బ్రిటన్ లోని తోపు పోర్ట్ కంపెనీ మీద అదానీ కన్ను!
ఇంగ్లండ్.. స్కాట్లాండ్.. వేల్స్ లో వ్యూహాత్మకంగా కీలకమైన 21 ప్రముఖ నౌకాశ్రయాల్ని నిర్వహించే ఏబీపీ మీద అదానీ గ్రూప్ కన్నేసినట్లుగా చెప్పాలి.
చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం మామూలే. ఒకప్పుడు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి.. వందల ఏళ్ల పాటు భారత్ ను పాలించటమే కాదు.. అత్యంత కీలకమైన సహజ వనరులు మొదలు సంపదను భారీగా దోచేసిన తెల్లోడి గురించి తెలిసిందే. మారిన కాలానికి తగ్గట్లే.. ఇటీవల కాలంలో భారత్ కు చెందిన కొన్ని కంపెనీలు బ్రిటన్ కు చెందిన పలు కంపెనీల్ని సొంతం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే బ్రిటన్ లో ఫేమస్ బ్రాండ్ అయిన టెట్లీ టీ బ్రాండ్.. కోరస్ స్టీల్.. ల్యాండ్ రోవర్.. జాగ్వార్ లాంటి బ్రాండ్లు టాటా గ్రూప్ సొంతం కావటం తెలిసిందే. ఇప్పుడు అదానీ అదే లెక్కలోకి వెళుతున్నారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పే అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఏబీపీ)లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ సిద్ధమయ్యారా? అంటే అవునన్న మాట వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఏబీపీలో 63.88 శాతం వాటాను సొంతం చేసుకోవటానికి దాదాపు రూ.95వేల కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అయితే.. అదానీ గ్రూప్ దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇంగ్లండ్.. స్కాట్లాండ్.. వేల్స్ లో వ్యూహాత్మకంగా కీలకమైన 21 ప్రముఖ నౌకాశ్రయాల్ని నిర్వహించే ఏబీపీ మీద అదానీ గ్రూప్ కన్నేసినట్లుగా చెప్పాలి. భారతదేశంలో అదానీ గ్రూప్ నకు 8 ప్రధాన సముద్ర తీర రాష్ట్రాల్లో మొత్తం 15 వ్యూహాత్మక పోర్టులు.. టెర్మినల్స్ ఉన్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి కేంద్రపాలిక ప్రాంతంతో కలిపి మొత్తం 15 వ్యూహాత్మక పోర్టులు ఉన్నాయి. ఇవి కాక నాలుగు అంతర్జాతీయ పోర్టులు ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్.. శ్రీలంక.. ఆస్ట్రేలియా.. టాంజానియాలో పోర్టులు ఉన్న అదానీ గ్రూప్ నకు తాజా డీల్ ఓకే అయితే.. యూకేలో అతి పెద్ద పోర్టు కంపెనీలో మెజార్టీ వాటా సొంతమవుతుంది.
భారతదేశంతో పాటు.. విదేశాల్లోని మొత్తం 19 పోర్టుల ద్వారా అదానీ సంస్థ.. భారతదేశ మొత్తం సముద్ర వాణిజ్య పరిమాణంలో దాదాపు 27శాతంగా చెబుతారు. ఇక.. ఏబీపీ విషయానికి వస్తే యూకేలో 21 ప్రముఖ నౌకాశ్రయాల్ని నిర్వహిస్తోంది. ఈ నౌకాశ్రయాల ద్వారా 425 లక్షల టన్నుల ఎగుమతి.. దిగుమతులతో భారీ ఎత్తున ఆర్జిస్తోంది. యూకే వ్యాప్తంగా జరిగే సముద్ర వాణిజ్యంలో దాదాపు 25 శాతం ఏబీపీకి చెందిన పోర్టుల ద్వారానే జరుగుతుంది.
ఇంతకూ ఏబీపీలో మెజార్టీ వాటాను అదానీ ఎలా సొంతం చేసుకోనున్నారు? అన్నది ఆసక్తికర అంశం. ఆ విషయంలోకి వెళితే.. ఏబీపీ ఈక్విటీలో కెనడాకు చెందిన రెండు పెన్షన్ ఫండ్ సంస్థలకు 63.88 శాతం వాటా ఉంది. సింగపూర్.. కువైట్ తో పాటు మరో రెండు ప్రైవేటు ఈక్విటీ కంపెనీల చేతిలో మరో 30 శాతం వాటా ఉంది. కెనడా పెన్షన్ ఫండ్స్ చేతిలో ఉన్న వాటా కోసం అదానీ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ చర్చలు విజయవంతమైతే.. బ్రిటిష్ నౌకా రంగంలో ఒక భారతీయ కంపెనీ పెట్టే అత్యధిక ఇన్వెస్ట్ మెంట్ ఇదే అవుతుందని చెప్పాలి. ఈ డీల్ ఓకే అయితే.. నౌకా రంగంలో మరో సంచలనానికి అదానీ తెర తీసినట్లుగా చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.