భోగాపురం vs శంషాబాద్: యూజర్ ఛార్జీల లెక్కేంది? ఎందుకిలా?
దేశీయ ప్రయాణం చేసే వారు భోగాపురం నుంచి బయలుదేరి వెళ్లే వారు రూ.835 చెల్లించాల్సి వస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఫీజు రూ.750గా ఉంది.
మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలోని పాత విమానాశ్రయానికి బదులుగా నగర శివారులోని భోగాపురం ఎయిర్ పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో భోగాపురం విమానాశ్రయం పని చేయనుంది. ఆ రోజు నుంచి (16 అర్థరాత్రి సరిగ్గా 12 గంటల నుంచి) వైజాగ్ పాత ఎయిర్ పోర్టుకు ఉన్న వీటీజెడ్ (VTZ) అంతర్జాతీయ కోడ్ కూడా ఆగస్టు 17 (00.00) నుంచి భోగాపురంలోని కొత్త ఎయిర్ పోర్టుకు వర్తించనుంది.
ఆగస్టు 17 నుంచి ప్రస్తుతం వైజాగ్ లోని పాత విమానాశ్రయం నుంచి సాధారణ కమర్షియల్ విమాన సర్వీసులు అన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అన్ని సర్వీసులు భోగాపురానికి బదిలీ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినంతనే ఇంతకాలం వైజాగ్ పాత ఎయిర్ పోర్టుకు ఉన్న పరిమితులు తొలిగిపోనున్నాయి. ఇప్పటివరకు రాత్రి పది గంటల తర్వాత విమాన రాకపోకలకు అవకాశం లేని పరిస్థితి. అందుకు భిన్నంగా.. భోగాపురంలో 24 గంటలు విమానాశ్రయం పని చేయనున్నాయి.
వైజాగ్ పాత విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలో ఉన్న కారణంగా.. రాత్రివేళ సర్వీసులు.. విమాన రాకపోకల మీద తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. అవిప్పుడు తొలిగిపోనున్నాయి. దీంతో రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం ఏడు గంటల వరకు వివిధ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అంతర్జాతీయ సర్వీసులు వైజాగ్ నుంచి తమ విమాన సర్వీసుల్ని నేరుగా నడిపేందుకు ఆసక్తిని చూపటం ఖాయమని చెప్పాలి.
భోగాపురంలో 3800 మీటర్ల పొడవైన విశాలమైన రన్ వేను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. అత్యాధునిక క్యాట్ 1 ఇన్ స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం ఉన్న నేపథ్యంలో వర్షాకాలంతో పాటు.. శీతాకాలం.. రాత్రివేళ దట్టమైన పొగమంచు కురిసినా విమానాలు సురక్షితంగా.. ఎలాంటి ఆలస్యం కాకుండా ల్యాండ్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నా.. ఒక విషయంలో కొంతపాటి అసంతృప్తికి గురి చేసే అంశాలు ఉన్నాయి.
సాధారణంగా ఒక కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు.. కొన్ని పెద్ద విమానాశ్రయాలతో పోలిక కామన్ గా ఉంటుంది. విశాఖకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మధ్య దూరం ఎక్కువే అయినా.. తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద విమానాశ్రయం శంషాబాద్ అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కొన్ని అంశాల్ని పరిశీలించిన వేళలో.. శంషాబాద్ విమానాశ్రయ ప్రస్తావన.. పోలిక కామన్ గా వస్తుంటుంది.
ఇప్పుడు అలాంటి పోలిక చూసినప్పుడు ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. అదేమంటే.. విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్ మెంట్ ఫీజుల విషయంలో రెండు ఎయిర్ పోర్టుల మధ్య పోలిస్తే.. భోగాపురంలో ఫీజులు ఎక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయంలో యూజర్ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేయటం ద్వారా.. ఆ భారం ప్రయాణికుల మీద పడుతుందన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శంషాబాద్ నుంచి ప్రయాణించే ఒక ప్రయాణికుడికి.. భోగాపురం నుంచి ప్రయాణించే దేశీయ.. అంతర్జాతీయ ప్రయాణికుడికి మధ్య యూజర్ డెవలప్ మెంట్ ఫీజుల లెక్కను చూడటంతో పాటు.. ఈ రెండు విమానాశ్రయాలకు దేశీయ రూట్ల నుంచి అంతర్జాతీయ రూట్ల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్ మెంట్ ఫీజులు ఎక్కడ ఎంత అన్న విషయంలోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తక్కువ ఫీజులు ఉండటం కనిపిస్తుంది.
