హర్యానాలో సైకిల్ స్టంట్: రూ.7 వేల కోసం ప్రాణం పోయిన దారుణం!
హర్యానాలోని నూహ్ జిల్లాకు చెందిన దీపక్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తూ ఉంటాడు. అతను హర్యానాలోని ఖోరీ కలాన్ గ్రామానికి చెందిన వాడు.
సాహస విన్యాసాల పేరుతో ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. తన సాహస విన్యాసాలతో ఒక యువకుడు వందలాది మందిని అలరించి.. చివరలో అతను చేపట్టిన సాహస స్టంట్ అతని ప్రాణం పోయేలా చేసింది. ఇంతా చేస్తే.. నిర్వాహకుల పెట్టిన కండీషన్.. వసూలు కావాల్సిన రూ.7100 మొత్తం అందుబాటులోకి రాకపోవటంతో సదరు వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. కాస్తంత కన్ఫ్యూజన్ గా ఉందా? వివరాల్లోకి వెళితే.. విషయం ఇట్టే అర్థమవుతుంది. హర్యానాలోని నూహ్ జిల్లాకు చెందిన దీపక్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తూ ఉంటాడు. అతను హర్యానాలోని ఖోరీ కలాన్ గ్రామానికి చెందిన వాడు.
అతను.. సైకిల్ లో అత్యద్భుతమైన సాహస విన్యాసాలు చేస్తుంటాడు. అతను చేసే విన్యాసాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. కదులుతున్న సైకిల్ మీద నిలబడటం.. కళ్లకు గంతలు కట్టుకొని సైకిల్ నడపటం.. సైకిల్ హ్యాండిల్ మీద నిలబడి బ్యాలెన్స్ చేయటం లాంటి ఎన్నో సాహసాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన సాహస విన్యాసాలకు ముగింపుగా ఏడో రోజు అతను చేసిన సాహస విన్యాసం.. చివరకు అతడి ప్రాణం పోయేలా చేసింది. దీనికి నిర్వాహకుల నిర్లక్ష్యం.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
సైకిల్ సర్కస్ నిర్వహించే 27 ఏళ్ల దీపక్ తాజాగా ఆరు రోజుల పాటు తన సాహస విన్యాసాన్ని నిర్వహించగాడు. ఏడో రోజు అత్యంత కీలకమైన.. ప్రమాదకర విన్యాసానికి తెర తీశాడు. ఇందులో భాగంగా అతన్ని ఒక ప్రత్యేక సంచిలో ఉంచి.. అతడి సాహస విన్యాసం కోసం తవ్విన ఒక గోదిలో దించారు. ఆ తర్వాత మట్టితో కప్పేశారు. 24 గంటల తర్వాత అతడని సజీవంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రేక్షకులకు ప్రకటించారు. దీపక్ ను గోతిలో నుంచి బయటకు తీయాలంటే రూ.7100 మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాల్సి ఉంటుంది. దీన్ని సేకరించే ప్రక్రియలో ఆలస్యమైంది. 24 గంటలు కాస్తా.. దగ్గర దగ్గర 36 గంటలు పట్టింది.
చివరకు ప్రకటించినట్లే రూ.7100 మొత్తాన్ని సేకరించిన తర్వాత మట్టి తీసి.. గోతిలో ఉంచిన సంచిలో నుంచి బయటకు తీయగా అప్పటికే అతను మరణించాడు. ఎక్కువసేపు భూగర్భంలో ఉండటంతో ఊపిరి ఆడని కారణంగా చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనా. దీపక్ మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి ప్రమాదకర సాహస క్రీడలకు తెర తీసే వేళలో తగిన భద్రతా ఏర్పాట్లు తీసుకోకుండా స్టంట్లను నిర్వహించటం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులను అలరించేందుకు ఇలాంటి విన్యాసాలు చేసే కళాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. అలాంటివేమీ పట్టని నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీపక్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అతడ్ని ముందుగా చెప్పిన సమయానికి బయటకు ఎందుకు తీయలేదు? నిర్వాహకుల బాధ్యత ఎంత? లాంటి అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఏమైనా.. అరుదైన సాహస విన్యాసాల్ని చేసే ఒక కళాకారుడు మరణించటం విషాదకరం. అందుకు రూ.7వేల మొత్తం కారణం కావటం మరింత వేదనకు గురి చేసే అంశంగా చెప్పక తప్పదు.