సైన్యంలోకి 'అర్జున్ ఈగిల్స్'... ఈ గద్దలకు అప్పగించిన బాధ్యత ఇదే!

‘రాజ్యాల్లో, యుద్ధాల్లో పక్షులు’ అనే విషయం ఇప్పటిది కాదనే సంగతి తెలిసిందే. అప్పట్లో గూఢచర్యంలో భాగంగా గద్దలను, పావురాలనూ వాడేవారని వినే ఉంటారు.;

Update: 2026-02-08 14:30 GMT

‘రాజ్యాల్లో, యుద్ధాల్లో పక్షులు’ అనే విషయం ఇప్పటిది కాదనే సంగతి తెలిసిందే. అప్పట్లో గూఢచర్యంలో భాగంగా గద్దలను, పావురాలనూ వాడేవారని వినే ఉంటారు. ఈ తరహా దృశ్యాలు చాలా సినిమాల్లోనే చూసి ఉంటారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయానికి వెళ్తే... ఆ సమయంలో అమెరికా, బ్రిటన్ తో పాటు పలు దేశాలు పావురాలను వాడాయి! అయితే.. అదే సమయంలో తమ శత్రుదేశాల పావురాల్ని వేటాడేందుకు జర్మనీ.. గద్దలను రంగంలోకి దింపింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. భారత సైన్యంలో ఇప్పుడు గద్దలు సందడి చేస్తున్నాయి!

అవును... ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో సైనికులతోపాటు ఆర్మీలోనూ ఒక భాగంగా మారిన బాక్టీరియన్ జాతీకి చెందిన ఒంటెలు, జాన్స్కర్ పోనీలు (గుర్రాలు), శునకాలు కనిపించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో... గద్దలు కూడా కనిపించి, అందరినీ ఆకర్శించాయి. ఆ మధ్య ఉత్తరాఖండ్ లో జరిగిన భారత్ - యూఎస్ సంయుక్త విన్యాసాల్లో వీటిని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేయగా.. ఇవి శత్రు డ్రోన్ లు కనిపించగానే వేగంగా వెళ్లి వాటిని గాల్లో కూల్చేసి చూపర్నులి విస్మయానికి గురిచేసిన పరిస్థితి.

డ్రోన్ లను కూల్చేసే కీలక బాధ్యతలు!:

ఇప్పుడు సరిహద్దులో డ్రోన్ లను కూల్చేసే కీలక బాధ్యతలు వీటికి అప్పగించబడ్డాయి. వాస్తవానికి ఇప్పటికే కరణ్, అర్జున్ అనే రెండు పక్షులు సరిహద్దుల్లో చాలా శత్రు డ్రోన్ లను నేల కూల్చగా.. ఇప్పుడు మొత్తం 15 పక్షుల టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. వీటన్నింటినీ కలిపే "అర్జున్ ఈగిల్స్" అని పిలుస్తున్నారు. వీటికి సైన్యం కోసం జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చే రీమౌంట్ వెటర్నరీ కోర్ సైనిక శిక్షణ అందిస్తోంది. వీటి పని సరిహద్దుల్లో శత్రు డ్రోన్లు కనిపిస్తే రివ్వున గాల్లోకి ఎగిరి వాటిని వెంటనే కూల్చడమే!

అక్రమ రవాణాకు అడ్డుకట్ట!:

గత కొంతకాలంగా పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి భారత సరిహద్దు ప్రాంతాల్లోకి చాలా డ్రోన్లు చొరబడుతుండగా.. వాటితో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీని సాయుధ తిరుగుబాటు గ్రూపులకు డెలివరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో దాదాపు 10వేల కి.మీ. మేర సరిహద్దుల్లో.. ఇవి చిన్నగా ఉండటం వల్ల రాడార్ ల కళ్లుగప్పి ఎంటరవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు వీటికి ‘అర్జున్ ఈగిల్స్’ తో చెక్ పెట్టినట్లయ్యింది!

ఖర్చు రూ.50 కోట్లు కాదు.. రూ.5 లక్షలే!:

ఈ సమయంలో.. డ్రోన్ లలో సులువుగా విరిగిపోయే భాగాలైన రోటర్ లు, ప్రొపెల్లర్ లపై దాడిచేసేలా వీటికి శిక్షణ ఇస్తున్నారు. ఆ సమయంలో వీటికి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా కాళ్లకు లెదర్ కవచాలు తొడుగుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ పక్షిపైనా శిక్షణ, ఇతర అవసరాలకోసం ఏటా రూ.5 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి శత్రుదేశాల డ్రోన్ లను అడ్డుకోవడానికి డిఫెన్స్ డ్రోన్ ల కోసం సైన్యం ఐదు నుంచి 50 కోట్ల రూపాయల వరకూ పెడుతుంది!

ఫాల్కన్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్!:

కాగా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పక్షుల వాడకాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించకపోగా.. 2016లో మాత్రం నెదర్లాండ్ పోలీసులు వీఐపీలను డ్రోన్ ల దాడి నుంచి కాపాడటానికి పక్షుల్ని వాడారు. ఇదే క్రమంలో.. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా ఈదే పనికి పూనుకుంది. ఇక.. తెలంగాణ పోలిసులూ గరుడ ఫోర్స్ పేరుతో ఇలాంటి విభాగాన్ని తయారు చేయగా.. 2020లో భారత్ దీనికోసమే ఫాల్కన్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ను రూపొందించింది.

Tags:    

Similar News