ఏ బ్రాండ్ తాగివచ్చాడో పాపం..! కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత ఆదివారం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.;

Update: 2025-12-25 12:42 GMT

టీడీపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబుపైన విశాఖ సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులపైన ఆదివారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాలుగు రోజుల తర్వాత స్పందించింది. తొలుత కేసీఆర్ వ్యాఖ్యలపై ఎవరూ ప్రతిస్పందించొద్దని ఆ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ, గురువారం సింగనమల టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఎస్ రాజు విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అంటూ మండిపడుతున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత ఆదివారం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిస్పందనగా గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కుమారుడు కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం వల్ల కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. అంతేకాకుండా ‘‘పాపం రెండు సంవత్సరాల పాటు ఫాంహోసులో ఉండిపోయి ఏం తాగివచ్చాడో.. ప్రజలకు ముఖం చూపించలేక అతనికి అతను దేశానికి నేతగా భ్రమిస్తున్నాడు’’ అంటూ ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అధినేతపై ఏపీలో ఏ నేత కూడా ఇంతవరకు ఈ స్థాయిలో మాట్లాడకపోవడంతో ఎమ్మెల్యే వీడియో క్షణాల వ్యవధిలోనే వైరల్ గా మారింది. తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ స్థాయిలో మాటల యుద్దం కొనసాగడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కొందరు కాంగ్రెస్ నేతలు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతుంటారు. అక్కడ అది సహజంగా మారిపోయిందని అంటున్నారు. కానీ, తొలిసారిగా ఏపీకి చెందిన నేతలు ఈ స్థాయిలో మాట్లాడటమే ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

నిజానికి కేసీఆర్ విమర్శలు చేసి నాలుగు రోజులు అవుతోంది. ఇంతవరకు టీడీపీ తరఫున ఎవరూ ఆయన విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు మాట్లాడలేదు. తెలంగాణ నేతలు ఒకరిద్దరు మాట్లాడినా పెద్దగా చర్చలోకి రాలేదని చెబుతున్నారు. అయితే దళిత నేత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం తెలంగాణ నేతల రేంజిలో విమర్శలు చేయడం కాకరేపుతోందని అంటున్నారు. ఆయన ఇలా మాట్లాడటానికి పార్టీ ఆదేశాలే కారణమా? లేక యాధృచ్ఛికంగానే స్పందించారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News