప్రయాణాలు కాగా 23% అంతర్జాతీయ ప్రయాణాలు. ఈ క్రమంలో ప్రధాన గమ్యస్థానంగా మెక్సికో ఉందని చెబుతున్నారు.