దేశీయ ప్రయాణం చేసే వారు భోగాపురం నుంచి బయలుదేరి వెళ్లే వారు రూ.835 చెల్లించాల్సి వస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ఫీజు రూ.750గా ఉంది. అదే సమయంలో దేశీయ ప్రయాణం అంటే.. వివిధ రూట్ల నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకునే వారి నుంచి రూ.355 వసూలు చూస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయటం లేదు.
అదే విధంగా అంతర్జాతీయ ప్రయాణానికి భోగాపురం నుంచి బయలుదేరే వారు రూ.1255 చెల్లించాల్సి వస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరే వారి నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. అదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు విదేశాల నుంచి వచ్చే వారి నుంచి రూ.545 వసూలు చేస్తుంటే.. శంషాబాద్ కు చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయని పరిస్థితి. అంటే.. శంషాబాద్ వర్సెస్ భోగాపురం విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే ప్రయాణికులకు యూజర్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది.
శంషాబాద్ వరకు ఎందుకు? వైజాగ్ పాత ఎయిర్ పోర్టు వర్సెస్ కొత్త ఎయిర్ పోర్టులో యూజర్ ఛార్జీల లెక్క చూసినా.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఉదాహరణకు పాత వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు ఒకరు ప్రయాణించి.. తిరిగి వస్తే ఇప్పుడు వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలు ఎంత? కొత్తగా నిర్మించిన భోగాపురం నుంచి అదే హైదరాబాద్ కు వెళ్లి వస్తే వసూలు చేసే యూజర్ ఛార్జీలు ఎంతన్న విషయంలోకి వెళితే.. వైజాగ్ పాత ఎయిర్ పోర్టులో మొత్తంగా ఈ యూజర్ ఛార్జీలు రూ.354 మాత్రమే. అదే.. భోగాపురం ఎయిర్ పోర్టులో మాత్రం రూ.1190గా ఉండనున్నాయి. ఎందుకిలా? అంటే.. కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టే పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవటంతో పాటు.. కేంద్ర విమానయాన శాఖ నిబంధనలుగా చెప్పాలి. వీటి విషయంలో ఏపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఎక్కువమంది ప్రయాణికుల్ని ఆకర్షించే వీలుంది.
ఇలాంటి పోలిక సరైనదేనా? అంటే.. భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. కొత్తగా నిర్మించిన విమానాశ్రయం కోసం పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవటానికి ఇలాంటివి మామూలే అన్న మాట వినిపించినా.. చివరకు సగటు ప్రయాణికుడి కోణంలో చూసినప్పుడు మాత్రం భారం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు పాత ఎయిర్ పోర్టు నగరం మధ్యలో ఉండటం.. కొత్త విమానాశ్రయం నగరానికి దూరంగా ఉండటంతో క్యాబ్ ఖర్చుల భారం పడనుంది. కొత్త ఎయిర్ పోర్టు కారణంగా భారమే కదా? అన్న ప్రశ్న తలెత్తటం ఖాయం. అయితే.. ఒక ప్రయోజనం ఉండదని చెప్పాలి.
అదేమంటే.. పాత ఎయిర్ పోర్టులో పరిమితంగానే సర్వీసులు లభించేవి. అది కాస్తా ఇప్పుడు ఎక్కువ సర్వీసులు లభించటం ద్వారా.. వైజాగ్ వాసి తమ నగరం నుంచే తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి చేరుకునే వీలు ఉంటుంది. గతంలో మాదిరి అయితే హైదరాబాద్.. లేదంటే మరే ఇతర ప్రాంతం నుంచి ప్రయాణించే కష్టం తప్పుతుంది. దీని కారణంగా సమయం.. కాస్తంత డబ్బులు ఆదా అవుతాయి. కాకుంటే.. యూజర్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ద్వారా ప్రయాణికుడి మీద పడే భారాన్ని కాస్తంత తగ్గించే వీలుందని చెప్పక తప్పదు.