దొందూ దొందే.. కంగనా వర్సెస్ సౌరవ్ దాస్
దీంతో మోడీ సర్కారు మెడలు వంచిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మీద బీజేపీ ఎంపీకంగనా రౌనత్ తీవ్ర విమర్శలు చేశారు.
పోరు చేసే వారు పొరపాట్లు చేయకూడదు. ఉన్నత లక్ష్యం కోసం పని చేసే వేళలో.. ఇబ్బందులు ఎదురవుతాయి. కఠిన సవాళ్లకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దూషణలు.. వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవటం మామూలే. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా రాజకీయ రంగంలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కోట్లాది మందిని కదిలించే సత్తా ఉన్నోళ్లు.. మరింత సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరు స్థాయి మరిచి మాట్లాడితే.. కంటికి కన్ను.. పంటికి పన్ను అన్నట్లుగా స్పందిస్తే ప్రయోజనం ఏముంది? అప్పుడు దొందూ దొందే అవుతారు కదా? ఈ విషయాన్ని సీపీజే ప్్రతినిధి సౌరవ్ దాస్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. తాము చేసిన పోరుకు పుష్కరానికి పైనే తిరుగులేని అధికార కేంద్రంగా ఉన్న మోడీ సర్కారుకు చెమటలు పట్టించిన సందర్భంలో.. ఎదురయ్యే విమర్శలు తీవ్రంగానూ.. పరుషంగానూ ఉంటాయి. అలాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని.. తనను టార్గెట్ చేసే వారిని ఇరుకున పడేలా చేయటంలోనే అసలైన తెలివిగా చెప్పాలి.
ఈ విషయంలో సౌరవ్ దాస్ తడబడ్డాడు. తన మీద నోరు పారేసుకున్న ప్రముఖ సినీ నటి కం బీజేపీ ఎంపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో సంబంధం లేని మూడో వ్యక్తి ప్రస్తావన తీసుకొచ్చి.. కంగనాను ఇరుకున పడేయాలని భావించినట్లుగా కనిపిస్తుంది.ఇప్పుడు అదే.. అతడికి ఇబ్బందిగా మారటమే కాదు.. అతడి స్థాయిని తగ్గించేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. నీట్ పోటీ పరీక్షా పత్రం లీకేజీ ఉదంతంలో ఆ శాఖను చూసే కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం.. చివరకు చేపట్టిన ఆందోళన సూపర్ హిట్ కావటమే కాదు.. కేంద్రం దిగి వచ్చి సదరు కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
దీంతో మోడీ సర్కారు మెడలు వంచిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మీద బీజేపీ ఎంపీకంగనా రౌనత్ తీవ్ర విమర్శలు చేశారు. సీజేపీ నిర్వహించిన నిరసనలు.. ఆ సందర్భంగా జెన్ జీ నిరసనకారుల వీడియోలు చూస్తుంటే తనకు అసహ్యం వేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వారి భాష.. ప్రవర్తన తనను బాధించాయని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన స్పందనను తెలియజేసే క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు.. వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉండటమే కాదు విమర్శలకు తెర తీశాయి.
సీజేపీ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొని.. దూకుడుగా దూషణలకు దిగిన వారిని ఉద్దేశించి ఆమె నోరు పారేసుకున్నారు. ఒక క్రమంలో ఇలాంటి వాళ్లను ఎలా కంటారో అంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కంగనా రౌనత్ అహంకారాన్ని పలువురు తప్పు పట్టారు. ఒక ఎంపీగా ఉంటూ ఈ మాటలేంటి? అంటూ మండిపడినోళ్లు లేకపోలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన సీజేపీ ముఖ్యుడు సౌరవ్ దాస్ స్పందిస్తూ.. ‘‘ఆమెను సొంత పార్టీ నేతలే సీరియస్ గా తీసుకోవటం లేదు. ప్రజా జీవితంలో ఉన్న ఒక ఎంపీ యువతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. జెన్ జీ దేశంలో మార్పు కోసం పోరాడుతోంది. వారి గొంతును తక్కువ చేసి చూకూడదు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు తగిన రీతిలో ఉన్న పరిస్థితి.
