ఈ20 పెట్రోల్ పాత వాహనాలకు సురక్షితమేనా? కేంద్రం కీలక వివరణ..

ప్రభుత్వం ఈ20ని సురక్షితమైనదిగా ప్రకటించినప్పటికీ 2016 కంటే ముందు తయారైన వాహనాల విషయంలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమని పేర్కొంది.

Update: 2026-07-30 06:55 GMT

దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ పాత కార్లు, బైక్‌ల యజమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ20 పెట్రోల్ వల్ల ఇంజిన్లు పాడవుతాయా? నిర్వహణ ఖర్చులు పెరుగుతాయా? అనే ప్రశ్నలపై ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది.

కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లకు తీవ్ర నష్టం జరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో మెజారిటీ వాహనాలు ఎటువంటి ఇంజిన్ మార్పులు లేకుండానే ఈ20 ఇంధనంతో నడవగలవని తేలింది.

పాత వాహనాల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రభుత్వం ఈ20ని సురక్షితమైనదిగా ప్రకటించినప్పటికీ 2016 కంటే ముందు తయారైన వాహనాల విషయంలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమని పేర్కొంది. రబ్బరు భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని.. ఈ20 ఇంధనంలో ఎథనాల్ శాతం ఎక్కువ ఉండటం వల్ల పాత వాహనాల్లోని ఫ్యూయల్ హోస్‌లు, రబ్బరు సీల్స్, గ్యాస్కెట్లు సాధారణం కంటే కొంచెం వేగంగా అరిగిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఇది అంత తీవ్రమైన మెకానికల్ సమస్య కాదని, రెగ్యులర్ సర్వీసింగ్ సమయంలో ఈ రబ్బరు విడిభాగాలను మార్చుకుంటే సరిపోతుందని తెలిపింది. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా తయారైన పాత వాహనాల్లో ఈ20 వాడటం వల్ల మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది.

పర్యావరణం.. ఆర్థిక ప్రయోజనాలు

ఈ20 పెట్రోల్ వల్ల కొన్ని చిన్నపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దీనివల్ల దేశానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఎథనాల్ కలపడం వల్ల ఇంధనం ఇంజిన్‌లో మరింత శుభ్రంగా దహనమై కాలుష్య ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాకుండా విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గి దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.

వినియోగదారుల సంఘాలు ఇంకా కొన్ని విషయాలపై స్పష్టత కోరుతున్నప్పటికీ పాత వాహనదారులు భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. మీ వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, ముఖ్యంగా ఫ్యూయల్ లైన్లు , రబ్బరు భాగాలను పర్యవేక్షించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చు.

Tags:    

Similar News