మధ్యాహ్న భోజన మెనూలో చికెన్ బిర్యానీ.. దళపతి సర్కార్ సంచలన నిర్ణయం!

కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) మెనూలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Update: 2026-07-30 08:34 GMT

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఆకస్మిక పర్యటనలు, ప్రజాకర్షక నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో సంచలన ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, స్కూళ్లలో హాజరు శాతాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథకంలో విప్లవాత్మక మార్పునకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ వడ్డించే ఆలోచనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

మధ్యహ్న భోజనం పథకంలో చికిన్ బిర్యానీ పెట్టాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తమిళనాడు విద్యాశాఖ మంత్రి ఏ.రాజ్‌మోహన్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ ప్రతిపాదనపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. విద్యార్థులకు మరింత రుచికరమైన, ప్రోటీన్లు అధికంగా ఉండే పౌష్టికాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రతిపాదనను రూపొందించినట్లు మంత్రి రాజ్‌మోహన్ తెలిపారు. విద్యాశాఖ ప్రతిపాదనను ఇప్పటికే సీఎం జోసెఫ్ విజయ్‌కు సమర్పించామని, ప్రస్తుతం ఇది ఆయన పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకానికి దశాబ్దాల చరిత్ర ఉంది. దేశంలోనే ఈ పథకానికి తమిళనాడు పుట్టినిల్లు వంటిది. కాలక్రమేణా వివిధ ప్రభుత్వాల హయాంలో ఈ పథకానికి అనేక మార్పులు చేశారు. జస్టిస్ పార్టీ హయాంలో పాఠశాలల్లో ఆహార పంపిణీ ప్రారంభం కాగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కే. కామరాజ్ దీన్ని మధ్యాహ్న భోజన పథకంగా అధికారికంగా విస్తరించారు. ఆయన తర్వాత కలైంజర్ ఎం.కరుణానిధి ఈ పథకంలో కోడిగుడ్లను చేర్చి పిల్లలకు అదనపు పోషకాలు అందేలా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎంజీఆర్ దీన్ని మరింత విస్తరించి 'పోషకాహార పథకం'గా మార్చగా, అమ్మ జయలలిత దీన్ని మరింత బలోపేతం చేసి వారమంతా క్రమం తప్పకుండా గుడ్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కోవలోనే, ఇప్పుడు సీఎం విజయ్ హయాంలో విద్యార్థులకు సరికొత్త ఆకర్షణగా 'చికెన్ బిర్యానీ'ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం.

కేవలం మధ్యాహ్న భోజనమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) మెనూలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థి అల్పాహారం కోసం ప్రభుత్వం సుమారు రూ. 15 ఖర్చు చేస్తోంది. అయితే నిత్యం ఒకే రకమైన గోధుమ లేదా రవ్వ ఉప్మా వంటి అల్పాహారాలు పునరావృతం కాకుండా, విద్యార్థులకు బోర్ కొట్టకుండా ఉండేలా మరింత రుచికరమైన పౌష్టిక విలువలు కలిగిన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పిల్లలు ఇష్టంగా తినేలా మెనూలో వైవిధ్యం ఉండాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

ప్రస్తుతానికి ఈ చికెన్ బిర్యానీ ప్రతిపాదన అల్పాహార మార్పుల అంశం సీఎం విజయ్ పరిశీలన దశలోనే ఉంది. సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారత శాఖలతో పాటు సంబంధిత ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి, ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం, పారదర్శకమైన సరఫరా వ్యవస్థ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష జరిపిన తర్వాత దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, దేశంలో స్కూలు మిడ్-డే మీల్ చరిత్రలో తమిళనాడు ప్రభుత్వం మరో చారిత్రక మైలురాయిని తాకినట్లవుతుంది. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చిందించే ఈ నిర్ణయం కోసం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News