టి20 ప్ర‌పంచ క‌ప్... చిన్న జట్లే చిర్రెత్తిస్తున్నాయి

భార‌త్, ఇంగ్లండ్, పాకిస్థాన్.. ఏ ఫార్మాట్ లో అయినా ఈ మూడూ ప్ర‌పంచ క్రికెట్ లో పెద్ద‌జ‌ట్లు.. టి20 ఫార్మాట్లో చాంపియ‌న్లు కూడా..! కానీ, ఈ మూడు జ‌ట్లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో త‌మ తొలి మ్యాచ్ లో కిందామీద ప‌డ్డాయి.;

Update: 2026-02-08 17:45 GMT

భార‌త్, ఇంగ్లండ్, పాకిస్థాన్.. ఏ ఫార్మాట్ లో అయినా ఈ మూడూ ప్ర‌పంచ క్రికెట్ లో పెద్ద‌జ‌ట్లు.. టి20 ఫార్మాట్లో చాంపియ‌న్లు కూడా..! కానీ, ఈ మూడు జ‌ట్లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టి20 ప్ర‌పంచ క‌ప్ లో త‌మ తొలి మ్యాచ్ లో కిందామీద ప‌డ్డాయి. పోనీలే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు పెద్ద‌వి అనుకుంటే, అది పొర‌పాటే. ఈ చాంపియ‌న్ల‌కు ఎదురైన‌ది కూడా సాదాసీదా జ‌ట్లే. మ‌రొక్క మాట‌లో చెప్పాలంటే, ప‌సికూన‌లు కూడా. కానీ, తామేమీ ఆట‌లో త‌క్కువ కాదంటూ పెద్ద‌న్న‌ల‌ను వ‌ణికించాయి. అనుభ‌వం లేక‌నో, ఫినిషింగ్ లేక‌నో త్రుటిలో త‌ప్పింది కానీ., లేదంటే భార‌త్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జ‌రుగుతున్న టి20 ప్రపంచ‌క‌ప్ లో ఇప్ప‌టికే మూడు సంచ‌ల‌నాలు న‌మోద‌య్యేవి. ఇప్పుడు త‌ప్పినా మున్ముందు అయినా ఈ సెన్సేష‌న్ కు అవ‌కాశం లేక‌పోలేదు.

పాక్ ను మూడు చెరువుల నీళ్లు తాగించి..

2009 టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత పాకిస్థాన్ ను నెద‌ర్లాండ్స్ శ‌నివారం మూడు చెరువుల నీళ్లు తాగించింది. కేవ‌లం 147 ప‌రుగులు మాత్ర‌మే చేసినా.. ఆ స్కోరును కాపాడుకునేందుకు చాలా ప్ర‌య‌త్నించింది. 12 బంతుల్లో 29 ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితిని పాక్ కు క‌ల్పించింది. అయితే, 19వ‌ ఓవ‌ర్ లో నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ వాన్ బీక్ ల‌య త‌ప్పి 24 ప‌రుగులు ఇవ్వ‌డం ఆ జ‌ట్టు కొంప‌ముంచింది. బ్యాట‌ర్ ఫాహీమ్ అష్రాఫ్ ఆప‌ద్బాంధ‌వుడిలా 24 ప‌రుగులు బాది పాక్ నెత్తిన పాలు పోశాడు. చివ‌రి ఓవ‌ర్ లో స‌మీక‌ర‌ణం ఆరు బంతుల్లో 5గా మార‌డంతో పాక్ గెలుపు సులువైంది. లేదంటే నెద‌ర్లాండ్స్ పెద్ద సంచ‌ల‌న‌మే న‌మోదు చేసేది.

భార‌త్ ను భార‌త సంత‌తి వారే ఆటాడించారు..

శ‌నివారం టీమ్ ఇండియా త‌మ తొలి మ్యాచ్ ను అమెరికాతో ఆడింది. ఏడుగురు భార‌త సంత‌తి ఆట‌గాళ్లే ఉన్న అమెరికా జ‌ట్టు అస‌లు మ‌న‌కు పోటీనే కాదు అనుకున్నారు. అందులోనూ టాస్ ఓడిన ప్ర‌త్య‌ర్థి బౌలింగ్ ఎంచుకుంటే ఇక ప‌రుగుల పండుగే అనుకున్నారు. హార్డ్ హిట్టింగ్ ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్, అభిషేక్ శ‌ర్మ‌ల‌తో పాటు హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ చెల‌రేగి స్కోరును 250కు చేరుస్తార‌ని భావించారు. కానీ, ఈ ముగ్గురే కాదు.. రింకూ సింగ్, ఆల్ రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా ,శివ‌మ్ దూబె, అక్ష‌ర్ ప‌టేల్ కూడా విఫ‌ల‌మ‌య్యారు. కేవ‌లం కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ (84 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియా బ‌చాయించింది. 162 ప‌రుగుల టార్గెట్ పెట్టింది. కానీ, 132 ప‌రుగులు చేసి అమెరికా దాదాపు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. 29 ప‌రుగుల తేడాతో ఓడింది. సూర్య ఇన్నింగ్స్ గ‌నుక లేకుంటే, లేదా అత‌డు ఏ 50 వ‌ద్ద‌నో ఔట్ అయి ఉంటే.. టీమ్ఇండియాకు షాక్ త‌గిలి ఉండేది అన‌డం ఖాయం.

ఇంగ్లండ్ కు ముచ్చెమ‌ట‌లు..

ఆదివారం మ‌రో చిన్న జ‌ట్టు పెద్ద జ‌ట్టుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. మాజీ చాంపియ‌న్ ఇంగ్లండ్ ను నేపాల్ దాదాపు ఓడించిందా? అనుకునే ప‌రిస్థితి తెచ్చింది. పాక్, భార‌త్ ఎదుర్కొన్న నెద‌ర్లాండ్స్, అమెరికాల‌తో పోల్చితే నేపాల్ ఇంకా చిన్న జ‌ట్టు. కానీ, భ‌యంకర హిట్ట‌ర్లున్న ఇంగ్లండ్ ను 184 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. ఆపై 180 ప‌ర‌గులు చేసింది. చివ‌ర‌కు 4 ప‌రుగుల తేడాతో పరాజ‌యం పాలైంది. ఓడినా నేపాల్ పోరాటం ఆక‌ట్టుకుంది.

-చిన్న జ‌ట్ల‌లో పెద్ద‌దైన అఫ్ఘానిస్థాన్ కూడా న్యూజిలాండ్ పై 182 ప‌రుగులు చేసింది. ప్ర‌త్య‌ర్థిని 18వ ఓవ‌ర్ ఐదో బంతి వ‌ర‌కు నిలువ‌రించింది.

-బంగ్లాదేశ్ గైర్హాజ‌రీతో చాన్స్ ద‌క్కిన స్కాట్లాండ్.. రెండుసార్లు చాంపియ‌న్ వెస్టిండీస్ కు పోటీ ఇచ్చింది. 183 ప‌రుగుల టార్గెట్ అందుకునే క్ర‌మంలో 147 ప‌రుగులు చేసింది.

-మ‌రో చాంపియ‌న్ జ‌ట్టు శ్రీలంక‌ను ఆదివారం ఐర్లాండ్ 163 ప‌రుగుల‌కు క‌ట్ట‌డి చేసింది.

-మొత్తానికి టి20 ప్ర‌పంచ‌క‌ప్ రంజుగానే మొద‌లైంది. ఆరు మ్యాచ్ లు ర‌స‌వ‌త్త‌రంగానే జ‌రిగాయి అనుకోవాలి.

Tags:    

Similar News