ఏఐ విప్లవం: భారత్‌లో 8-12% ఉద్యోగాలపై ప్రభావం.. కానీ అంతా నష్టమే కాదు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ విస్తరణతో "మా ఉద్యోగాలు ఊడిపోతాయా?" అనే భయం సగటు ఉద్యోగిని వెంటాడుతోంది. ఈ సమయంలో ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ విడుదల చేసిన తాజా నివేదిక పలు ఆసక్తికరమైన, ఉపశమనం కలిగించే అంశాలను వెల్లడించింది.
8-12% ఉద్యోగాలకు మాత్రమే ముప్పు
గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో సుమారు 8% నుండి 12% వరకు జెన్ ఏఐ ప్రభావంతో రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఏఐ రాకతో ఉద్యోగాలన్నీ మాయమైపోతాయనే ప్రచారంలో నిజం లేదని సంస్థ స్పష్టం చేసింది. దీనిని ఒక పెద్ద ఉద్యోగ సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదని, ఊహిస్తున్నంత స్థాయిలో నష్టం జరగదని పేర్కొంది.
42-48% మందికి పెరగనున్న ఉత్పాదకత
ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకంటే ఎక్కువ ప్రయోజనం కూడా ఉంది. దాదాపు 42% నుండి 48% మంది ఉద్యోగులకు ఏఐ ఒక అద్భుతమైన సహాయక సాధనంగా మారనుంది. ముఖ్యంగా కింది రంగాల్లో ఏఐ వల్ల పనిభారం తగ్గి, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. హెల్త్‌కేర్ & మెడికల్ సేవలు.. విద్య , బోధన , మీడియా & కంటెంట్ క్రియేషన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ & ప్రొఫెషనల్ సర్వీసెస్, రిపోర్టుల తయారీ, డాక్యుమెంటేషన్, డేటా విశ్లేషణ వంటి రొటీన్ పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేయడం వల్ల ఉద్యోగులు మరింత సృజనాత్మకమైన, విలువైన పనులపై దృష్టి పెట్టవచ్చు.
ఏ రంగాలకు ఎక్కువ ప్రమాదం?
రొటీన్ , పునరావృత పనులు ఎక్కువగా ఉండే విభాగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నివేదిక హెచ్చరించింది. దీనివల్ల
ప్రభావితమయ్యే ప్రధాన రంగాలు టెలికాం, కస్టమర్ కేర్ & కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్.. ఈ విభాగాల్లో ఆటోమేషన్ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని రకాల ఉద్యోగాల అవసరం తగ్గే అవకాశముంది.
అప్‌స్కిల్లింగే ఏకైక మార్గం
ఏఐ ని ఒక ప్రత్యర్థిగా కాకుండా మన పనిని సులభతరం చేసే భాగస్వామిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి కింది నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరం. రోజువారీ పనిలో ఏఐ సాధనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ తో ఏఐ నుండి సరైన అవుట్‌పుట్ పొందడానికి సరైన ప్రశ్నలు/సూచనలు ఇవ్వాలి. డేటా అనలిటిక్స్ & డిజిటల్ స్కిల్స్ తో డేటాను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
జనరేటివ్ ఏఐ ఉద్యోగ మార్కెట్ రూపురేఖలను మారుస్తుందనేది వాస్తవం. కానీ అది కేవలం ఉద్యోగాలను తొలగించడానికే పరిమితం కాదు. కొత్త అవకాశాలను సృష్టించడం, మానవ సామర్థ్యాన్ని పెంచడం కూడా దాని లక్ష్యమే. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అలవరచుకున్న వారికి ఏఐ యుగంలో ఆకాశమే హద్దు.