జూన్ 2న కవిత కొత్త పార్టీ.. ఎట్టకేలకు నిర్ణయం?

తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.;

Update: 2026-02-08 11:09 GMT

తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదు కాబోతోంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత, ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం నినాదాలతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌కు ప్రతీకగా నిలిచే జూన్ 2న పార్టీ పేరు, జెండా, విధివిధానాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి, పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పార్టీ ప్రధానంగా మహిళా సాధికారత, యువతకు ఉపాధి, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. రాజకీయ నిబంధనలు, ఎన్నికల వ్యూహాలపై ఇప్పటికే పలువురు మేధావులు, న్యాయ నిపుణులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

రాజకీయ సమీకరణాలు మారుతాయా?

బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కవిత భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆమె జాతీయ పార్టీల వైపు వెళ్లకుండా సొంత ప్రాంతీయ పార్టీని స్థాపించడమే మేలని భావించినట్లు తెలుస్తోంది. "రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కవిత అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ భావోద్వేగాలను మళ్ళీ రగిలించడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని ఆమె ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారీ బహిరంగ సభకు ప్లాన్?

జూన్ 2న జరగబోయే ఈ ఆవిర్భావ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అనుచరులను, జాగృతి కార్యకర్తలను భారీస్థాయిలో సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రకటనతో అటు బీఆర్‌ఎస్, ఇటు అధికార కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News