తమిళ సీఎం స్టాలిన్ తో జగన్ మంతనాలు
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య అరుదైన కలయిక జరిగింది.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య అరుదైన కలయిక జరిగింది. ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు పలకరించుకోవడంతో పాటు కొంత సేపు ముచ్చటించుకోవడం వర్తమాన రాజకీయాల్లో ఒక విధంగా చూస్తే హాట్ టాపిక్ గా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో స్టాలిన్ కీలకంగా ఉంటూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక జగన్ వైపు నుంచి చూస్తే ఆయన ఏ కూటమిలో లేరు కానీ ఏపీలో ఎన్డీయే కూటమితో పోరాడుతున్నారు. అందులోనూ ప్రత్యేకించి టీడీపీతోనే ఆయనకు రాజకీయ వైరం ఉంది. ఇదే ఇద్దరి మధ్యన తేడా. అయితే స్టాలిన్ జగన్ ల మధ్య మాత్రం మంచి స్నేహ బంధం ఉంది. అంతే కాదు ఇద్దరూ రాజకీయంగా తమ సత్తా చాటుకున్న వారే, ఇద్దరి తండ్రులూ దిగ్గజ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు. ఈ ఇద్దరూ కూడా తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకుని తమను తాముగా రుజువు చేసుకున్న వారుగా ఉండడం విశేషం.
అరుదైన కలయిక అక్కడ :
జగన్ ఎవరినీ సాధారణంగా కలవరు అని చెబుతారు. ఎక్కడికీ కూడా ఆయన పెద్దగా వెళ్ళేది ఉండదు, కానీ చెన్నైకి జగన్ వెళ్ళాల్సి వచ్చింది. చెన్నైలో తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు జగన్ వెళ్ళారు. ఇదే వివాహ వేడుకలు తమిళనాడుకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు అంతా హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఉన్నారు. అలా వేడుకకు వచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్ ను వైఎస్ జగన్ కలిశారు. కొద్దిసేపు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు. మరి ఏమి మాట్లాడుకున్నారు అన్నది ఎవరికీ తెలియకపోయినా ఈ సన్నివేశం మాత్రం అందరికీ ఆకట్టుకుంది. వర్తమాన రాజకీయాల్లో రెండు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కీలక ప్రాంతీయ పార్టీల అధినేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అంటే దాని మీద చర్చ అయితే మొదలైపోతుంది. ఇపుడు అదే జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది కూడా.
తమిళ స్టార్ సూర్యతో :
అంతే కాదు ఈ పెళ్ళికి వచ్చిన తమిళ స్టార్ సూర్య ఆయన సోదరుడు హీరో కార్తీలతో కూడా జగన్ ఎంతో ఉత్సాహంగా గడపడం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ పెళ్ళి మండపంలో జగన్ అయితే మొదటి వరసలో కూర్చున్నారు. హీరోలు సూర్య కార్తీలు రాగానే జగన్ వారిద్దరిని తానే స్వయంగా పలకరించి హగ్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ ముగ్గురూ కలసి ముచ్చట్లు పెట్టడం కూడా వీడియో బైట్లను అభిమానులు సోషల్ మీడియాలో పెట్టేశారు