'శాంతి లేదు'... టీవీకే విజయ్ పై సరికొత్త ఫిర్యాదు!

ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఆయనపై ఓ కొత్త ఫిర్యాదు వచ్చింది. ఆయన వల్ల పనైయూర్ ప్రాంతంలోని ప్రజలు శాంతిని కోల్పోతున్నట్లు చెబుతున్నారు!;

Update: 2026-02-08 17:38 GMT

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన టీవీకే పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు తన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ పొందకపోవడంతో అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఆయనపై ఓ కొత్త ఫిర్యాదు వచ్చింది. ఆయన వల్ల పనైయూర్ ప్రాంతంలోని ప్రజలు శాంతిని కోల్పోతున్నట్లు చెబుతున్నారు!

అవును... నిన్న మొన్నటివరకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వార్ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే ఉంటుందనే చర్చ జరిగిన నేపథ్యంలో.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీ.. తాజాగా వెలువడిన సర్వేలు.. తమిళనాట త్రిముఖ పోరు తప్పదని చెబుతున్నాయి. ఈ క్రమంలో పనైయూర్ లోని టీవీకే కార్యాలయంలో ఆప్షనల్ నామినేషన్స్ ఫారాలను తీసుకోవడానికి వాలంటీర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో.. ఆ ఉన్నత స్థాయి పరిశరాల్లోని ప్రజానికం మండిపడుతున్నారు.

ఇటీవల పనైయూర్ లో టీవీకే వాలంటీర్లు, విజయ్ అభిమానుల్లు వేలాదిగా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారి సంఖ్య సుమారు 3,000కు పైగా ఉంటుందని స్థానిక మీడియా నివేదించింది. ఈ సంఖ్య అటు టీవీకే పార్టీని, విజయ్ అభిమానులను సంతోషపరిచినప్పటికీ.. ఆ ఆఫీసు పరిశరాల్లోని నివాసితులు మాత్రం మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని.. రోడ్లపై బారికేడ్లు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు.

పార్టీ కార్యాలయానికి ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రావడంతో వారిని అదుపుచేయడానికి, వాహనాలను క్రమబద్దీకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెబుతూ.. మీడియాకు ఫిర్యాదు చేస్తున్నారు స్థానిక నివాసితులు. ఈస్ట్ కోస్ట్ రోడ్ లో తాము ప్రశాంతంగా ఉండగలమని భావించి, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఇక్కడికి వస్తే.. ఇక్కడ ఈ సరికొత్త సమస్య ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇలా నిత్యం వేలాది మంది తరలివస్తుంటే.. ఈ రోడ్లపై తాము తిరగగలమా.. ఈ ప్రాంతంలో నివసించగలమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో అసోసియేషన్ జోక్యం చేసుకోవచ్చని చెబుతున్నారు! గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా.. తాము తమ వీధుల్లో స్వేచ్ఛగా నడవలేకపోతున్నామని.. రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఉంటున్నాయని చెబుతున్నారు. పైగా.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని చెబుతున్నారు.

మరి ఈ సమస్యకు విజయ్ ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారనేది వేచి చూడాలి. ఇందులో భాగంగా... కార్యాలయాన్ని మరో చోటికి మారుస్తారా.. లేక, స్థానికులనే కాస్త కొంతకాలం పాటు సర్ధుకుని, సహకరించమని కోరి ఒప్పిస్తారా అనేది చూడాలి!

Tags:    

Similar News