దీనిపై కంగనా రౌనత్ స్పందించారు. ఒక మీడియా సంస్థకు సౌరవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఆమె విమర్శలు గుప్పించారు. సౌరవ్ గురించి మాట్లాడుతూ.. అతడి గురించి తాను గూగుల్ లో వెతికానని.. అతడి వయసు 28 ఏళ్లుగా తాను తెలసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. అతనో పనికిమాలిన వ్యక్తి అని అర్థమైందని పేర్కొన్నారు. అక్కడితో ఆగని ఆమె.. తాను ఆ వయసులో ఉన్న వేళలో రెండు జాతీయ అవార్డుల్ని అందుకున్నట్లుగా తెలుపుతూ.. ‘‘ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవటం ప్రారంభించు. నటిగా.. నిర్మాతగా..రచయిత్రిగా.. వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో పని చేశా’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సౌరవ్ స్పందించారు.
తాను మొదట్నించి ఫాలో అవుతున్న పద్దతినే తాజా విమర్శలకు సమాధానంగా చెబితే సౌరవ్ దే పైచేయిగా ఉండేది. అతను మరింత మందికి కొత్త స్ఫూర్తి అయ్యేవాడు. కానీ.. రాజకీయ సంవాదాల మీద అవగాహన తగినంతగా లేకపోవటం కావొచ్చు.. భావోద్వేగాలకు గురయ్యేలా విమర్శలు సంధించే వారికి తగినట్లుగా.. సెటెల్డ్ గా స్పందించే విషయంలో తడబడ్డాడు. తనను ఉద్దేశించి కంగనా రౌనత్ కు తగిన రీతిలో విమర్శలు చేయాలని డిసైడ్ అయిన అతను అవసరం లేని అంశాన్ని ప్రస్తావించి నోరు జారాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక అంశం మీద ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు.. సంబంధం లేని మూడో వ్యక్తిని లాగకూడదు. అది కూడా.. ఈ మొత్తం ఎపిసోడ్ తో అస్సలు సంబంధం లేని వ్యక్తి.. తన మానాన తాను ఉండే వారిని ఉద్దేశించి.. వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు చేయకూడదు. కానీ.. సౌరవ్ మాత్రం ఆ పనిని వ్యంగ్య రూపంలో చేసేశాడు. కంగనాకు కౌంటర్ ఇచ్చే క్రమంలో సినీ హీరో హృతిక్ రోషన్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ ఇష్యూ మరింత ముదిరిన పరిస్థితి. తనను తన స్నేహితులు యువ హృతిక్ రోషన్ లా కనిపిస్తానని చెబుతుంటారని.. అయితే కంగనా మాత్రం తనపై తీవ్రంగా స్పందిస్తున్నట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసి.. ఎక్కడో మండేలా చేశారు. దీంతో గతంలో కంగనా - హృతిక్ రోషన్ మధ్య ఉన్న వివాదం తెర మీదకు వచ్చింది.
2016లో ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను ఉద్దేశించి కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య ప్రేమ సంబంధం ఉందన్నట్లుగా ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని హృతిక్ రోషన్ ఖండించారు. దీంతో.. ఇద్దరి మధ్య కాస్తంత పంచాయితీ జరిగి.. ఒకరికొకరు ఇద్దరూ లీగల్ నోటీసులు పంపుకునే వరకు విషయం వెళ్లింది. తమ మధ్య సంబంధం ఉందని కంగనా చెబితే.. అలాంటి సంబంధం ఎప్పుడూ లేదని హృతిక్ రోషన్ స్పష్టం చేశారు. ఆ వివాదం అలా ఉండిపోయింది.
తాజాగా సౌరవ్ ఇప్పుడు అదే పాయింట్ ను తనదైన శైలిలో టచ్ చేసి.. కంగనా మీద మాటల దాడిని పెంచాడు. ఇక్కడ అభ్యంతరం ఏమంటే.. కంగనా తనకు మధ్య జరుగుతున్న పంచాయితీకి సంబంధం లేని హృతిక్ ను లాగటమే. ఈ తీరును కొందరు తప్పు పడుతుంటే.. మరికొందరు కంగనాకు సరైనోడు తగిలాడన్న వ్యాఖ్యలు చేస్తున్నాడు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఒకరు సభ్యత మరిచి విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయికి దిగకుండా కూడా సమాధానం చెప్పొచ్చన్న విషయాన్ని సౌరవ్ లాంటి యువకులు మిస్ కావటం అంత మంచిది కాదని మాత్రం చెప్పక తప్పదు.